ఆధునీకరణకు పెద్దపీట | Corporates have welcomed the railway budget | Sakshi
Sakshi News home page

ఆధునీకరణకు పెద్దపీట

Published Fri, Feb 27 2015 2:15 AM | Last Updated on Sat, Sep 22 2018 8:06 PM

ఆధునీకరణకు పెద్దపీట - Sakshi

ఆధునీకరణకు పెద్దపీట

రైల్వే బడ్జెట్‌ను స్వాగతించిన కార్పొరేట్లు
ముంబై: ఆధునీకరణకు పెద్ద పీట వేస్తూ, రైల్వే బడ్జెట్ ఆచరణాత్మకంగా ఉందని కార్పొరేట్ దిగ్గజాలు అభిప్రాయపడ్డారు. రైల్వే ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా స్పష్టమైన ప్రతిపాదనలు బడ్జెట్‌లో ప్రస్తావించారని పేర్కొన్నారు. ఆదాయాన్ని పెంచుకునే దిశగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు పలు వినూత్న ప్రతిపాదనలు చేశారని గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్ చెప్పారు. బీమా, పెన్షన్ ఫండ్స్ తదితర మార్గాల ద్వారా రైల్వేలో దీర్ఘకాలికంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిపాదించిన చర్యలు దీర్ఘకాలికంగా రైల్వేకు మేలు చేయగలవని ఆయన తెలిపారు. కీలకమైన పలు రైల్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇవి తోడ్పడగలవన్నారు.
 
మరోవైపు రైల్వేను లాభసాటి రవాణా సాధనంగా మార్చేందుకు మార్గనిర్దేశం చేసేలా బడ్జెట్ ఉందని ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ హోల్డింగ్ చైర్మన్ వైఎం దేవస్థలి చెప్పారు. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు మార్కెట్  నుంచి నిధులు సమీకరించేలా చేపట్టిన సంస్కరణలను స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థిరంగా ఆదాయాన్ని సమకూర్చుకునేలా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులపై దృష్టి పెట్టడమూ హర్షణీయమన్నారు.

ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ప్రాతిపదికన చేపట్టబోయే ప్రాజెక్టులు.. రైల్వేను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు తోడ్పడగలవన్నారు. రైల్వేలను ఆధునీకరించడానికి మంత్రి సురేశ్ ప్రభు రూపొందించిన సమగ్ర ప్రణాళికగా బడ్జెట్‌ను సీఐఐ ప్రెసిడెంట్ అజయ్ శ్రీరామ్ అభివర్ణించారు. రాబోయే అయిదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలతో రైల్వేస్ అత్యాధునికంగా మారగలదని, ఆర్థిక వృద్ధికి గణనీయంగా తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు.
 
ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని సరళతరం చేశారని, దీర్ఘకాలిక దృష్టితో బడ్జెట్‌ను రూపొందించారని త్వరలో సీఐఐకి కొత్త ప్రెసిడెంట్‌గా పగ్గాలు చేపట్టబోయే సుమీత్ మజుందార్ వ్యాఖ్యానించారు. ఒకవైపు ప్రయాణికుల అవసరాలకు పెద్ద పీట వేస్తూ, మరోవైపు రవాణా సేవలను మెరుగుపర్చే విధంగా రైల్వే బడ్జెట్ ఉందని జీఈ దక్షిణాసియా విభాగం ప్రెసిడెంట్ బన్‌మాలి ఆగ్రావాలా చెప్పారు.
 
కేవలం హామీలే..: జిందాల్ స్టీల్ అండ్ పవర్ సీఈవో రవి ఉప్పల్ మాత్రం రైల్వే బడ్జెట్‌పై పెదవి విరిచారు. సమగ్రంగా లేదని, కేవలం హామీలే గుప్పించారని వ్యాఖ్యానించారు. బొగ్గు రవాణా చార్జీలను పెంచడమనేది.. పరిశ్రమలను, మేక్ ఇన్ ఇండియా నినాదం స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ఇక, ఉక్కు రవాణా చార్జీలను కూడా పెంచకుండా ఉండాల్సిందని ఉప్పల్ అభిప్రాయపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement