EPFO: డిసెంబర్‌లో కార్యాలయాల కళకళ..! | EPFO adds 14. 93 lakh net members in the month of december | Sakshi
Sakshi News home page

EPFO: డిసెంబర్‌లో కార్యాలయాల కళకళ..!

Published Tue, Feb 21 2023 4:10 AM | Last Updated on Tue, Feb 21 2023 4:10 AM

EPFO adds 14. 93 lakh net members in the month of december - Sakshi

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ)లో డిసెంబర్‌ 2022లో 14.93 లక్షల మంది కొత్త సభ్యత్వం నమోదయ్యింది. 2021 ఇదే నెలతో పోల్చితే ఇది 2 శాతం (32,635 మంది) అధికమని కార్మిక మంత్రిత్వశాఖ 2022 డిసెంబర్‌కు సంబంధించి విడుదల చేసిన (తొలి) గణాంకాలు పేర్కొన్నాయి.   గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..

► ఈపీఎఫ్‌ఓలో చేరిన 14.93 లక్షల మందిలో దాదాపు 8.02 లక్షల మంది కొత్త ఉద్యోగులు. వీరు మొదటిసారి సామాజిక భద్రతా వ్యవస్థ– ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి వచ్చారు. అంటే మొదటిసారి వ్యవస్థాగతమైన ఉపాధిని వీరు పొందారన్నమాట.  
► కొత్తగా చేరిన 8.02 లక్షల మందిలో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్కులు 2.39 లక్షల మంది. 22–25 సంవత్సరాల మధ్య వారు 2.08 లక్షల మంది. 18 నుంచి 25 సంవ త్సరాల మధ్య వయస్సు కలవారు మొత్తం సంఖ్యలో (8.02 లక్షల మంది) 55.64% మంది.  
► సమీక్షా నెల్లో 3.84 లక్షల మంది ఈపీఎఫ్‌ఓ నుంచి బయటకు వెళ్లగా, 10.74 లక్షల మంది బయ టకు వెళ్లి మళ్లీ కొత్త ఉద్యోగాల్లో చేరారు. తద్వా రా తిరిగి ఈపీఎఫ్‌ఓలో సభ్యత్వం పొందారు.
 
ఈఎస్‌ఐసీలోనూ భారీ పెరుగుదల
కాగా, ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ)లో కూడా 2022 డిసెంబర్‌లో కొత్త ఉద్యోగులు 18.03 లక్షల మంది చేరాయి. 2021 డిసంబర్‌తో పోల్చితే ఈ సంఖ్య 14.52 లక్షలు పెరగడం గమనార్హం. ఈఎస్‌ఐసీ కింద డిసెంబర్‌ 2022లో 27,700 కొత్త సంస్థలు రిజిస్టరయ్యాయి. కొత్తగా చేరిన 18.03 లక్షల మంది ఉద్యోగుల్లో 25 సంవత్సరాలపైబడినవారు 8.30 లక్షల మంది. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈఎస్‌ఐ స్కీమ్‌లో చేరినవారిలో 80 మంది ట్రాన్స్‌జెండర్లు.  

సభ్యులకు బహుళ ప్రయోజనాలు...
ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ.  ఈ ప్రాతిపదికన పేరోల్‌ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్‌ 2018 నుండి  (సెప్టెంబర్‌ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్‌ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్‌ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ.

ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్‌ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్,  బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్‌ఓ దాదాపు 6 కోట్ల  మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది.  పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్లకు పైగా మిగులునూ నిర్వహిస్తోంది.  ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది.

గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్‌ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది.  డెట్‌ ఇన్వెస్ట్మెంట్‌ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్‌ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్‌ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు,  ప్రస్తుతం 15 శాతానికి చేరాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement