ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ఊపునివ్వడంలో విఫలమైన రైల్వే బడ్జెట్ కారణంగా రైల్వే షేర్లు కుదేలయ్యాయి.
- భారీ ప్రతిపాదనలు లేకపోవడం కారణం
- లాభాల స్వీకరణతో క్షీణించిన పలు రైల్వే షేర్లు
ముంబై: ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ఊపునివ్వడంలో విఫలమైన రైల్వే బడ్జెట్ కారణంగా రైల్వే షేర్లు కుదేలయ్యాయి. రైల్వేలకు సంబంధించిన పలు షేర్లు ఇంట్రాడే ట్రేడింగ్‌లో పెరిగినప్పటికీ, చివరకు నష్టాల్లోనే ముగిశాయి. రైల్వే బడ్జెట్‌లో భారీ సంస్కరణలు ఉంటాయనే అంచనాలతో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న రైల్వే షేర్లలో లాభాల స్వీకరణ జరిగిందని నిపుణులంటున్నారు.
విద్యుదీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రతిపాదన కారణంగా హింద్ రెక్టిఫైర్ 15 శాతం వృద్ధితో రూ.89కు పెరిగింది. సబర్బన్ రైళ్లలో మహిళల భద్రత కోసం నిఘా కెమెరాలు అమరుస్తామన్న ప్రతిపాదనతో జికామ్ సెక్యూరిటీ సిస్టమ్స్ 5 శాతం పెరిగి రూ.179 వద్ద ముగిసింది. శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తామన్న కారణంగా ఏటూజడ్ ఇంజినీరింగ్ 10 శాతం ఎగసి రూ.19 వద్ద ముగిసింది.
టిటాఘర్ వ్యాగన్స్ 0.5 శాతం వృద్ధితో రూ.582కు ఎగసింది. కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ ఎలాంటి మార్పు లేకుండా రూ.49 వద్ద ముగిసింది.సిమ్‌కో 7 శాతం, స్టోన్ ఇండియా 6 శాతం, సింప్లెక్స్ కాస్టింగ్స్ 4.2 శాతం, కాళింది రైల్ నిర్మాణ్ (ఇంజినీర్స్) 4 శాతం చొప్పున క్షీణించాయి. కంటైనర్ కార్పొరేషన్ 3.4 శాతం, టెక్స్‌మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్ 2.5 శాతం, బీఈఎంఎల్ 1.6 శాతం, నెల్కో 1.9 శాతం చొప్పున తగ్గాయి.