
నాడు వైఎస్ పోరాటంతో రాష్ట్రానికి న్యాయం
రైల్వే బడ్జెట్‌లో మనకు తీరని అన్యాయం: రఘువీరా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు లాలూప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉండగా, రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలు వైఎస్ సాధించారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం ఒంటెద్దు పోకడలతో రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందన్నారు. శుక్రవారం ఇందిరభవన్‌లో పార్టీ నేతలు శైలజానాథ్, తులసిరెడ్డి తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్నింటా మోసం చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదని, రాష్ట్ర ప్రయోజనాలా? రాజకీయాలా? ఏది ముఖ్యమో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. అప్పట్లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలందరితో సమావేశమై కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల సాధనకు వైఎస్ కృషి చేశారని, ప్రస్తుతం చంద్రబాబు అలాంటి సంప్రదాయాన్ని పక్కనపెట్టేశారన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం, అసమర్థత వల్లే రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు.