న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి సెప్టెంబర్ నెలలో కొత్తగా 16.82 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఇందుకు సంబంధించి గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే కొత్త సభ్యుల్లో 9 శాతానికి పైనే వృద్ధి నమోదైంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిస్‌లేనియస్ చట్టం కింద కొత్తగా 2,861 సంస్థలు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 16.82 లక్షల మంది కొత్త సభ్యుల్లో 9.34 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. అంటే వీరికి కొత్తగా ఉపాధి లభించింది. మిగిలిన సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరిన వారు కావడం గమనార్హం.
ఇక కొత్త సభ్యుల్లో 18–21 ఏళ్ల వయసు నుంచి 2.94 లక్షల మంది, 21–25 ఏళ్ల వయసు నుంచి 2.54 లక్షల మంది ఉన్నారు. 25 ఏళ్ల వయసులోపు వారే 58.75 శాతంగా ఉన్నారు. ఈపీఎఫ్ కవరేజీ నుంచి వైదొలిగే సభ్యుల సంఖ్య గడిచిన మూడు నెలల్లో క్రమంగా తగ్గుతూ వస్తోంది. నెలవారీగా చూస్తే సెప్టెంబర్‌లో ఇలా ఈపీఎఫ్‌వో నుంచి వెళ్లిపోయిన వారు 9.65 శాతం తక్కువగా ఉన్నారు. సెప్టెంబర్ నెలలో చేరిన మహిళలు 3.50 లక్షల మంది (26.36 వాతం)గా ఉన్నారు. వార్షికంగా చూస్తే 7 శాతం వృద్ధి నమోదైంది. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది చేరారు.
Comments
Please login to add a commentAdd a comment