EPFO investment
-
‘వారంతా 18-25 ఏళ్ల వయస్సు వాళ్లే’.. దేశంలో పెరిగి పోతున్న ఉద్యోగం చేసే వారి సంఖ్య
న్యూఢిల్లీ: ఉపాధి కల్పనకు సంబంధించి నవంబర్ సానుకూల సంకేతం ఇచ్చింది. 2022 నవంబర్‌లో నికరంగా 16.26 లక్షల మంది చందాదారులు చేరినట్లు కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన ఒకటి తెలిపింది. 2021 ఇదే నెలతో పోల్చితే ఈ సంఖ్య 16.5 శాతం అధికంగా ఉండడం గమనార్హం. ఇక 2022 అక్టోబర్‌తో పోల్చితే ఈ గణాంకాలు ఏకంగా 25.67 శాతం అధికంగా ఉన్నాయి. తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► నవంబర్‌లో 16.26 లక్షల మంది నికరంగా ఈపీఎఫ్ఓ చందాదారులగా చేరితే అందులో 8.99 లక్ష మంది మొదటి సారి చేరినవారు. ఇలా చేరిన వారు అక్టోబర్‌తో (7.28 లక్షలు) పోల్చితే 1.71 లక్షల మంది అధికం. ► కొత్తగా ఆర్గనైజేషన్‌లో చేరిన వారిలో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సువారు 2.77 లక్షల మంది. 22–25 మధ్య వయస్సు వారు 2.32 లక్షల మంది. మొత్తం కొత్త సభ్యుల్లో 18 నుంచి 25 మధ్య వయస్కుల వారి వెయిటేజ్ 56.60 శాతంగా ఉంది. మొదటిసారి ఉద్యోగంలో చేరినవారు భారీగా సంఘటిత రంగంలోనే నమోదయినట్లు ఈ గణాంకాలు పేర్కొనడం సానుకూల అంశం. ► ఇక దాదాపు 11.21 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓమెంబర్షిప్లో తిరిగి చేరారని కూడా డేటా పేర్కొంది. ఉద్యోగాల మార్పు, ఈపీఎఫ్ఓ కింద ఉన్న సంస్థల్లో తిరిగి చేరడం, తుది పరిష్కారం కోసం దరఖాస్తు చేయడానికి బదులుగా సామాజిక భద్రతా రక్షణను పొడిగిస్తూ వారి నిధిని బదిలీ చేసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకున్నవారు ఇందులో ఉన్నారు. ► ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం, నవంబర్ 2022లో నికర మహిళా సభ్యుల నమోదు సంఖ్య 3.19 లక్షలు. అక్టోబర్ 2022కు సంబంధించి 2.63 లక్షల మందితో పోల్చితే ఇది 0.56 శాతం అధికం. ఈఎస్ఐ స్కీమ్ గణాంకాలు ఇలా... ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈఎస్ఐ స్కీమ్) తొలి విడత 2022 నవంబర్ పేరోల్ డేటాను కూడా కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో సమీక్షా నెల్లో 18.86 లక్షల మంది కొత్త ఉద్యోగులు జతయ్యారు. 2021 నవంబర్‌తో పోల్చితే ఈ సంఖ్య నికరంగా 5.24 లక్షలు పెరిగింది. డేటా ప్రకారం, ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద తమ ఉద్యోగులకు సామాజిక భద్రత కవరేజీని అందజేయడానికి ఉద్దేశించి నవంబర్ 2022 నెలలో దాదాపు 21,953 కొత్త సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. ఈఎస్ఐ కింద నవంబర్‌లో జతయిన 18.86 లక్షల మంది కొత్త ఉద్యోగుల్లో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులు 8.78 లక్షల మంది. నమోదయిన నికర మహిళా సభ్యుల సంఖ్య 3.51 లక్షలు. నవంబర్‌లో మొత్తం 63 మంది ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు కూడా ఈఎస్ఐ స్కీమ్‌లో నమోదు చేసుకున్నట్లు డేటా పేర్కొంది. సభ్యులకు బహుళ ప్రయోజనాలు... ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి ( సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్ల మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఇటీవలే కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. -
రిలయన్స్ క్యాపిటల్ నిర్వాకం.. ఈపీఎఫ్‌వోకి రూ.3,000 కోట్ల నష్టం?
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్‌కు వ్యతిరేకంగా దివాలా అండ్ బ్యాంక్రప్టసీ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కోరింది. రిలయన్స్ క్యాపిటల్ బాండ్లలో ఈపీఎఫ్‌వో రూ.2,500 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఈపీఎఫ్‌వో పెట్టుబడులపై 2019 అక్టోబర్ నుంచి చెల్లింపుల్లో రిలయన్స్ క్యాపిటల్ విఫలమవుతూ వచ్చినట్టు వివరించారు. ఈపీఎఫ్‌వోకు అసలు పెట్టుబడి, వడ్డీ చెల్లింపుల్లో రిలయన్స్ క్యాపిటల్ విఫలమైందా? అంటూ ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ జా అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 2021 నవంబర్ 30 నాటికి ఎన్‌సీడీలపై రిలయన్స్ క్యాపిటల్ రూ.534 కోట్ల వడ్డీని చెల్లించడంలో వైఫల్యం చెందినట్టు చెప్పారు. అసలు వడ్డీతో కలిసి సుమారు రూ.3,000 కోట్లు ఈపీఎఫ్‌వో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో రిలయన్స్ క్యాపిటల్‌కు వ్యతిరేకంగా దివాలా చర్యలు ప్రారంభించాలని కోరుతూ ఆర్బీఐ ఇటీవలే ఎన్సీఎల్టీని ఆశ్రయించడం తెలిసిందే. చదవండి: రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రొసీడింగ్స్ షురూ! -
22 కోట్ల ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్..!
22.55 కోట్ల మంది ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.50 శాతం వడ్డీని పీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది. ఈపీఎఫ్ఓ ప్రస్తుతం పీఎఫ్ పెట్టుబడులపై 8.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ఈపీఎఫ్ఓ 2020-21 సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సభ్యుల ఖాతాలకు వడ్డీ రేటును అక్టోబర్ 30వ తేదీన ఇచ్చిన సర్క్యులర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల కంటే ఎక్కువ విత్ డ్రా ఉన్నందున 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును రిటైర్ మెంట్ ఫండ్ రెగ్యులేటరీ బాడీ మార్చకుండా ఉంచింది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ఈపీఎఫ్ఓ మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్టస్థాయికి(8.5 శాతం) తగ్గించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీరేటు 8.65 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.55 శాతం కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇచ్చిన ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. 22.55 crore accounts have been credited with an interest of 8.50% for the FY 2020-21. @LabourMinistry @esichq @PIB_India @byadavbjp @Rameswar_Teli — EPFO (@socialepfo) December 6, 2021 ఆన్లైన్లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా.. ఈపీఎఫ్ పోర్టల్ https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింకు మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఖాతా ఓపెన్ చేయడానికి మీ యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారా EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. -
ఈక్విటీల్లో ఈపీఎఫ్‌వో రూ.7,715 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం) ఈక్విటీల్లో రూ.7,715 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌తెలి ఈ విషయాన్ని లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. నిబంధనల ప్రకారం ఈపీఎఫ్‌వో తన నిర్వహణలోని మొత్తం నిధుల్లో 15 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే, ఈపీఎఫ్‌వో నేరుగా షేర్లలో కాకుండా ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 2020–21లో ఈపీఎఫ్‌వో ఈక్విటీల్లో రూ.31,025 కోట్లను, 2019–20లో రూ.32,377 కోట్లు, 2018–19లో రూ.27,743 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. -
ఈటీఎఫ్‌ల్లో మరిన్ని ఈపీఎఫ్ఓ పెట్టుబడులు !
హైదరాబాద్: ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)ల్లో రిటైర్మెంట్ నిధి, ఈపీఎఫ్ఓ పెట్టుబడులు పెరిగే అవకాశాలున్నాయని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. వచ్చే నెల 7న జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల(సీబీటీ) సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కొంత మంది నిపుణుల నివేదికలను అధ్యయనం చేశామని, ఈ సమావేశంలో ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడుల పనితీరును చర్చిస్తామని సీబీటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న ఆయన పేర్కొన్నారు. -
మరిన్ని పెన్షన్ నిధులు మార్కెట్లోకి రావాలి: సెబీ
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ఓ పెట్టుబడుల మాదిరిగానే ఇతర పెన్షన్ ఫండ్స్ కూడా స్టాక్ మర్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్) ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ముందుకురావడాన్ని సెబీ చైర్మన్ యూకే సిన్హా స్వాగతించారు. ఉద్యోగుల నుంచి వచ్చే వార్షిక చందా మొత్తంలో 5 శాతాన్ని(దాదాపు రూ.5,000 కోట్లు) ఈ ఏడాది ఈటీఎఫ్‌లలో వెచ్చించనున్నట్లు ఇటీవలే ఈపీఎఫ్ఓ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోల్ మైనర్స్ ఫండ్, అస్సామ్ టీ ప్లాంటర్స్ ఫండ్ వంటి ఇతర ప్రభుత్వ రంగ పెన్షన్ ఫండ్స్ కూడా మార్కెట్ పెట్టుబడులపై దృష్టిసారించాల్సిందిగా సిన్హా కోరారు. కాగా, పెట్టుబడి పరిమితిని పెంచాలని కూడా ఆయన సూచించారు. అయితే, ఈ ఏడాది 5 శాతంగా ఉన్న పరిమితిని వచ్చే ఏడాది నుంచి 15 శాతానికి పెంచే అవకాశాలు ఉన్నాయని కూడా ఈపీఎఫ్ఓ వెల్లడించడం గమనార్హం. ఈపీఎఫ్ఓకు ప్రస్తుతం రూ. 6.5 లక్షల కోట్ల మూలనిధి(కార్పస్) ఉంది. దీంతో పాటు ఏటా రూ.లక్ష కోట్ల వరకూ చందా రూపంలో లభిస్తోంది. ఇక దేశంలో 1,500 వరకూ ఇతర పెన్షన్ ఫండ్లు ఉన్నాయి. వీటి మొత్తం కార్పస్ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లుగా అంచనా.