Pension funds
-
పింఛన్ డబ్బులు ఇవ్వలేదని వృద్ధుల ధర్నా
జాతీయ రహదారిపై బైఠాయింపు కృష్ణజమ్మపురం(పాలసముద్రం): మండల పరిధిలోని బ్యాంకుల్లో పింఛన్ సొమ్ము ఇవ్వడం లేదంటూ శనివారం బెంగళూరు– పళ్లిపట్టు జాతీయ రహదారిపై వృద్ధులు, వితంతువులు ధర్నాకు దిగారు. మధ్యాహ్నం 12 గంటల నుంటి 2 గంటల వరకు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పక్షంరోజులుగా గంటల తరబడి క్యూలో నిలుచున్నా.. డబ్బు ఇవ్వడం లేదని వాపోయారు. తమ వద్ద కేవలం రూ.2 వేల నోట్లే ఉన్నాయని, పింఛన్ డబ్బు రూ. 1000 ఇవ్వలేమని బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నట్లు వాపోయారు. ధర్నా వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో ఎంపీడీవో రుక్మణమ్మ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు రోజుల్లో పింఛను డబ్బు ఇంటివద్దే అందిస్తామని స్పష్టం చేశారు. దీంతో వారు ధర్నా విరమించారు. వి. కోటలో.. వి.కోట: రోజుల తరబడి నగదు లేదని చెబుతుండడంతో వి.కోట ఆంధ్రాబ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. అప్పటికీ సిబ్బంది స్పందించకపోవడంతో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు వల్ల తమ జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయని, రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగుతున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు సర్దిచెప్పడంతో ఖాతాదారులు ఆందోళన విరమించారు. -
స్టార్టప్‌లకు ఎల్ఐసీ, పెన్షన్ ఫండ్స్ నిధులు!
ఒడీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్ న్యూఢిల్లీ: జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ), పెన్షన్ ఫండ్స్.. స్టార్టప్‌లకు నిధులందజేయాలని డీఐపీపీ(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్-పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం) కార్యదర్శి రమేశ్ అభిషేక్ పేర్కొన్నారు. సీఐఐ, డబ్ల్యూఈఎఫ్ల అధ్వర్యంలో ఇక్కడ జరిగిన ఇండియా ఎకనామిక్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. ఇండియా ఎకనామిక్ సమిట్‌లో భాగంగా స్టార్టప్‌లకు సంబంధించిన సదస్సులో ఎల్ఐసీ వంటి బడా కంపెనీలు స్టార్టప్‌లకు నిధులందజేయాలన్న పిన్స్టార్మ్ అండ్ సీడ్‌ఫండ్ స్టార్టప్ వ్యవస్థాపకులు మహేశ్ మూర్తి సూచనను అభిషేక్ సమర్థించారు. పాత నియమాలకు చెల్లు చీటీ.. స్టార్టప్‌ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన ప్రయత్నాలు చేస్తోందని అభిషేక్ పేర్కొన్నారు. సిడ్బి సంస్థ రూ.10,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను నిర్వహిస్తోందని, వీలైనంత త్వరలోనే దీనిని రూ.50,000 కోట్ల స్థాయికి విస్తరిస్తామని వివరించారు. కొత్త టెక్నాలజీలు, నవకల్పనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పాత నియమ నిబంధనలను మార్చాల్సిన అవసరమున్నదని, ఈ విషయమై నియంత్రణ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. ఈ-ఫార్మసీ సంస్థలు చట్టానికి వ్యతిరేకం కాదని వివరించారు. స్టార్టప్‌లకు సంబంధించి 25 సమస్యలను గుర్తించామని, ఈ విషయమై వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలను అప్రమత్తం చేశామని తెలి పారు. స్టార్టప్‌లకు భారత బడా కంపెనీలు నిధులు అందించాల్సిన అవసరముందని పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. స్టార్టప్‌లకు స్థానిక కంపెనీల నుంచి తోడ్పాటు అవసరమని వివరించారు. అయితే స్టార్టప్‌లకు నిధులు పెద్ద సమస్య కాదని, స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని ఓయో రూమ్స్ సీఈఓ రితేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. -
మరిన్ని పెన్షన్ నిధులు మార్కెట్లోకి రావాలి: సెబీ
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ఓ పెట్టుబడుల మాదిరిగానే ఇతర పెన్షన్ ఫండ్స్ కూడా స్టాక్ మర్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్) ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ముందుకురావడాన్ని సెబీ చైర్మన్ యూకే సిన్హా స్వాగతించారు. ఉద్యోగుల నుంచి వచ్చే వార్షిక చందా మొత్తంలో 5 శాతాన్ని(దాదాపు రూ.5,000 కోట్లు) ఈ ఏడాది ఈటీఎఫ్‌లలో వెచ్చించనున్నట్లు ఇటీవలే ఈపీఎఫ్ఓ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోల్ మైనర్స్ ఫండ్, అస్సామ్ టీ ప్లాంటర్స్ ఫండ్ వంటి ఇతర ప్రభుత్వ రంగ పెన్షన్ ఫండ్స్ కూడా మార్కెట్ పెట్టుబడులపై దృష్టిసారించాల్సిందిగా సిన్హా కోరారు. కాగా, పెట్టుబడి పరిమితిని పెంచాలని కూడా ఆయన సూచించారు. అయితే, ఈ ఏడాది 5 శాతంగా ఉన్న పరిమితిని వచ్చే ఏడాది నుంచి 15 శాతానికి పెంచే అవకాశాలు ఉన్నాయని కూడా ఈపీఎఫ్ఓ వెల్లడించడం గమనార్హం. ఈపీఎఫ్ఓకు ప్రస్తుతం రూ. 6.5 లక్షల కోట్ల మూలనిధి(కార్పస్) ఉంది. దీంతో పాటు ఏటా రూ.లక్ష కోట్ల వరకూ చందా రూపంలో లభిస్తోంది. ఇక దేశంలో 1,500 వరకూ ఇతర పెన్షన్ ఫండ్లు ఉన్నాయి. వీటి మొత్తం కార్పస్ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లుగా అంచనా. -
ఆధునీకరణకు పెద్దపీట
రైల్వే బడ్జెట్‌ను స్వాగతించిన కార్పొరేట్లు ముంబై: ఆధునీకరణకు పెద్ద పీట వేస్తూ, రైల్వే బడ్జెట్ ఆచరణాత్మకంగా ఉందని కార్పొరేట్ దిగ్గజాలు అభిప్రాయపడ్డారు. రైల్వే ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా స్పష్టమైన ప్రతిపాదనలు బడ్జెట్లో ప్రస్తావించారని పేర్కొన్నారు. ఆదాయాన్ని పెంచుకునే దిశగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు పలు వినూత్న ప్రతిపాదనలు చేశారని గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్ చెప్పారు. బీమా, పెన్షన్ ఫండ్స్ తదితర మార్గాల ద్వారా రైల్వేలో దీర్ఘకాలికంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిపాదించిన చర్యలు దీర్ఘకాలికంగా రైల్వేకు మేలు చేయగలవని ఆయన తెలిపారు. కీలకమైన పలు రైల్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇవి తోడ్పడగలవన్నారు. మరోవైపు రైల్వేను లాభసాటి రవాణా సాధనంగా మార్చేందుకు మార్గనిర్దేశం చేసేలా బడ్జెట్ ఉందని ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్ చైర్మన్ వైఎం దేవస్థలి చెప్పారు. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు మార్కెట్ నుంచి నిధులు సమీకరించేలా చేపట్టిన సంస్కరణలను స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థిరంగా ఆదాయాన్ని సమకూర్చుకునేలా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులపై దృష్టి పెట్టడమూ హర్షణీయమన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ప్రాతిపదికన చేపట్టబోయే ప్రాజెక్టులు.. రైల్వేను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు తోడ్పడగలవన్నారు. రైల్వేలను ఆధునీకరించడానికి మంత్రి సురేశ్ ప్రభు రూపొందించిన సమగ్ర ప్రణాళికగా బడ్జెట్‌ను సీఐఐ ప్రెసిడెంట్ అజయ్ శ్రీరామ్ అభివర్ణించారు. రాబోయే అయిదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలతో రైల్వేస్ అత్యాధునికంగా మారగలదని, ఆర్థిక వృద్ధికి గణనీయంగా తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. ప్రొక్యూర్మెంట్ విధానాన్ని సరళతరం చేశారని, దీర్ఘకాలిక దృష్టితో బడ్జెట్‌ను రూపొందించారని త్వరలో సీఐఐకి కొత్త ప్రెసిడెంట్‌గా పగ్గాలు చేపట్టబోయే సుమీత్ మజుందార్ వ్యాఖ్యానించారు. ఒకవైపు ప్రయాణికుల అవసరాలకు పెద్ద పీట వేస్తూ, మరోవైపు రవాణా సేవలను మెరుగుపర్చే విధంగా రైల్వే బడ్జెట్ ఉందని జీఈ దక్షిణాసియా విభాగం ప్రెసిడెంట్ బన్మాలి ఆగ్రావాలా చెప్పారు. కేవలం హామీలే..: జిందాల్ స్టీల్ అండ్ పవర్ సీఈవో రవి ఉప్పల్ మాత్రం రైల్వే బడ్జెట్‌పై పెదవి విరిచారు. సమగ్రంగా లేదని, కేవలం హామీలే గుప్పించారని వ్యాఖ్యానించారు. బొగ్గు రవాణా చార్జీలను పెంచడమనేది.. పరిశ్రమలను, మేక్ ఇన్ ఇండియా నినాదం స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ఇక, ఉక్కు రవాణా చార్జీలను కూడా పెంచకుండా ఉండాల్సిందని ఉప్పల్ అభిప్రాయపడ్డారు. -
పింఛన్‌దారుని చేతికి నకిలీనోటు !
నాగిరెడ్డిపేట : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆసరా’పథకం ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న డబ్బులలో నకిలీ నోట్లు దర్శనమిస్తున్నట్లు తెలిసింది. మండలంలోని లింగంపల్లికలాన్ గ్రామంలో శుక్రవారం లబ్ధిదారులకు అధికారులు పింఛన్ డబ్బులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఓ లబ్ధిదారుడు పింఛన్ డబ్బులను తీసుకొని, మండలకేంద్రానికి చేరుకొని వెయ్యిరూపాయల నోటును విడిపించే ప్రయత్నం చేయగా అది నకిలీదని తెలినట్లు సమాచారం. దీంతో సదరు బాధితుడు తనకు ఇచ్చిన పింఛన్‌డబ్బులలో నకిలీనోటు రావడంతో ఒక్కసారిగా అవాక్కయాడు. వెంటనే గ్రామానికి చేరుకొని అధికారులకు తిరిగి ఇచ్చేదామనుకునేలోపే వారు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో ఎవరికి చెప్పుకోలేక గుట్టుచప్పుడుకాకుండా సదరు వెయ్యి రూపాయల నకిలీనోటును చెల్లించుకున్నట్లు సమాచారం. స్వయంగా అధికారులు పంపిణీ చేస్తున్న పింఛన్ డబ్బులలో నకిలీనోటు ప్రత్యక్ష ం కావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.