23 నుంచి బడ్జెట్ పార్లమెంట్
25న రైల్వే బడ్జెట్.. 29న కేంద్ర బడ్జెట్
* రెండు విడతలుగా పార్లమెంటు సమావేశాలు
* ఈ నెల 23 నుంచి మార్చి 16 వరకూ తొలి విడత
* ఏప్రిల్ 25 నుంచి మే 13 వరకూ రెండో విడత భేటీ
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించే ఈ సమావేశాల్లో ఈ నెల 25న రైల్వే బడ్జెట్‌ను, నెలాఖరు రోజైన 29వ తేదీన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టటానికి ముందు ఈ నెల 26న ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పిస్తారు. బడ్జెట్ సమావేవాలు రెండు విడతలుగా జరుగుతాయి. తొలి విడత ఈ నెల 23 నుంచి మార్చి 16 వరకూ.. రెండో విడత ఏప్రిల్ 25 నుంచి మే 13 వరకు కొనసాగుతాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 24 వరకూ పార్లమెంటు సమావేశాలకు విరామం ఉంటుంది. ఈ సమయంలో పార్లమెంటరీ స్థాయీ సంఘాలు వివిధ బడ్జెట్ బిల్లులను పరిశీలిస్తాయి. మొత్తం 81 రోజుల పాటు బడ్జెట్ సెషన్ కాలం ఉండగా.. అందులో 31 రోజులు పార్లమెంటు సమావేశమవుతుంది. ఈ నెల 23వ తేదీన ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు.
సూచనలు, సెలవులు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం...
బడ్జెట్ సమావేశాల షెడ్యూలును గురువారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాలపై మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య మీడియాకు తెలిపారు. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌లు కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు హాజరయ్యేందుకు వీలుగా, వివిధ పార్టీల నేతల సూచనలు, ఏప్రిల్‌లో సెలవులను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ భేటీ తేదీలను నిర్ణయించినట్లు చెప్పారు.
బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగానే పలు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల ప్రక్రియ మొదలుకానుందని.. పార్లమెంటు సమావేశాల్లో విరామం వద్దని తమకు సలహాలు అందాయని చెప్పారు. 2011లో బడ్జెట్ సమావేశాల సమయంలో పలు రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల ప్రక్రియ మొదలైనందున.. బిల్లులను స్థాయీ సంఘాలకు నివేదించరాదని నిర్ణయించిందని వెంకయ్య ప్రస్తావించారు.
పనిదినాలు తగ్గించొద్దు: ప్రతిపక్షాలు
బడ్జెట్ సమావేశాల ఖరారుపై సీసీపీఏ భేటీకి ముందు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ బడ్జెట్ సమావేశాలకు కోత పెట్టరాదని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ‘‘సమావేశాల పనిదినాలను తగ్గించరాదు. మంత్రిత్వశాఖలకు చేసిన బడ్జెట్ కేటాయింపులను స్థాయీ సంఘాలు పరిశీలించేందుకు వీలుగా సమావేశాల మధ్యలో పూర్తి విరామం ఇవ్వాలి’’ అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆజాద్ మీడియాతో పేర్కొన్నారు.
పార్లమెంటు పనిదినాలను తగ్గించరాదన్న అంశంపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉందని జేడీయూ నేత శరద్‌యాదవ్ చెప్పారు. పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతి ఏటా కేలండర్‌ను రూపొందించి ప్రకటించాలని.. దానివల్ల పార్లమెంటు సమావేశాలు జరిగే తేదీలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను నిర్ణయించటానికి వీలుంటుందని సీపీఎం నేత సీతారాం ఏచూరి సూచించారు.
జీఎస్‌టీ బిల్లు ఆమోదానికి సహకరించాలి
ఈ బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లుతో పాటు రియల్ ఎస్టేట్ తదితర అంశాలకు సంబంధించిన బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందుతాయని వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ బిల్లులు దేశ విస్తృత ప్రయోజనాలకు సంబంధించినవి కాబట్టి వాటిని ఆమోదించటానికి సహకరించాలని ప్రతిపక్షాలకు, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి ఆయన విజ్ఞప్తిచేశారు.
కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు సభా కార్యక్రమాలను స్తంభింపజేసి, కీలక సంస్కరణల బిల్లులను అడ్డుకున్న గత రెండు సమావేశాల తరహాలో కాకుండా.. రాబోయే బడ్జెట్ సమావేశాలు నిర్మాణాత్మకంగా, సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్‌నక్వీ పేర్కొన్నారు. ‘‘ఈ సమావేశాలు సరైన రీతిలో సాగేందుకు వీలుగా మేం అందరితో చర్చిస్తున్నాం. అన్ని పార్టీలతోనూ అధికారికంగా, అనధికారికంగా మాట్లాడుతున్నాం’’ అని చెప్పారు.