న్యూఢిల్లీ: ఉపాధి కల్పనకు సంబంధించి నవంబర్ సానుకూల సంకేతం ఇచ్చింది. 2022 నవంబర్‌లో నికరంగా 16.26 లక్షల మంది చందాదారులు చేరినట్లు కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన ఒకటి తెలిపింది. 2021 ఇదే నెలతో పోల్చితే ఈ సంఖ్య 16.5 శాతం అధికంగా ఉండడం గమనార్హం. ఇక 2022 అక్టోబర్‌తో పోల్చితే ఈ గణాంకాలు ఏకంగా 25.67 శాతం అధికంగా ఉన్నాయి. తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
► నవంబర్‌లో 16.26 లక్షల మంది నికరంగా ఈపీఎఫ్‌ఓ చందాదారులగా చేరితే అందులో 8.99 లక్ష మంది మొదటి సారి చేరినవారు. ఇలా చేరిన వారు అక్టోబర్‌తో (7.28 లక్షలు) పోల్చితే 1.71 లక్షల మంది అధికం.
► కొత్తగా ఆర్గనైజేషన్‌లో చేరిన వారిలో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సువారు 2.77 లక్షల మంది. 22–25 మధ్య వయస్సు వారు 2.32 లక్షల మంది. మొత్తం కొత్త సభ్యుల్లో 18 నుంచి 25 మధ్య వయస్కుల వారి వెయిటేజ్ 56.60 శాతంగా ఉంది. మొదటిసారి ఉద్యోగంలో చేరినవారు భారీగా సంఘటిత రంగంలోనే నమోదయినట్లు ఈ గణాంకాలు పేర్కొనడం సానుకూల అంశం.
► ఇక దాదాపు 11.21 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్‌ఓమెంబర్‌షిప్‌లో తిరిగి చేరారని కూడా డేటా పేర్కొంది. ఉద్యోగాల మార్పు, ఈపీఎఫ్‌ఓ కింద ఉన్న సంస్థల్లో తిరిగి చేరడం, తుది పరిష్కారం కోసం దరఖాస్తు చేయడానికి బదులుగా సామాజిక భద్రతా రక్షణను పొడిగిస్తూ వారి నిధిని బదిలీ చేసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకున్నవారు ఇందులో ఉన్నారు.
► ఈపీఎఫ్‌ఓ గణాంకాల ప్రకారం, నవంబర్ 2022లో నికర మహిళా సభ్యుల నమోదు సంఖ్య 3.19 లక్షలు. అక్టోబర్ 2022కు సంబంధించి 2.63 లక్షల మందితో పోల్చితే ఇది 0.56 శాతం అధికం.
ఈఎస్‌ఐ స్కీమ్ గణాంకాలు ఇలా...
ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈఎస్‌ఐ స్కీమ్) తొలి విడత 2022 నవంబర్ పేరోల్ డేటాను కూడా కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో సమీక్షా నెల్లో 18.86 లక్షల మంది కొత్త ఉద్యోగులు జతయ్యారు. 2021 నవంబర్‌తో పోల్చితే ఈ సంఖ్య నికరంగా 5.24 లక్షలు పెరిగింది. డేటా ప్రకారం, ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద తమ ఉద్యోగులకు సామాజిక భద్రత కవరేజీని అందజేయడానికి ఉద్దేశించి నవంబర్ 2022 నెలలో దాదాపు 21,953 కొత్త సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. ఈఎస్‌ఐ కింద నవంబర్‌లో జతయిన 18.86 లక్షల మంది కొత్త ఉద్యోగుల్లో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులు 8.78 లక్షల మంది. నమోదయిన నికర మహిళా సభ్యుల సంఖ్య 3.51 లక్షలు. నవంబర్‌లో మొత్తం 63 మంది ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు కూడా ఈఎస్‌ఐ స్కీమ్‌లో నమోదు చేసుకున్నట్లు డేటా పేర్కొంది.
సభ్యులకు బహుళ ప్రయోజనాలు...
ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి ( సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్‌ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ.
ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్‌ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్ల మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఇటీవలే కేంద్రం ఆమోదముద్ర వేసింది.
గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్‌ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్‌ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment