పొదుపు కొంచెం– నిధి ఘనం | Mutual Funds Sip Path | Sakshi
Sakshi News home page

పొదుపు కొంచెం– నిధి ఘనం

Published Mon, Feb 19 2018 12:47 AM | Last Updated on Mon, Feb 19 2018 12:47 AM

Mutual Funds Sip Path - Sakshi

కొన్ని చుక్కల నీరు కలిస్తేనే ఒక బిందెడు అవుతాయి. కొన్ని బిందెలు కలిస్తేనే కోనేరు నీళ్లవుతాయి. కొన్ని కోనేర్లు కలిస్తే నదిని మరిపిస్తాయి. ఇదంతా ఎందుకంటే... పెద్ద నిధి సమకూరటానికి కావాల్సింది చిల్లర మొత్తాలే. చిన్నచిన్న పొదుపులే. ఎందుకంటే చాలామంది నెలవారీ సంపాదనలో మిగిలేది కొంచెమే కదా అని దాన్ని పొదుపు చేయటానికి వెనకాడతారు. అసలు వాటిని పెట్టుబడుల్లోకి మళ్లించటం గురించి ఆలోచించనే ఆలోచించరు.

కానీ, ఆ కొద్ది మొత్తాలు కలిపితేనే పెద్ద నిధి అవుతుందన్న ఆలోచన ఎంత మందికి వస్తుంది? బడ్జెట్‌ చిన్నదే అయినా... క్రమశిక్షణతో ఇన్వెస్ట్‌ చేస్తే చక్కని కార్పస్‌ను సమకూర్చుకోవచ్చనేది నిపుణుల సూచన. జీవితంలో కీలక లక్ష్యాలను సాకారం చేసుకుని, విజయ తీరాలకు చేరుకోవాలంటే అందుకు డబ్బే ప్రధానంగా కావాలి. ఈ నేపథ్యంలో లక్ష్యాలు సాధించడానికి కావాల్సిన నిధిని సమకూర్చుకునేందుకు వీలైనంత పొదుపు చేయటం తప్పనిసరి. మిగిలేది కొంతే అయినా, బడ్జెట్‌ చిన్నదే అయినా పొదుపు, పెట్టుబడుల విషయంలో తీసుకోవాల్సిన, అనుసరించాల్సిన వ్యూహాలేంటనేవి తెలియజేసేదే ఈ కథనం...

ఉన్నదాంతోనే తొలి అడుగు..
‘‘లక్ష్యాలను ప్రాధాన్యం మేరకు నిర్ణయించుకుని, అనవసర ఖర్చులకు కళ్లెం వేసుకోవాలి. కొన్ని లక్ష్యాలు మరీ గాల్లో మేడలు కట్టేలా ఉండకూడదు. విచక్షణా రహిత ఖర్చులను తగ్గించుకోవాలి’’ అనేది ‘లాడర్‌ 7 ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌’ వ్యవస్థాపకుడు సురేశ్‌ సెడగోపన్‌ సూచన.  ఉదాహరణకు చిన్న వయసులోనే ఇంటిని కొనుగోలు చేస్తే ఇతర కీలక లక్ష్యాల కోసం మదుపు చేసేందుకు ఇన్వెస్టర్ల వద్ద మిగిలేదేమీ ఉండదు. కనుక కొన్నాళ్లు ఇంటి కొనుగోలును వాయిదా వేసుకుని అద్దె ఇంట్లో ఉండడం తెలివైన నిర్ణయం అవుతుంది.

పెట్టుబడులను చిన్న వయసులోనే మొదలు పెట్టడం అన్నది లక్ష్య సాధనకు తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. ఎంత ఇన్వెస్ట్‌ చేస్తున్నారన్నది కూడా కీలకమే. ఉదాహరణకు మీ పిల్లల ఉన్నత విద్య కోసం ఓ పెద్ద నిధిని 15 ఏళ్లలో సాధించాలన్న లక్ష్యంతో ఉన్నారనుకోండి. ప్రస్తుతం రూ.14 లక్షలు ఉండే కోర్స్‌ను 15 ఏళ్ల తర్వాత చెప్పించాలనుకుంటే అప్పటికి విద్యా ద్రవ్యోల్బణాన్ని కూడా కలుపుకుంటే దాదాపు రూ.33.55 లక్షలు అవసరం అవుతుంది.

మరి ఈ లెక్కన 15 ఏళ్ల తర్వాత మీ లక్ష్యానికి అవసరమైన నిధి సమకూర్చుకునేందుకు వార్షికంగా కనీసం 12 శాతం రాబడులను ఇచ్చే సాధనంలో ప్రతి  నెలా రూ.7,500 చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. ప్రారంభంలో ఇంత మొత్తం పెట్టుబడులు కేటాయించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. పెట్టుబడికి కొద్ది మొత్తమే ఉండొచ్చు. అయినా ఫర్వాలేదు. రూ.7,500తోనే పెట్టుబడులు ప్రారంభించాలన్న కఠిన సూత్రమేమీ లేదు. మీ దగ్గర ఉన్నంత, సాధ్యమైనంత మేర పొదుపు చేస్తూ వెళ్లడం ద్వారా కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

వీలైనప్పుడు అదనపు పెట్టుబడులు
ప్రారంభంలో కాకపోతే ఆ తర్వాత అయినా పెట్టుబడులను పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, ఆర్జన మెరుగైనప్పుడు ఒకేసారిగా లేదా క్రమానుగతంగా పెట్టుబడులను పెంచుకోవాలి. ఆదాయ వృద్ధి అనేది ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉండకపోవచ్చు. ఏటేటా ఇందులో మార్పు ఉండొచ్చు. అయినప్పటికీ దానికి అనుగుణంగా పెట్టుబడులను పెంచుకుంటూ వెళ్లాలి. ఏ దశలోనూ లక్ష్యం కోసం చేస్తున్న పెట్టుబడుల పట్ల కట్టుబాటు విడవకూడదు.

క్రమశిక్షణ ముఖ్యం. పెట్టుబడులను కొనసాగిస్తూ, వీలున్నప్పుడల్లా వాటిని పెంచుకుంటూ పోవడం క్లిష్టమైనదే అయినా దాన్ని అనుసరించేందుకే ప్రయత్నించాలి. నిర్ణీత లక్ష్యం సమీపించిన సమయానికి అవసరానికంటే తక్కువ నిధి సమకూరినా ఫర్వాలేదు. ఎందుకంటే కొద్ది మొత్తమే ఉంది కదా అనుకుని పెట్టుబడులు పెట్టకుండా ఉండడం, వాయిదా వేయడం కంటే ఉన్నంత ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లిన వారే మెరుగైన స్థితిలో ఉంటారు.

ఉదాహరణకు 15 ఏళ్ల కాలానికి రూ.33.55 లక్షల కోసం ప్రతీ నెలా రూ.7,500 ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటే, ఓ ఐదేళ్లు జాప్యం చేశారనుకోండి. అప్పుడు మిగిలిన పదేళ్లలోనే ఆ నిధి సమకూరేందుకు వీలుగా ప్రతీ నెలా ఇన్వెస్ట్‌ చేయాల్సిన మొత్తం రూ.15,993కు పెరిగిపోతుంది. ‘‘ఏ లక్ష్యం కోసమైనా ఇన్వెస్ట్‌ చేస్తున్నప్పుడు మనసులో దాన్ని కష్టమైనదన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఇది ఎక్కువ సందర్భాల్లో తగినంత కార్పస్‌ను సమకూర్చుకోకుండా అడ్డుపడుతుంది’’ అని సెడగోపన్‌ వ్యాఖ్యానించారు.

పన్ను ఆదా కోణంలో కాదు...
తక్కువ ఆదాయం కలిగిన వారు పన్ను ఆదా కోణంలో మాత్రమే ఇన్వెస్ట్‌ చేయకూడదన్నది నిపుణుల సూచన. పన్ను ఆదా కోణంలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల సరైన సాధనాలను ఎంచుకోలేరని ఫిన్‌కార్ట్‌ ఎండీ తన్వీర్‌ ఆలమ్‌ అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు పన్ను ఆదా చేసే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) దీర్ఘకాలంలో సంపద సృష్టికి మంచి ఆప్షన్‌.

కానీ చాలా మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలం పాటు పెట్టుబడులను కొనసాగించరు. పన్ను ఆదా ఈక్విటీ పథకాల్లో మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ అయిపోగానే పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటుంటారు. దీని వల్ల కాంపౌండింగ్‌ ప్రయోజనం కోల్పోతారు. దీర్ఘకాలం పాటు కొనసాగిస్తేనే సానుకూల రాబడులకు అవకాశం ఉంటుంది.


చిన్న ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు మ్యూచువల్‌ ఫండ్స్‌ సిప్‌ మార్గం మెరుగైనది. ఇవి కనీసం రూ.500 నుంచి కూడా సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఇలా ఇన్వెస్ట్‌ చేస్తూ స్టెప్‌ అప్‌ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. దీనివల్ల నిర్ణీత కాలానికోసారి పెట్టుబడుల మొత్తం పెరుగుతుంటుంది. అలాగే, మ్యూచువల్‌ ఫండ్స్‌లో డైరెక్ట్‌ ప్లాన్‌ను ఎంచుకోవడం వల్ల దీర్ఘకాలంలో రాబడులు అధికంగా పొందొచ్చు. కాకపోతే డైరెక్ట్‌ ప్లాన్లు అనేవి ఇన్వెస్టర్లు సొంతంగా ఎంచుకునేవి. కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి. రెగ్యులర్‌ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్‌ ప్లాన్లలో ఎక్స్‌పెన్స్‌ రేషియో తక్కువగా ఉండడం వల్ల దీర్ఘకాలంలో పెద్ద మొత్తం సమకూరుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement