న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో జూలై నెలలో అత్యధికంగా 18.75 లక్షల మంది సభ్యులుగా చేరారు. 2018 ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్‌వో నెలవారీ పేరోల్ గణాంకాలను విడుదల చేస్తుండగా, ఒక నెలలో ఈ స్థాయిలో సభ్యుల చేరిక ఇదే మొదటిసారి. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర కారి్మక శాఖ బుధవారం విడుదల చేసింది. కొత్త సభ్యుల్లో 10.27 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచి్చనవారు కాగా, మిగిలిన వారు ఒక చోట ఉద్యోగం మానివేసి.. మరో సంస్థ తరఫున తాజాగా నమోదు చేసుకున్నారు.
కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసువారే 58 శాతానికి పైగా ఉన్నారు. వీరంతా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. ఇక జూలైలో ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చిన వారిలో 3.86 లక్షల మంది మహిళలు ఉన్నారు. వీరిలో నికరంగా 2.75 లక్షల మంది మొదటిసారి పేర్లు నమోదు చేసుకున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుంచి నికర సభ్యుల చేరిక అధికంగా నమోదైంది. ఈ రాష్ట్రాలే 58.78 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల నుంచి జూలైలో 11.02 లక్షల మంది ఈపీఎఫ్‌వోలో చేరారు.
ఈఎస్‌ఐ కిందకు 19.88 లక్షల మంది
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) నిర్వహించే సామాజిక భద్రతా పథకం ఈఎస్‌ఐ కిందకు జూలై నెలలో 19.88 లక్షల మంది సభ్యులు వచ్చి చేరారు. కొత్తగా 28,870 సంస్థలు ఈఎస్‌ఐసీ కింద నమోదు చేసుకున్నాయి. కొత్త సభ్యుల్లో 25 ఏళ్లలోపు వారు 9.54 లక్షలుగా ఉన్నారు. మహిళా సభ్యులు 3.82 లక్షలుగా ఉన్నట్టు పేరోల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, 52 మంది ట్రాన్స్‌జెండర్లు కూడా ఈఎస్‌ఐ కింద నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment