manoharabad
-
బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్.. ఒకే ఇంట్లో నలుగురు మృతి
సాక్షి, మనోహరాబాద్: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు.వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాలో శనివారం సాయంత్రం రోడ్డు ఘోర ప్రమాదం జరిగింది. మనోహరాబాద్ మండలం పోతారం వద్ద రోడ్డుపై స్థానిక రైతులు ధాన్యం ఆరబోశారు. ధాన్యం కుప్పలు ఉండడంతో రోడ్డుకు ఒకవైపు నుంచే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్.. ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఆంజనేయులు, ఆయన మరదలు లత, ఆమె ఇద్దరు పిల్లలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో, వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
కీలక రైల్వే ప్రాజెక్టులు కొలిక్కి..
సాక్షి, హైదరాబాద్: వరసగా రెండేళ్లలో కేంద్రప్రభుత్వం కీలక రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తుండటంతో వాటి పనులు ఒక్కసారిగా వేగాన్ని పుంజుకున్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తూ కొత్త బడ్జెట్ కాలపరిధిలో వాటిని పూర్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. గత సంవత్సరం బడ్జెట్ కాలపరిధిలో రాష్ట్రంలో మెదక్–అక్కన్నపేట, మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను రైల్వే శాఖ పూర్తి చేసి అందుబాటులోకి తెచి్చంది. కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైన గుంటూరు–బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టును ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో పట్టాలెక్కించింది. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే ఈ ఆర్థిక సంవత్సరపు పూర్తి కాల బడ్జెట్లో ఆ నిధులను కొంత సవరించే అవకాశం ఉంది. ఆ నిధులతో అవి ఈ ఆర్థిక సంవత్సరంలో తుదిదశకు చేరే అవకాశం ఉంది. కాజీపేట–బల్లార్షా మూడో లైన్ పనుల్లో వేగం ఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే పరంగా జోడించే ప్రధాన లైన్లో ఇది కీలకం. నిత్యం 275 వరకు ప్రయాణికుల రైళ్లు, 180 వరకు సరుకు రవాణా రైళ్లు పరుగుపెట్టే ఈ మార్గంలో మూడో లైన్ అత్యవసరం. అది అందుబాటులోకి వస్తే కనీసం మరో 150 రైళ్లను కొత్తగా నడిపే వీలు చిక్కుతుంది. ఈ మార్గంలో తెలంగాణకు సంబంధించి దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు.ఇందులో మహారాష్ట్ర– తెలంగాణల్లో కొనసాగే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. గత రెండేళ్లుగా పనుల్లో వేగం కారణంగా చాలా సెక్షన్లలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 151కి.మీ. పనులు పూర్తయ్యాయి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.300 కోట్లు ప్రతిపాదించారు. ఈసారి ఆ మొత్తాన్ని కొంత సవరించే అవకాశం ఉంది.కాజీపేట– విజయవాడ మూడో లైన్ పనులకూ మోక్షం దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఆ ప్రాజెక్టు ఎట్టకేలకు 2012–13లో మంజూరైంది. కానీ, పనుల నిర్వహణ మాత్రం మందకొడిగా సాగుతూ అది ఇప్పటికీ పూర్తి కాలేదు. కానీ, గత రెండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టుకు ఏకంగారూ.647 కోట్లçను కేటాయించటంతో ఎట్టకేలకు ప్రాజెక్టు ఓ రూపునకు వచి్చంది. పూర్తి నిడివి 219 కి.మీ. ఇప్పటివరకు 100కి.మీ. పనులు పూర్తయ్యాయి. దీని అంచనా వ్యయం రూ.1,952 కోట్లు.’మనోహరాబాద్–కొత్తపల్లి’.. వచ్చే ఏడాదికి కొలిక్కిసిద్దిపేట మీదుగా హైదరాబాద్–కరీంనగర్‌ను రైల్వే ద్వారా అనుసంధానించే కీలక ప్రాజెక్టు ఇది. 2006–07లో మంజూరైనా ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ. కాగా ఇప్పటి వరకు 76 కి.మీ. పనులు పూర్త య్యాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1375 కోట్లు. గతేడాది బడ్జెట్లో దీనికి రూ.185 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.350 కోట్లు ప్రతిపాదించారు. నిధులకు కొరత లేనందున వచ్చే ఏడాది కాలంలో పనులు దాదాపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ’బీబీనగర్– గుంటూరు’ పనులు ఇక స్పీడే సికింద్రాబాద్–విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ లైన్ గా నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. రూ.2,853 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గత మధ్యంతర బడ్జెట్లో రూ.200 కోట్లు ప్రతిపాదించారు. కుక్కడం–నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పను లు మొదలయ్యాయి. -
నీటమునిగి నలుగురి మృత్యువాత
మనోహరాబాద్(తూప్రాన్): దుస్తులు ఉతికేందుకు చెరువుకు వెళ్లగా..అదే వారి పాలిట మృత్యుకుహరమైంది. బోనాల పండుగకు వచ్చిన తోటికోడళ్లు, కుటుంబసభ్యులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. మూడు కుటుంబాల్లో పెను విషాదం నింపిన ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో ఆదివారం బోనాలు జరిగాయి. గ్రామానికి చెందిన ఫిరంగిలక్ష్మి ఇంట్లో జరిగిన ఈ వేడుకలకు ఆమె అన్నదమ్ములు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్‌పేట్‌కు చెందిన దుడ్డు యాదగిరి, శ్రీకాంత్‌లు భార్యాపిల్లలతో హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం దుస్తులు ఉతికేందుకు ఫిరంగిలక్ష్మి తన పెద్దకూతురు లావణ్య (23), సోదరుల భార్యలు దుడ్డు బాలమణి (30), దుడ్డులక్ష్మి(25), బాలమణి కుమారుడు చరణ్(10)తో కలిసి ఊర చెరువు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో చెరువులో ఆడుకుంటున్న చరణ్ ఒక్కసారిగా నీటి మునిగిపోయాడు. గమనించిన లావణ్య, బాలమణి, లక్ష్మిలు కాపాడేందుకు లోతుగా ఉన్న నీటిలోకి వెళ్లి వారు కూడా మునిగిపోయారు. గట్టుపై ఉన్న ఫిరంగి లక్ష్మి కేకలు వేస్తూ వారిని కాపాడేందుకు నీటిలోకి దిగింది. పట్టుతప్పి ఆమె కూడా నీటిలో మునిగింది. అటుగా వెళుతున్న ఓ యువకుడు గమనించి ఆమెను జుట్టు పట్టి బయటకు లాగడంతో ప్రాణాలతో బయటపడింది. బాలుడితోసహా నీటిలో మునిగిన లావణ్య, బాలమణి, లక్ష్మిని బయటకు తీయగా, అప్పటికే వారు విగతజీవులుగా మారారు. చరణ్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సర్పంచ్ నాగభూషణం, తూప్రాన్ పీఎసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
విషాదం.. బాలుడిని కాపాడబోయి ముగ్గురు మహిళలు..
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయి నలుగురు మృతిచెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో విషాదం నెలకొంది. స్నానానికి వెళ్లిన ఓ బాలుడు చెరువులో మునిగిపోయాడు. ఈ క్రమంలో చెరువులో మునిగిపోతున్న బాలుడిని ఓ మహిళ కాపాడబోయింది. దీంతో, సదరు మహిళ కూడా చెరువులో పడి మునిగిపోయింది. వీరిద్దరూ గమనించిన మరో ఇద్దరు మహిళలు వీరిని కాపాడబోయి.. చెరువు నీటిలో మునిగి మృతిచెందారు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం, స్థానికుల సహాయంలో ముగ్గురు మహిళ మృతదేహాలను బయటకు తీశారు. బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇది కూడా చదవండి: విషాదాన్ని మిగిల్చిన ప్రయాణం -
ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా రాష్ట్రం
తూప్రాన్, మనోహరాబాద్(తూప్రాన్): దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆవిర్భవిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లిలో రూ.450 కోట్ల పెట్టుబడితో 59 ఎకరాల్లో ఐటీసీ సంస్థ నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీని పరిశ్రమ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్‌పూరితో కలసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం పరిశ్రమలో తయారు చేసిన ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద పరిశ్రమ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కంపెనీ భవిష్యత్‌లో మరో రూ.350 కోట్లు వెచ్చించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుందన్నారు. పరిశ్రమ యాజమాన్యం స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు కంపెనీలో తయారు చేసే చిప్స్, బిస్కెట్ల కోసం ఆలుగడ్డలు, గోధుమలను ఇక్కడే కొనుగోలు చేయాలన్నారు. ఇందుకోసం స్థానిక రైతులను ప్రోత్సహించాలని కోరారు. అప్పుడే రైతులు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. కాళేశ్వరం ద్వారా 10 టీఎంసీల నీరు.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తక్కువ సమయంలో పూర్తి చేసి నీటి వనరుల్లో విప్లవం సాధించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనితో సాగునీరు, తాగునీటికి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ద్వారా పరిశ్రమలకు 10 టీఎంసీల నీటిని అందిస్తున్నామని తెలిపారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్న ఘనత తెలంగాణకే దక్కుతుందని, మిషన్ కాకతీయ ద్వా రా 46 వేల చెరువులను బాగు చేశామని వివరించారు. పాడిపంటలతోనే రాష్ట్రం సుభిక్షం అవుతుందని, అందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్: పాడి అభివృద్ధికి కృషి చేయడంతో పాటు విజయ డెయిరీ ద్వారా పాల ఉత్పత్తులను కూడా పెంపొందిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ కోసం ప్రత్యేకంగా సెజ్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందేనని అన్నారు. రాష్ట్రంలో విస్తృతంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని, వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా ఇతర దేశాల నుంచి వంట నూనెల దిగుమతిని తగ్గించడానికి చర్యలు చేపట్టామని వివరించారు. ఇక్కడ ఏర్పాటు అవుతున్న పరిశ్రమలకు స్థానికులు, నాయకులు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలతాశేఖర్ గౌడ్, సర్పంచ్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకున్నాడు.. తల్లిదండ్రుల ఎంట్రీతో..
సాక్షి, మెదక్ (తూప్రాన్): యువతిని ప్రేమించి పెళ్లి చేసుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ కేసు నమోదైంది. మంగళవారం ఎస్ఐ రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ మండలం కోనాయపల్లి(పీటీ) గ్రామ పంచాయతీ పరిధి ధర్మరాజ్పల్లి గ్రామానికి చెందిన భాషబోయిన తేజశ్రీ, అదే గ్రామానికి చెందిన సాయిరెడ్డిగారి యశ్వంత్‌రెడ్డి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకున్నాడు. వీరి పెళ్లికి కులాలు అడ్డు రావడంతో కుల పెద్దలు నిరాకరించారు. దీంతో గతనెల 19వ తేదీన లక్ష్మీనర్సింహా స్వామి దేవాలయం వద్ద పెళ్లి చేసుకున్నారు. తూప్రాన్‌లో కాపురం పెట్టారు. విషయం తెలుసుకున్న అబ్బాయి, కుటుంబసభ్యులు, కుల పెద్దలు 20న తూప్రాన్ వచ్చి అబ్బాయిని తమ వెంట తీసుకెళ్లారు. ప్రశ్నించినందుకు యశ్వంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు చంపుతామని బెదిరిస్తున్నారని తేజశ్రీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు యశ్వంత్‌రెడ్డి, కుటుంబ సభ్యులు జయరాంరెడ్డి, రమణమ్మ, అభిషేక్‌రెడ్డి, పుష్ప, శిల్ప, బల్వంత్‌రెడ్డి, మణేమ్మ, రవీందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (ఏడాది నుంచి మాటువేసి.. పొదల్లోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం) -
‘మనోహరాబాద్–మన్మాడ్’ మధ్య విద్యుదీకరణ పూర్తి
