కరుణించు ప్రభు! | railway budjet 2016-2017 special | Sakshi
Sakshi News home page

కరుణించు ప్రభు!

Published Thu, Feb 25 2016 1:38 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

కరుణించు ప్రభు! - Sakshi

కరుణించు ప్రభు!

కృష్ణా- వికారాబాద్ రైల్వేలైన్‌పై ఆశ
శివార్లకు ఎంఎంటీఎస్ వచ్చేనా?
శంషాబాద్‌లో ఎయిర్‌కార్గోకు మోక్షం లభించేనా?
నేటి రైల్వేబడ్జెట్‌పై జిల్లావాసుల గంపెడాశ


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వికారాబాద్- కృష్ణా బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ కేంద్రం కరుణ కోసం నిరీక్షిస్తోంది. నాలుగేళ్ల క్రితం సర్వే పూర్తిచేసుకున్న ఈ లైను పట్టాలెక్కేందుకు నిధులు విదిల్చకపోతారా? అని ఆశగా చూస్తోంది. 121.70 కిలోమీటర్ల ప్రతిపాదిత  ఈ రైలు మార్గానికి రూ.787.80 కోట్లు అవసరమని రైల్వేశాఖ అంచనా వేసింది. అదేసమయంలో సరుకు రవాణాకు ఈలైను అంతగా ఉపయోగపడదని, ప్రయాణికుల నిష్పత్తి కూడా నిర్ధేశితశాతం నమోదు కావడం అసాధ్యమని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా భారంగా మారే ఈ ప్రాజెక్టును చేపట్టడం సాధ్యపడదని స్పష్టం చేసింది. సగటున 14శాతం రేట్ ఆఫ్ రిటర్న్(ఆర్‌ఓఆర్) ఉన్నవాటికే ప్రాధాన్యమిస్తామని, ఈ మార్గంలో కేవలం 6.9 శాతం మాత్రమే వచ్చే వీలుందని రైల్వే ఇంజినీరింగ్ శాఖ తేల్చిచెప్పింది.

ఈ ప్రాంత సామాజిక అవసరాల దృష్ట్యా నిర్మాణ వ్యయంలో సగం వాటాను రాష్ర్ట సర్కారు భరిస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత ఉమ్మడి ప్రభుత్వం భూసేకరణ సహా ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం వెచ్చించేందుకు ముందుకొచ్చింది. అందులో భూసేకరణకు రూ.3,683 కోట్లను కూడా విడుదల చే సేందుకు అంగీకరించింది. అయినప్పటికీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రైల్వేబోర్డు ఈ లైన్ నిర్మాణానికి ఆసక్తి చూపడంలేదు. 2019 నాటికి ఈ మార్గాన్ని అందుబాటులోకి తెస్తామని నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కృష్ణా- వికారాబాద్ రైల్వేలైనుకు పచ్చజెండా ఊపుతారో లేదో వేచి చూడాల్సిందే!
 

రైల్వేమంత్రి సురేశ్‌‘ప్రభు’ రైలుబండిపై
జిల్లా ప్రజానీకం గంపెడాశలు పెట్టుకుంది. గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో ‘రైలు కూత’ వినిపించకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తోంది. పెండింగ్ ప్రాజెక్టులకు లైన్‌క్లియర్, కొత్త మార్గాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా? లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. శంషాబాద్ విమానాశ్రయం ఎయిర్‌కార్గో హబ్‌గా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమం లో సరుకు రవాణాకు అనువుగా రైల్వేలైన్లను విస్తరించాలని భావించినా.. ఇప్పటికీ అతీగతిలేకుండా పోయింది. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా విజయవాడకు ప్రత్యేక రైల్వేలైన్‌ను నిర్మించాలని గతంలో జీఎంఆర్ సంస్థ ప్రతిపాదించిన ఫైలు అటకెక్కింది.

వికారాబాద్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్‌ఓబీ) నిర్మించాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. రాజ్‌కోట్, గరీబ్థ్ ్రతదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇక్కడ ఆపాలనే డిమాండ్ ఉంది.ఆదర్శ స్టేషన్ల నిర్మాణంలోనూ రైల్వేశాఖ అంతులేని జాప్యం చేస్తోంది. అరకొర నిధుల కేటాయింపులతో నిర్మాణ పనులను ఏళ్ల తరబడి సాగదీస్తోంది. 2011-12లో ప్రకటించిన పనులు కూడా ఇప్పటికీ పూర్తికాలేదు. వికారాబాద్, శంకర్‌పల్లి, మల్కాజ్‌గిరి, శేరిలింగంపల్లి ఆదర్శ స్టేషన్లు అధికారుల నిర్లక్ష్యానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ఈ రైలుబండి.. రాలేదండీ!
ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్) రైళ్లను శివారు ప్రాంతాలకు పొడగించాలని 2006లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా రెండో దశ విస్తరణ పనులకు రూ.324 కోట్లను కేటాయించింది. ఈ నిధుల్లో మూడోవంతు నిధులను రైల్వేశాఖ భరిస్తుండగా, మిగతా నిధులను రాష్ర్టం వ్యయం చేస్తోంది. ఈ నిధులతో శివారు ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో రెండో, మూడు లైన్ ను కొత్తగా వేయాలని ప్రతిపాదించారు. రెండో దశ కింద సికింద్రాబాద్ -మేడ్చల్ (28కి.మీ), ఫలక్‌నుమా -శంషాబాద్ (20కి.మీ), సికింద్రాబాద్- ఘట్‌కేసర్ (19కి.మీ), అలాగే మౌలాలి -సనత్‌నగర్ (21కి.మీ), మౌలాలి -కాచిగూడ(10కి.మీ), తెల్లాపూర్ -పటాన్‌చెరు (8కి.మీ) రూట్‌లలో ఎంఎంటీఎస్‌ను విస్తరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా సిగ్నలింగ్, విద్యుద్ధీకరణ, స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కొత్త ప్రాంతాలకు ఎంఎంటీఎస్ రైళ్లను పొడగించాలనే ఉద్ధేశంతో విడుదల చేసిన నిధులు మూలుగుతున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడంలేదు. ఇప్పటివరకు కనీస భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement