రైళ్లలో టాయ్‌లెట్లు ఎట్లా వచ్చాయంటే.. | Train toilets had come in train bogies since 1909: passenger complaints in a letter | Sakshi
Sakshi News home page

రైళ్లలో టాయ్‌లెట్లు ఎట్లా వచ్చాయంటే..

Published Wed, Feb 24 2016 2:19 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

రైళ్లలో టాయ్‌లెట్లు ఎట్లా వచ్చాయంటే..

రైళ్లలో టాయ్‌లెట్లు ఎట్లా వచ్చాయంటే..

న్యూఢిల్లీ: ‘నేను ప్యాసింజర్ రైల్లో అహ్మెద్‌పూర్ రైల్వే స్టేషన్‌కు వచ్చాను. కడుపు విపరీతమైన ఉబ్బరంగా ఉంది. రైలు దిగాను. స్టేషన్లో ఓ లోటలో నీల్లు పట్టుకున్నాను. రైలు పట్టాలకు దూరంగా పరిగెత్తాను. కడుపు భారాన్ని దించుకుంటున్నాను. ఇంతలో రైల్వే గార్డు పచ్చ జెండా ఊపాడు. నేను వెనక నుంచి మొత్తుకుంటూ ఒక చేతిలో లోట, మరో చేతిలో దోవతి పట్టుకొని పరుగెత్తుకొస్తున్నాను. కాళ్లకు దోవతి అడ్డంపడి ఊడిపోయింది. స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ మీదున్న మహిళలు, పురుషులు అందరి ముందు నా మానం పోయింది. నా కోసం ఐదు నిమిషాలు రైలు ఆపని గార్డుకు ప్రజల తరఫున భారీ జరిమానా విధించాలని ప్రార్థిస్తున్నాను. అలా చేయని పక్షంలో పత్రికలకు నివేదిస్తా’ అని ఓఖిల్ చంద్ర సేన్ అనే ప్రయాణికుడు 1909లో వెస్ట్ బెంగాల్ సాహిబ్‌గంజ్ రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. ఫ్రేమ్ కట్టిన ఈ ఫిర్యాదు లేఖ ఢిల్లీ రైల్వే మ్యూజియంలో నేటికి కనిపిస్తుంది.

 ఈ లేఖనే రైల్వే బోగీల్లో మరుగుదొడ్లు నిర్మించాలనే ఆలోచనకు నాంది పలికింది. వందేళ్ల క్రితం నుంచి నేటికి రైల్వే శాఖపై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా విస్తరణతో నేడు ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోంది. ట్విట్టర్ ఫిర్యాదులను రైల్వే మంత్రియే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నప్పటికీ ప్రయాణికుల సౌకర్యాలు అరకొరగానే ఉంటున్నాయి. ప్రతి ఏడాది రైల్వే బడ్జెట్ ముందు ప్రజాభిప్రాయ సేకరణ పేరిట పార్లమెంట్ సభ్యుల అభిప్రాయాలను, డిమాండ్లను రైల్వే శాఖ స్వీకరిస్తుంది. ఈసారి కూడా ఆ కసరత్తు ఎప్పటి తంతులాగానే జరిగింది. పార్లమెంట్ సభ్యులు కూడా పార్టీల వారిగా విడిపోతారు. కొంత మంది వ్యక్తిగత అభిప్రాయాలను కూడా చెబుతారు. తమ నియోజక వర్గానికి కొత్త రైళ్లు కావాలని, కొత్త స్టాప్‌లు కావాలని, గేజ్ కన్వర్షన్ కావాలని, కొత్తగా రూట్ కావాలనే అందరూ మాట్లాడుతారు. ఎవరు కూడా రైల్వే వ్యవస్థ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? దాన్ని స్వరూపం ఎలా ఉండాలి?  సమస్యలను పరిష్కరించడం ఎలా, భవిష్యత్తుకు బాటలు వేయడం ఎలా ? ఆలోచించరు.

సాక్షాత్తు రైల్వే మంత్రి కూడా ఆ దిశగా ఆలోచించరు. అందుబాటులో ఉన్న బడ్జెన్‌ను సర్దుకోవడం ఎలా ? ప్రయాణికులపై భారం వేయకుండా పెట్టుబడులను సమీకరించడం ఎలా ?, అన్ని ప్రాంతాల వారిని, ముఖ్యంగా పాలకపక్షాల ప్రయోజనాలను ఎలా పరిరక్షించాలనే ధోరణిలో ఆలోచిస్తారు. అందుకనే ఎన్ని చర్యలు తీసుకున్నా సమస్యలు ఎప్పటికి తీరకుండానే ఉంటున్నాయి. రాజకీయ కారణాల వల్ల ప్రయాణికుల చార్జీలను పెంచకుండా సరకు రవాణా చార్జీలను పెంచడం ద్వారా రెవెన్యూ పెంచుకునేందుకు రైల్వేలు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తు వస్తున్నాయి. గూడ్సు రైళ్లు నడిచేందుకు ప్రత్యేక కారిడార్ లేకపోవడం వల్ల ఆ రైళ్లు నేడు గంటకు 26 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి.

అందుకని వాటిలో సరకు రవాణాకు పెద్దగా డిమాండ్ ఉండడం లేదు. రోడ్డు రవాణా స్పీడ్‌గా ఉండడంతో, రవాణా చార్జీలు రైలుతో సమానంగా లేదా అంతకన్నా తక్కువగా ఉండడంతో వ్యాపారులు సరకు రవాణాకు ఎక్కువ వరకు రోడ్డు మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ప్రయాణికుల చార్జీలు కూడా పెద్దగా పెంచక పోవడం వల్ల పెట్టుబడులకు డబ్బులు లేవని, బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉన్నాయని రైల్వే శాఖ ఎప్పుడూ ఆర్థిక శాఖపై ఆరోపణలు చేస్తుంటుంది. డబ్బుల్లేకనే తాము కొత్త ప్రాజెక్టులను పెద్దగా ప్రకటించలేక పోతున్నామని, కొత్త రైళ్లు ప్రవేశపెట్టలేక పోతున్నామని ప్రస్తుత రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గత ఏడాది బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు. కేటాయింపులను కూడా సరిగ్గా ఖర్చు పెట్టలేక పోయారన్నది నిపుణుల విశ్లేషన.

 రైల్వే శాఖ వద్ద మంజూరై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు 362. ఎలాంటి కొత్త ప్రాజెక్టులు ప్రకటించకుండా కనీసం ఐదేళ్ల హాలిడే ప్రకటిస్తే తప్ప ఈ ప్రాజెక్టులు పూర్తికావు. చైనాలో ప్రయాణికుల చార్జీలు, సరకు రవాణా చార్జీలు మనకన్నా యాభై శాతం తక్కువ. అయినా అవి మనకన్నా రెండింతల లాభాల్లో నడుస్తున్నాయి. వాటి వేగం మన రైళ్లకన్నా మూడింతలు ఎక్కువ. భారత్ నడుపుతున్న 13,000 రైళ్లు సకాలంలో వచ్చి పోయేలా, వాటి భద్రతకు, ఆరోగ్యకరమైన ఆహారానికి, మరుగుదొడ్ల శుభ్రతకు ముందుగా చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రయాణికులు కోరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement