ఎనిమిది దశాబ్దాల కలకు.. ‘బంగారు తెలంగాణ’లోనూ మోక్షం కలగడం లేదు. బోధన్–బీదర్ రైల్వే లైన్ పొడిగింపు అడుగు ముందుకు పడట్లేదు. 1938లో నిజాం హయాంలో ప్రతిపాదించిన ఈ రైల్వే మార్గం.. ఇప్పటికీ పట్టాలెక్కలేదు. 2014లో సర్వే పూర్తయినా నిధుల కేటాయింపు లేక ‘లైన్ క్లియర్’ కావట్లేదు. ఈ ‘మార్గం’ సుగమం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే, కేంద్రం కూడా ఆ మేరకు నిధులు ఇవ్వనుంది. అయితే, ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లోనైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందా..? దశాబ్దాల కల సాకారమవుతుందా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.
బాన్సువాడ:
అసంపూర్తిగా ఉన్న బోధన్ రైల్వే లైన్‌ను బీదర్ వరకు పొడిగిస్తే వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో లబ్ధి చేకూరనుంది. ఆయా ప్రాంతాలకు రవాణా వసతులు పెరిగి అభివృద్ధి బాట పట్టే అవకాశముంది. అయితే, సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఆయా ప్రాంతాలకు ఇప్పట్లో ‘రైలు బండి’ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చట్లేదు. 201లో రూ.1,029 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ ప్రాజెక్టు.. జాప్యం కారణంగా ప్రస్తుత అంచనా వ్యయం రెట్టింపయింది. అయితే, మారిన నిబంధనల ప్రకారం ఈ రైల్వే లైన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉంది. ఈ లైన్ ప్రస్తుతం పట్టాలెక్కాలంటే సుమారు రూ.2 వేల కోట్ల వ్యయం కానుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సగం కేటాయిస్తే, కేంద్రం సగం కేటాయించనుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించని కారణంగా ఈ ‘మార్గానికి’ మోక్షం కలగట్లేదు.
ఎనిమిది దశాబ్దాల కల..
బోధన్–బీదర్ రైల్వే లైన్‌ను పొడిగించేందుకు 1938లోనే నిజాం సర్కార్ హయాంలో ప్రతిపాదనలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన రైల్వే లైన్ నిర్మాణం కలగానే మారింది. బోధన్–బాన్సువాడ–బీదర్ ప్రాంత ప్రజల కోరిక మేరకు 2010లో అప్పటి రైల్వే మంత్రి మమతాబెనర్జీ ఈ మార్గానికి ‘లైన్ క్లీయర్’ చేశారు. దశాబ్దాల కల అయిన బోధన్–బీదర్ రైల్వే లైన్‌కు సర్వే కోసం పచ్చజెండా ఊపిన మమతా బెనర్జీ.. ఆదిలాబాద్–పటాన్‌చెరు మధ్య కొత్తగా మరో రైల్వే లైన్ కోసం సర్వే చేసేందుకు పచ్చ జెండా ఊపారు. దీంతో ఈ ప్రాంతం మీదుగా ఒకేసారి రెండు రైల్వే లైన్ల కోసం సర్వే చేయించేందుకు అనుమతి లభించడంతో అందరూ ఎంతో సంబర పడ్డారు. కానీ ఈ ప్రతిపాదనలు పట్టాలెక్కకుండానే కనుమరుగయ్యాయి.
2014లో సర్వే పూర్తి!
2010లో రైల్వే బడ్జెట్‌లో రెండు లైన్లకు లభించిన సర్వే అనుమతుల దృష్ట్యా సర్వే అయితే పూర్తి చేశారు. 138 కిలోమీటర్ల బోధన్–బీదర్ రైల్వే లైన్ కోసం 2011 ఏప్రిల్‌లో ప్రారంభమైన సర్వే 2014లో పూర్తయింది. బోధన్ నుంచి రుద్రూర్, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, పిట్లం మీదుగా నారాయణఖేడ్, బీదర్ వరకు వారు సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం మార్గమధ్యలో భారీ వంతెనలు లేవని తేలింది. కేవలం రూ.1,029 వ్యయంతో లైన్ వేయవచ్చని అధికారులు తేల్చారు. బాన్సువాడ–బోధన్ ప్రధాన రోడ్డుకు ఆవలి వైపు సుమారు 3 కిలోమీటర్ల వ్యత్యాసంలో సర్వే నిర్వహించి, హద్దు రాళ్లను పాతారు. ఈ మేరకు హద్దు రాళ్లు ఆయా పంట పొలాలు, అడవుల్లో ఇప్పటికీ ఉన్నాయి. దశల వారీగా నిర్వహించిన ఈ సర్వేలో మార్గ మధ్యలో వచ్చే నదులపై వంతెనలు, ఎత్తుపల్లాలు ఇతర అన్ని రకాల భౌగోళిక పరిస్థితులపై అంచనా వేసి రైల్వే శాఖ ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు.
నిధుల కేటాయింపుపై సందిగ్ధత
2014లో సర్వే పూర్తవడంతో ఏటా రైల్వే బడ్జెట్‌లో ఎంతో కొంత నిధులు మంజూరవుతాయని అంతా భావించారు. కానీ ఇప్పటివరకు మూడు బడ్జెట్లు పూర్తయినా పైసా కూడా మంజూరు కాలేదు. తెలంగాణలోని కొన్ని కొత్త మార్గాల్లో మెండుగా నిధులు కేటాయించిన కేంద్రం.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బోధన్–బీదర్ రైల్వే లైన్‌కు మొండి చేయి చూపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే ఈ లైన్ పట్టాలెక్కే అవకాశముంది. ఈ మార్గంలో సర్వే పూర్తయినందున రాష్ట్రప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయిస్తే, మరో 50శాతం కేంద్రం కేటాయించనుంది. సుమారు రూ.2వేల కోట్ల అంచనా వ్యయం కాగా, ఇందులో 50శాతం నిధులను రాష్ట్రం కేటాయిస్తేనే కేంద్రం తన వాటా 50 శాతం నిధులు మంజూరు చేయనుం దని అధికారులు చెబుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైంది. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లలో రూపా యి కూడా కేటాయించలేదు. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయిం చాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
50 శాతం నిధులిస్తే..
బోధన్–బీదర్ రైలు మార్గానికి సర్వే పూర్త యింది. రూ.2వేల కోట్ల తో ఈ ప్రాజెక్టు చేపట్టా ల్సి ఉంది. మారిన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయిస్తే 50 శాతం నిధులను కేంద్రం మంజూరు చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపుపైనే ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది. – బీబీ పాటిల్, జహీరాబాద్ ఎంపీ
♦ బోధన్–బీదర్ రైల్వేలైన్ ప్రతిపాదించింది 1938 నిజాం హయాంలో
♦ రైల్వే లైన్ పొడవు 138 కిలో మీటర్లు
(తెలంగాణలో 90 కి.మీ., మహారాష్ట్ర, కర్ణాటకలో 48 కి.మీ.)
♦ లబ్ధి పొందే జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, బీదర్
♦ సర్వే పూర్తయినది 2014లో
♦ అప్పట్లో అంచనా వ్యయం రూ.1,029 కోట్లు
♦ ప్రస్తుత అంచనా రూ.2 వేల కోట్లు
Comments
Please login to add a commentAdd a comment