సర్వేల మీద సర్వేలు...ఇదిగో...అదిగో అంటూ గత ముప్ఫైఏళ్లుగా కబుర్లు. వాస్తవం డొల్ల. రైల్వే బడ్జెట్ పెట్టే సమయంలోనూ, ఎన్నికల వేళ అది తాజా కబురు. ఓట్లను కురిపించే తురుపుముక్క. ఆచరణలో మాత్రం ఆమడ దూరం. ఇదీ మూడు దశాబ్దాలుగా కూతపెట్టని ‘కృష్ణ - వికారాబాద్’ లైన్ కథ. కాగితాల్లోనే నలుగుతున్న నిర్మాణం. అంచనాలు పెరుగుతున్నా.. ఆచరణ రూపం దాల్చని వైనం. ఇక్కడి నేతల తీరుకు మచ్చు తునక.
కోస్గి, న్యూస్‌లైన్ : జిల్లాకు రైల్వే పరంగా ప్రతీ బడ్జెట్‌లోనూ నిరాశే మిగులతోంది. ఎంతమంది నేతలున్నా ఇక్కడి ప్రయాణికుల ఆశలు నెరవేర్చలేకపోతున్నారు. ఇందుకు ప్రబల సాక్ష్యం కృష్ణ-వికారాబాద్ రైల్వే లైన్ నిర్మాణం. దీన్ని కోసం 30 ఏళ్ల కిందట ప్రతిపాదించి ఇప్పటికే అయిదు సార్లు సర్వేలు చేశారు. అంతటితోనే ఇది సమసిపోతోంది. నారాయణపేట డివిజన్ గుండా మక్తల్, ఊట్కూర్, నారాయణపేట, అభాంగాపూర్, మద్దూరు, కోస్గి, సర్జఖాన్‌పేట, దోమ, పరిగి, వికారాబాద్ వరకు 121.70 కిలోమీటర్ల రైల్వే లైన్ కోసం ప్రతిపాదిస్తూ 2010 సంవత్సరంలో రూ.680కోట్లు అవసరమని హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఏరియల్ డాటా సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అప్పటి రైల్వే శాఖామంత్రి మమతాబెనర్జీ రైల్వే బడ్జెట్‌లో కృష్ణ-వికారాబాద్ రైల్వేలైన్ కోసం పార్లమెంట్‌లో ప్రస్తావించినప్పటికీ నిధుల కేటాయింపు జరగలేదు.
ఎన్నికల హామీగానే...
అప్పటి ప్రధాని ఇందిర హయాంలో రైల్వే శాఖ సహాయమంత్రిగా పని చేసిన పాలమూరు పార్లమెంట్ సభ్యుడు మల్లికార్జున్ తొలి సారి సర్వే జరిపించారు. 217 కిలోమీటర్ల సర్వే జరిపి అప్పట్లో రూ.87కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. అంతలోనే 1989లో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలు కావడంతో పాలమూరు ఎంపీ స్థానానికి పోటీ పడిన జైపాల్‌రెడ్డి, మల్లికార్జున్‌లు ఈ రైల్వే లైన్‌ను ఎన్నికల హామీగా విసృ్తత ప్రచారం చేశారు.
మల్లికార్జున్ ఎంపీగా గెలిచినప్పటికీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో ప్రయత్నం ఫలించలేదు. అనంతరం పీవీ నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మల్లికార్జున్ కేంద్ర రక్షణ శాఖమంత్రిగా మారడంతో రైల్వే లైన్ ఊసెత్తేవారు లేకుండాపోయారు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండారుదత్తాత్రేయ సైతం ఇచ్చిన హామీ కూడా అలాగే మిగిలిపోయింది.
2010లో ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ.680కోట్లు అవసరమని అంచనా వేసినప్పటికీ కొత్త రైల్వే లైన్‌లను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్లతో మాత్రమే చేపట్టాలని కేంద్రం నిర్ణయించడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. తాజాగా 2012లో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని నిధుల కేటాయింపే మిగిలిందంటూ ఈ రైల్వేలైన్ వెళ్లే దారిలో సర్వే చేసి రాళ్లను పాతారు. మళ్లీ నిధులు కేటాయించకపోవడంతో నాటి నుంచి నేటి వరకు రైల్వే లైన్ సర్వేలకే పరిమితమైంది. ఈ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఈ సారైనా తన సత్తా చూపి ఈ లైన్‌కు ఆమోదం పొందుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.తాజా రైల్వే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఉంటుందని ఈ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణ..కృష్ణా
Published Wed, Feb 12 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement
Advertisement