స్టార్టప్లకు ఎల్ఐసీ, పెన్షన్ ఫండ్స్ నిధులు!
ఒడీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్
న్యూఢిల్లీ: జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ), పెన్షన్ ఫండ్స్.. స్టార్టప్‌లకు నిధులందజేయాలని డీఐపీపీ(డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్-పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం) కార్యదర్శి రమేశ్ అభిషేక్ పేర్కొన్నారు. సీఐఐ, డబ్ల్యూఈఎఫ్‌ల అధ్వర్యంలో ఇక్కడ జరిగిన ఇండియా ఎకనామిక్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. ఇండియా ఎకనామిక్ సమిట్‌లో భాగంగా స్టార్టప్‌లకు సంబంధించిన సదస్సులో ఎల్‌ఐసీ వంటి బడా కంపెనీలు స్టార్టప్‌లకు నిధులందజేయాలన్న పిన్‌స్టార్మ్ అండ్ సీడ్‌ఫండ్ స్టార్టప్ వ్యవస్థాపకులు మహేశ్ మూర్తి సూచనను అభిషేక్ సమర్థించారు.
పాత నియమాలకు చెల్లు చీటీ..
స్టార్టప్‌ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన ప్రయత్నాలు చేస్తోందని అభిషేక్ పేర్కొన్నారు. సిడ్బి సంస్థ రూ.10,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను నిర్వహిస్తోందని, వీలైనంత త్వరలోనే దీనిని రూ.50,000 కోట్ల స్థాయికి విస్తరిస్తామని వివరించారు. కొత్త టెక్నాలజీలు, నవకల్పనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పాత నియమ నిబంధనలను మార్చాల్సిన అవసరమున్నదని, ఈ విషయమై నియంత్రణ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని వివరించారు.
ఈ-ఫార్మసీ సంస్థలు చట్టానికి వ్యతిరేకం కాదని వివరించారు. స్టార్టప్‌లకు సంబంధించి 25 సమస్యలను గుర్తించామని, ఈ విషయమై వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలను అప్రమత్తం చేశామని తెలి పారు. స్టార్టప్‌లకు భారత బడా కంపెనీలు నిధులు అందించాల్సిన అవసరముందని పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. స్టార్టప్‌లకు స్థానిక కంపెనీల నుంచి తోడ్పాటు అవసరమని వివరించారు. అయితే స్టార్టప్‌లకు నిధులు పెద్ద సమస్య కాదని, స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని ఓయో రూమ్స్ సీఈఓ రితేశ్ అగర్వాల్ పేర్కొన్నారు.