బడ్జెట్ వస్తోంది... వీటి సంగతేంటి?
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెలాఖరులో కొత్త బడ్జెట్ ప్రవేశపెడతారు.
ఏమైనా మార్పులుంటే అవన్నీ కూడా 2016-17వ ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి.
ఏ మార్పులు వస్తున్నాయో బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా మనకు ముందే తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు చేయవలసిన కొన్ని పనులు ఈ రోజు ట్యాక్స్ కాలమ్‌లో...
* సెక్షన్ 80(సీ) కింద అర్హత ఉన్న సేవింగ్స్, పెట్టుబడులు తదితర వాటి మీద గరిష్ట పరిమితి రూ.1,50,000. ఈ రోజు వరకు ఎంత ఇన్వెస్ట్ చేశారో లెక్కించండి. ఇంకా అవకాశం ఉంటే వెంటనే రంగంలోకి దిగండి.
* మెడిక్లెయిమ్‌కి వాయిదాలు చెల్లించండి.
* ఇంటి రుణం మీద అసలు, వడ్డీ చెల్లించకపోతే వెంటనే చెల్లించండి.
* అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు సెప్టెంబర్ నుంచే మొదలవుతాయి. మార్చి 15 చివరి తేదీ. అవకాశం ఉంటే త్వరగా చెల్లించండి. చివరి క్షణం వరకు నిరీక్షణ వద్దు.
* టీడీఎస్ వివరాలు తెలుసుకోండి. డిడక్టర్‌తో మాట్లాడండి. యజమానిని సంప్రదించండి. బ్యాంక ర్లు వారి పని ఒత్తిడి వల్ల మన పని చేయకపోవచ్చు. మీరే వారిని కలిసి టీడీఎస్ సమస్యను పరిష్కరించుకోండి.
* మీ కేసులో టీడీఎస్ జరిగినప్పటికీ.. ఆ మొత్తంలో పూర్తి పన్ను భారం చెల్లించలేం. ఉదాహరణగా బ్యాంకర్లు కేవలం 10 శాతం చెల్లిస్తారు. మీ ఆదాయం 30 శాతం శ్లాబ్‌లో ఉందనుకోండి. మీరింకా 20 శాతం చెల్లించాలి. దీన్ని అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా చెల్లించాలి. చాలా మంది టీడీఎస్ అయిపోయింది కాదా.. ఇక అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదనుకుంటారు. ఇది పొరపాటు. ఇటువంటివి ఇప్పుడే చూసుకోండి.
* మీకున్న అన్ని బ్యాంకు అకౌంట్లలో బ్యాంకర్లు సంవత్సరంలో రెండు సార్లు కానీ నాలుగు సార్లు కానీ వడ్డీని క్రెడిట్ చేస్తారు. ఇటువంటి మొత్తం 10 వేల రూపాయలు దాటితే పన్ను భారం పడుతుంది. అటువంటి సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోండి.
* బ్యాంకు అకౌంట్లలో ప్రతి క్రెడిట్‌కి, ప్రతి డెబిట్‌కు వివరణ రాసుకోండి.
* మార్చి 15 తర్వాత ఊహించని విధంగా ఆదాయం వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకొని పన్నుభారం లెక్కించండి.
* కొన్ని విషయాలను మీరు ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపాదనల వల్ల బేసిక్ లిమిట్ , శ్లాబ్ మారవచ్చు. మినహాయింపుల పరిమితి పెరగొచ్చు. ఈ ప్రభావం పన్ను మీద పడుతుంది.
* అందుకే బడ్జెట్ ప్రతిపాదనలు తెలియగానే పన్ను భారం గురించి వృత్తి నిపుణులను సంప్రదించండి.
ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య