కీలక రైల్వే ప్రాజెక్టులు కొలిక్కి.. | Two key new railway lines in Telugu States: telangana | Sakshi
Sakshi News home page

కీలక రైల్వే ప్రాజెక్టులు కొలిక్కి..

Published Sat, Jul 20 2024 3:29 AM | Last Updated on Sat, Jul 20 2024 3:29 AM

Two key new railway lines in Telugu States: telangana

భారీగా నిధులు కేటాయిస్తున్న కేంద్రం.. ఫలితంగా పనుల్లో వేగం 

మనోహరాబాద్‌–కొత్తపల్లితోపాటు, కాజీపేట–బల్లార్షా, కాజీపేట–విజయవాడ మూడో లైన్‌ పనుల్లో స్పీడ్‌

సాక్షి, హైదరాబాద్‌: వరసగా రెండేళ్లలో కేంద్రప్రభుత్వం కీలక రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తుండటంతో వాటి పనులు ఒక్కసారిగా వేగాన్ని పుంజుకున్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తూ కొత్త బడ్జెట్‌ కాలపరిధిలో వాటిని పూర్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. గత సంవత్సరం బడ్జెట్‌ కాలపరిధిలో రాష్ట్రంలో మెదక్‌–అక్కన్నపేట, మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పనులను రైల్వే శాఖ పూర్తి చేసి అందుబాటులోకి తెచి్చంది. కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైన గుంటూరు–బీబీనగర్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టును ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో పట్టాలెక్కించింది. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే ఈ ఆర్థిక సంవత్సరపు పూర్తి కాల బడ్జెట్‌లో ఆ నిధులను కొంత సవరించే అవకాశం ఉంది. ఆ నిధులతో అవి ఈ ఆర్థిక సంవత్సరంలో తుదిదశకు చేరే అవకాశం ఉంది. 

కాజీపేట–బల్లార్షా మూడో లైన్‌ పనుల్లో వేగం 
ఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే పరంగా జోడించే ప్రధాన లైన్‌లో ఇది కీలకం. నిత్యం 275 వరకు ప్రయాణికుల రైళ్లు, 180 వరకు సరుకు రవాణా రైళ్లు పరుగుపెట్టే ఈ మార్గంలో మూడో లైన్‌ అత్యవసరం. అది అందుబాటులోకి వస్తే కనీసం మరో 150 రైళ్లను కొత్తగా నడిపే వీలు చిక్కుతుంది. ఈ మార్గంలో తెలంగాణకు సంబంధించి దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు.

ఇందులో మహారాష్ట్ర– తెలంగాణల్లో కొనసాగే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. గత రెండేళ్లుగా పనుల్లో వేగం కారణంగా చాలా సెక్షన్‌లలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 151కి.మీ. పనులు పూర్తయ్యాయి. గతేడాది బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్‌లో రూ.300 కోట్లు ప్రతిపాదించారు. ఈసారి ఆ మొత్తాన్ని కొంత సవరించే అవకాశం ఉంది.

కాజీపేట– విజయవాడ మూడో లైన్‌ పనులకూ మోక్షం  
దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఆ ప్రాజెక్టు ఎట్టకేలకు 2012–13లో మంజూరైంది. కానీ, పనుల నిర్వహణ మాత్రం మందకొడిగా సాగుతూ అది ఇప్పటికీ పూర్తి కాలేదు. కానీ, గత రెండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టుకు ఏకంగారూ.647 కోట్లçను కేటాయించటంతో ఎట్టకేలకు ప్రాజెక్టు ఓ రూపునకు వచి్చంది. పూర్తి నిడివి 219 కి.మీ. ఇప్పటివరకు 100కి.మీ. పనులు పూర్తయ్యాయి. దీని అంచనా వ్యయం రూ.1,952 కోట్లు.

’మనోహరాబాద్‌–కొత్తపల్లి’.. వచ్చే ఏడాదికి కొలిక్కి
సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌–కరీంనగర్‌ను రైల్వే ద్వారా అనుసంధానించే కీలక ప్రాజెక్టు ఇది. 2006–07లో మంజూరైనా ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ. కాగా ఇప్పటి వరకు 76 కి.మీ. పనులు పూర్త య్యాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1375 కోట్లు. గతేడాది బడ్జెట్‌లో దీనికి రూ.185 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్‌లో రూ.350 కోట్లు ప్రతిపాదించారు. నిధులకు కొరత లేనందున వచ్చే ఏడాది కాలంలో పనులు దాదాపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 

’బీబీనగర్‌– గుంటూరు’ పనులు ఇక స్పీడే 
సికింద్రాబాద్‌–విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ లైన్‌ గా నడికుడి మీదుగా బీబీనగర్‌– గుంటూరు మార్గాన్ని అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. రూ.2,853 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గత మధ్యంతర బడ్జెట్‌లో రూ.200 కోట్లు ప్రతిపాదించారు. కుక్కడం–నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పను లు మొదలయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement