కేంద్రాన్ని బతిమాలుదాం.. ఒత్తిడి తేవద్దు
♦ టీడీపీపీ సమావేశంలో ఎంపీలకు బాబు సూచన
♦ రైల్వే బడ్జెట్‌లో గతం కంటే కేటాయింపులు బాగానే చేశారు
♦ రైల్వే జోన్ ఎందుకివ్వలేదో కారణం చెబితే బాగుండేది
♦ భేటీకి హాజరైన బీజేపీ సభ్యులు హరిబాబు, గోకరాజు
సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలపై కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదని టీడీపీ నిర్ణయించింది. బతిమాలి నిధులు సాధించుకోవడమొక్కటే మార్గమని అభిప్రాయపడింది. ఆదివారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ(టీడీపీపీ) సమావేశానికి ఏపీ, తెలంగాణలకు చెందిన టీడీపీ ఎంపీలతోపాటు ఏపీ బీజేపీ ఎంపీలు హరిబాబు, గోకరాజు గంగరాజులు హాజరయ్యారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులతోపాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
రైల్వేబడ్జెట్‌లో ఏపీకి చేసిన కేటాయింపులపట్ల చంద్రబాబు సంతృప్తి వ్యక్తంచేశారు. గతంలో రైల్వేబడ్జెట్‌లలో చేసిన కేటాయింపులకంటే ఈసారి మెరుగుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరు ఎంపీలు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని మనం పదేపదే కోరినా బడ్జెట్‌లో ప్రకటన లేకపోవడాన్ని ప్రస్తావించగా.. ప్రకటన చేయకపోవడానికి కారణాలేమిటో తెలియదని, అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండని చంద్రబాబు వారికి సూచించారు. రాష్ట్రవిభజన సమయంలో కేంద్రమిచ్చిన హామీల అమలులో భాగంగా ఈసారి బడ్జెట్‌లో ఏమైనా కేటాయింపులు, ప్యాకేజీలు మెరుగ్గా ఉంటాయేమో వేచిచూద్దామన్నారు.
ఒకవేళ ఆశించినంతగా లేకపోతే ప్రధాని, ఆర్థికమంత్రి, నీతిఆయోగ్ దృష్టికి లేఖరూపంలో తెలియచేద్దామన్నారు. కరువు, వరదలవల్ల రాష్ట్రానికి నష్టం జరిగినా కేంద్రంనుంచి ఆశించినంతగా నిధుల కేటాయింపు లేదని ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేయగా.. అది నిజమేనని అంగీకరించిన చంద్రబాబు దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని వారిని కోరారు. కాగా ఇప్పటికే ఇసుక విధానంలో అనుసరించిన వైఖరి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, ఇప్పుడు ఉచిత ఇసుక విధానంతో అపప్రద తెచ్చుకోకుండా చూడాలని ఎంపీలు సూచించారు. ఉచితం పేరుతో పార్టీ నేతలు, ఇతరులు భారీగా ఇసుకను నిల్వచేసి ఇతర రాష్ట్రాలకు తరలించి, రాష్ట్రంలో ఎక్కువ ధరలకు అమ్మితే మరింత చెడ్డపేరు వస్తుందన్నారు.
ప్రత్యేక హోదానా.. అంతకంటే ఎక్కువగానా అనేది తేలుస్తాం: సుజనా
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తారా? అంతకంటే ఎక్కువ ప్యాకేజీ ముట్టజెబుతారా? తేల్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీడీపీపీ సమావేశంలో నిర్ణయించినట్టు కేంద్రమంత్రి సుజనాచౌదరి చెప్పారు. ఎంపీలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకహోదాకు చట్టపరమైన ఇబ్బందులున్నందున..ఎక్కువ నిధులు రాబట్టే మార్గాలను చూస్తున్నట్టు చెప్పారు. రైల్వేజోన్‌ను రైల్వే బడ్జెట్ సవరణలో పెట్టకపోయినా అది వస్తుందని చెప్పారు.
ఫిరాయింపులే లక్ష్యంగా పనిచేయండి..
టీడీపీపీ సమావేశంలో ఫిరాయింపుల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఫిరాయింపులపై నేతలమధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. అయితే వలసలే లక్ష్యంగా పనిచేయడంతోపాటు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎంపీలకు ఈ సందర్భంగా చంద్రబాబు హితబోధ చేశారు. పదవులు, నిధులు, ఇతర విషయాల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పడంద్వారా ప్రతిపక్ష పార్టీలోని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలను టీడీపీలో చేర్పించేందుకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలని సూచించినట్టు సమాచారం. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలలో ప్రతిపక్షాల్ని బలహీనపర్చడంలో అధికారపార్టీలు విజయవంతమయ్యాయని, అందువల్లే అక్కడ ఒకే పార్టీ దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతుందని, ఇక్కడా ఆ పరిస్థితి రావాలంటే ఫిరాయింపులద్వారా పార్టీని బలపర్చుకోవడమే ఏకైక మార్గమని ఎంపీలకు సీఎం సూచించినట్టు తెలుస్తోంది.