తిరుపతి మెయిన్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో అనుబంధంగా ఉన్న వెస్ట్, రేణిగుంట, తిరుచానూరు రైల్వేస్టేషన్లను ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసేందుకు తయారు చేసిన డిజైన్లు, ప్రాజెక్ట్ రిపోర్టుల కన్సల్టెన్సీలకే పుణ్య కాలం హరించుకుపోతోంది. గడచిన 12 ఏళ్లలో సుమారు రూ.15 కోట్లమేర ఇందుకోసం రైల్వేశాఖ ఖర్చు చేసింది. ఇప్పటికీ రూపురేఖలు మారకపోవడం ఒక ఎత్తయితే.. మౌలిక వసతులు కల్పించకపోవడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రైల్వే బడ్జెట్‌పై జనం ఆశతో ఉన్నారు.
తిరుపతి అర్బన్: దశాబ్దాల తరబడి జిల్లాకు రైల్వేపరంగా సరైన ప్రాధాన్యం లభించడం లేదు. ఫలితంగా అనేక డిమాండ్లు అమలుకు నోచుకోవడం లేదు. నేటికీ రద్దీ మేరకు రైళ్లు లేకపోగా, తిరుపతికి వస్తున్న యాత్రికులకు కనీస వసతులు కల్పించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తొలి రెండున్నరేళ్లపాటు రైల్వేమంత్రిగా కొనసాగిన సురేష్‌ప్రభుతో జిల్లా ఎంపీలు పలుమార్లు సంప్రదించి నివేదిం చిన అంశాల్లో కొన్నింటికి గ్రీన్ సిగ్నల్ పడ్డాయి. చాలా అంశాలు నేటికీ ఊరిస్తూ ...ఉసూరుమనిపిస్తూ కాలగమనంలో పడిలేస్తున్నాయి. కొత్త రైళ్లు ఏర్పాటు చేయకపోగా, మీటర్‌గేజ్ ఉన్నప్పుడు నడుస్తున్న పాత రైళ్లనైనా పునరుద్ధరించాలన్న డిమాం డ్లకు మోక్షం రావడం లేదు.
కానరాని వరల్డ్‌క్లాస్....ఊరిస్తున్న మోడల్ క్లాస్ దక్షిణమధ్య రైల్వే జోన్‌లోనే అత్యధిక రద్దీ, ఆదాయం సమకూరుస్తున్న రెండో రైల్వేస్టేషన్ తిరుపతి. అందుకు అనుగుణంగా 2008లో అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తిరుపతిని వరల్డ్‌క్లాస్ స్థాయికి తీసుకువెళ్తామంటూ బడ్జెట్‌లో ప్రకటించారు. అనంతరం రైల్వేమంత్రి మారడం, ఉన్నతాధికారుల పర్యటనల్లో మార్పులు సూచించడం వంటి కారణాలతోనే పదేళ్లు గడచిపోయాయి. ఇప్పటికీ వరల్డ్‌క్లాస్ హోదా లేదు. ప్రస్తుత రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ మాత్రం వరల్డ్‌క్లాస్ ఫైల్ ముగిసిపోలేదని చెబుతున్నప్పటికీ ఆ స్థాయిలో పనులకు అడుగు పడటం లేదు. మూడేళ్ల క్రితం మోడల్‌క్లాస్ స్థాయికి చేస్తామంటూ రైల్వేబోర్డు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇప్పుడు తిరుపతి రైల్వే వెలుపల గోడలకు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఆ ఊసేలేదు. అదికూడా ఎప్పుడో 60 ఏళ్లక్రితం నిర్మించిన గోడలకే రంగులు అద్దడం విశేషం. దక్షిణం వైపు రూ.500 కోట్లతో మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లు, అన్నిరకాల కమర్షి యల్ కాంప్లెక్స్‌లు నిర్మించేస్తామంటూ రెండేళ్లుగా ఊరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పనులకు కూడా ఈసారి బడ్జెట్‌లో నిధులు చాలినన్ని మంజూరు చేస్తారా...? అనేది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది.
పాత రైళ్లనైనా పునరుద్ధరించేనా...?
15 ఏళ్లక్రితం వరకు ఉన్న మీటర్‌గేజ్ కాలంలో అనేక రైళ్లను ఆ తర్వాత బ్రాడ్‌గేజ్ వచ్చాక నిలిపేశారు. ప్రస్తుతం ఆయా మార్గాల్లో పెరిగిపోతున్న రద్దీని దష్టిలో ఉంచుకుని గడచిన మూడేళ్లుగా పాతరైళ్ల పునరుద్ధరణకు ఒత్తిడి పెరిగింది. ఆ దిశగానైనా ఈసారి బడ్జెట్‌లో ఆమోదం వచ్చి గ్రీన్ సిగ్నల్ పడాలని ఎదురు చూస్తున్నారు.
పాత రైళ్లు, పెండింగ్ డిమాండ్లు
♦ తిరుపతి నుంచి రామేశ్వరం వరకు 15ఏళ్ల క్రితం నడుస్తున్న డైలీ ఎక్స్‌ప్రెస్
♦ తిరుపతి నుంచి పాకాల–ధర్మవరం మీదుగా హైదరాబాద్‌కు రోజూ ఒకే సమయంలో నడుస్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
♦ తిరుపతి నుంచి వారణాసికి 12 ఏళ్లక్రితం వరకు నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు
♦ తిరుపతి నుంచి చెన్నైకి రాత్రివేళల్లో నడుస్తుండిన ఎక్స్‌ప్రెస్ రైలు
♦ ప్రస్తుతం కోయంబత్తూరు మార్గంలో నడుస్తున్న ఇంటర్‌సిటీని డైలీగా మార్పు చేయాల న్న నాలుగేళ్ల డిమాండ్‌కు మోక్షం కల్పించాలి.
♦ చిత్తూరు జాతీయ రహదారిలో ఎం.బండపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పెండింగ్‌లో ఉంది.
♦ రేణిగుంట మీదుగా చెన్నైకి నడుస్తున్న దాదర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నగరిలో హాల్ట్ ఇవ్వాలన్న డిమాండ్‌కు 6 ఏళ్లుగా ఆచరణ రావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment