పార్లమెంట్లో జైట్లీ ఆర్థిక సర్వే నివేదిక
*ఆర్థిక వృద్ధి రేటు టార్గెట్ 7 శాతం
*ఆరోగ్య, విద్యా రంగాలపై పెట్టుబడులు
*వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత
*ఆర్థిక సర్వే విడుదల
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు తక్కువలోతక్కువ జాతీయ స్థూల ఉత్పత్తిలో 7 నుంచి 7.75 శాతం మధ్య ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకరావాలని, పన్నుల పరిధిని విస్తరించి, పన్నులపై ఇస్తున్న రాయతీలను ఎత్తివేయాలని సూచించింది. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ద్య్రవ్య స్థిరీకరణ టైమ్ టేబుల్ పాటించాలని సూచించింది. వీలైనంత త్వరగా వస్తు సేవల పన్నును అమల్లోకి తీసుకరావాలని అభిప్రాయపడింది. ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడం ఆర్థిక వ్యవస్థను పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని, ఇతరేతర మార్గాల ద్వారా ఈ మేరకు ఆర్థిక వనరులను సమీకరించవచ్చని కూడా అభిప్రాయపడింది.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర జనరల్ బడ్జెట్‌ను సమర్పించడానికి మూడు రోజులు ముందుగా శుక్రవారం నాడు పార్లమెంట్‌కు ఆర్థిక నివేదికను సమర్పించారు. 2016-17 సంవత్సరానికి కనిష్టంగా 7 నుంచి 7.75 శాతం వృద్ధి రేటు సాధిస్తామని, వృద్ధి రేటును 8 నుంచి 10 శాతం రేంజ్‌కు తీసుకెళ్లాలంటే మరి కొన్ని సంవత్సరాలు నిరీక్షించాల్సిందేనని ఆర్థిక నివేదిక వెల్లడించింది. గతేడాది ఆర్థిక సంవత్సరానికి 8.1 నుంచి 8.5 శాతం రేంజ్‌కు వస్తుందని అంచనా వేయగా, 7.6 శాతం వద్దనే ఆర్థిక వృద్ధి రేటు ఆగిపోయింది.
జాతీయ స్థూల ఉత్పత్తిలో ద్రవ్యలోటు 4.5-5 శాతానికి పడిపోతుందని ఆర్థిక నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ద్రవ్యలోటు 1-1.5 శాతం మధ్య ఉండడం వల్ల ధరలు స్థిరంగా ఉన్నాయని అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోవడంతో ద్రవ్యలోటు ప్రధానంగా తగ్గింది. రూపాయి విదేశీ మారక విలువ సముచితంగా కొనసాగించాలని నివేదిక సూచించింది. రూపాయి మరింత బలపడక పోయినా ఆర్థిక సరళీకరణ ద్వారా సముచిత స్థాయిలో రూపాయి విలువను సముచిత స్థాయిలో కొనసాగించవచ్చని అభిప్రాయపడింది. పెట్టుబడుల రాక తగ్గినప్పుడు లేదా బలహీనంగా ఉన్నప్పుడు కొంత మేరకు రూపాయి మారక విలువ తగ్గింపును అనుమతించవచ్చని సూచించింది. చైనా తరహాలో ఆసియాలో కరెన్సీ సర్దుబాట్లను చేసుకోవచ్చని చెప్పింది.
పన్నుల పరిధిని 5.5 శాతం నుంచి 20 శాతానికిపైగా విస్తరించాలని, పన్ను రాయతీలను సమీక్షించి క్రమేణా ఎత్తివేయాలని నివేదిక సూచించింది. 2018-19 నాటికి బ్యాంకులకు పెట్టుబడుల అవసరం 1.8 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా భారత ఆర్థిక పరిస్థితి స్థిరంగా, ప్రపంచంకన్నా బలంగా ఉందని వ్యాఖ్యానించింది. మార్కెట్ వ్యతిరేక విధానాల జోలికి వెళ్లవద్దని, ఆరోగ్య, విద్యా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడింది.