మరిన్ని పెన్షన్ నిధులు మార్కెట్లోకి రావాలి: సెబీ
న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌ఓ పెట్టుబడుల మాదిరిగానే ఇతర పెన్షన్ ఫండ్స్ కూడా స్టాక్ మర్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్) ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) ముందుకురావడాన్ని సెబీ చైర్మన్ యూకే సిన్హా స్వాగతించారు.
ఉద్యోగుల నుంచి వచ్చే వార్షిక చందా మొత్తంలో 5 శాతాన్ని(దాదాపు రూ.5,000 కోట్లు) ఈ ఏడాది ఈటీఎఫ్‌లలో వెచ్చించనున్నట్లు ఇటీవలే ఈపీఎఫ్‌ఓ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోల్ మైనర్స్ ఫండ్, అస్సామ్ టీ ప్లాంటర్స్ ఫండ్ వంటి ఇతర ప్రభుత్వ రంగ పెన్షన్ ఫండ్స్ కూడా మార్కెట్ పెట్టుబడులపై దృష్టిసారించాల్సిందిగా సిన్హా కోరారు. కాగా, పెట్టుబడి పరిమితిని పెంచాలని కూడా ఆయన సూచించారు. అయితే, ఈ ఏడాది 5 శాతంగా ఉన్న పరిమితిని వచ్చే ఏడాది నుంచి 15 శాతానికి పెంచే అవకాశాలు ఉన్నాయని కూడా ఈపీఎఫ్‌ఓ వెల్లడించడం గమనార్హం. ఈపీఎఫ్‌ఓకు ప్రస్తుతం రూ. 6.5 లక్షల కోట్ల మూలనిధి(కార్పస్) ఉంది. దీంతో పాటు ఏటా రూ.లక్ష కోట్ల వరకూ చందా రూపంలో లభిస్తోంది. ఇక దేశంలో 1,500 వరకూ ఇతర పెన్షన్ ఫండ్‌లు ఉన్నాయి. వీటి మొత్తం కార్పస్ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లుగా అంచనా.