సాక్షి, హైదరాబాద్: మన్మాడ్–ముద్ఖేడ్–డోన్ రైల్వే మార్గంలోని కామారెడ్డి–మనోహరాబాద్ స్టేషన్ల మధ్య 67 కి.మీ. మేర విద్యుదీకరణను రైల్వే యంత్రాంగం పూర్తిచేసింది. మిషన్ విద్యుదీకరణలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు మార్గాల్లో పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. ఉత్తర–దక్షిణ భారత ప్రాంతాలను జోడించే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పరిధి కీలకమైంది. దీంతో ఈ జోన్ పరిధిలో ప్రణాళికాబద్ధంగా ఎలక్ట్రిఫికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. మన్మాడ్–ముద్ఖేడ్–డోన్ మార్గంలో రూ.865 కోట్ల అంచనాతో 783 కి.మీ. మేర విద్యుదీకరించాలని 2015–16లో నిర్ణయించి, రైల్వే బోర్డు మంజూరు చేసింది. ఆ పనులు ఇప్పుడు పూర్తయ్యాయి. -
విక్రమార్కుడు సీన్ రిపీట్.. నగలు ఇస్తే పూజలు చేసి ఇస్తామని చెప్పి
సాక్షి, మనోహరాబాద్(మెదక్): ఫకీర్‌లమంటూ వచ్చి మాయమాటలు చెప్పి, మందు చల్లి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో షేక్ సాదుల్ల, జరీనాబేగం నివసిస్తున్నారు. షేక్ సాదుల్లా చికెన్ దుకాణ వ్యాపారి. ఈనెల 15వ తేదీ ఉదయం దుకాణానికి వెళ్లాడు. అతను వెళ్లిన కొంతసేపటికి ఇద్దరు ఫకీర్లు వచ్చారు. మీ ఇంటికి నజర్ బాగా ఉంది పోవడానికి రూ.1100 ఇస్తే నజర్ తీసేస్తామంటూ, ఇంట్లోకి బలవంతంగా వచ్చి కూర్చున్నారు. నీ భర్త మరో మూడు రోజుల్లో చనిపోతాడు, అతడికి ఎమీ కావద్దంటే నీ బంగారు ఆభరణాలు ఇవ్వాలని జరీనా బేగంను భయపెట్టారు. నీకు బంగారం ముఖ్యమా? భర్త ఆరోగ్యం ముఖ్యమా? అని కంగారుపెట్టారు. ఆ భయంతో తన ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారపు నల్లపూసల దండ, తులం బంగారు చెవికమ్మలు, కాళ్లకు పెట్టుకున్న 15 తులాల వెండి పట్టీలు, 8 తులాల వెండిచైన్, 4 తులాల వెండి బ్రాస్లెట్, తులం వెండి ఉంగరాలు ఇచ్చింది. నగలు తీసుకున్న ఫకీర్లు జరీనాపై మందు చల్లడంతో సృహకోల్పోయింది. కొంత సేపటికి సృహ రావడంతో లేచి చూడగా వాళ్లు కనిపించలేదు, నగలు కనిపించలేదు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రాత్రి ఇంట్లో నిద్రించారు.. తెల్లారేసరికి మాయం.. ఎటు వెళ్లినట్లు?
సాక్షి, మనోహరాబాద్(మెదక్): మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి అదృశ్యమైంది. ఎస్సై రాజుగౌడ్ వివరాల ప్రకారం మండలంలోని కాళ్లకల్ గ్రామానికి చెందిన షేక్ జహంగీర్ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అతని రెండో కూతురు షేక్ జహ్నబీ(21) ఈనెల 24 రాత్రి ఎప్పటిలాగే ఇంట్లో నిద్రపోయింది. అయితే కుటుంబ సభ్యులు వేకువ జామున చూసేసరికి జహ్నాబీ ఇంట్లోంచి వెళ్లిపోయింది. బంధువులు, తెలిసినవారి వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. కాగా కాళ్లకల్ గ్రామానికి చెందిన వీరబోయిన కృష్ణ మూడో కుమారుడు నాగార్జున్‌తో వెళ్లినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ యువతి తండ్రి శనివారం ఫిర్యాధు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. స్వప్న యువతి అదృశ్యం పరిగి: ఓ యువతి అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్లో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ కిష్టయ్య కూతురు స్వప్న ఈనెల 23న తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కోసం బంధువుల వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డిపై అనుమానంతో అతడి ఇంటికి వెళ్లి చూడగా అతడు కూడా కనిపించలేదు. మధు సూదన్రెడ్డిపై అనుమానంతో యువతి కుటుంబీకులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: భర్త వర్క్ ఫ్రం హోమ్‌లో బిజీ.. భార్య బట్టలు ఆరేసేందుకు మిద్దెపైకి వెళ్లడంతో. -
విషాదం: ఫుడ్ పాయిజన్‌తో ఇద్దరు చిన్నారులు మృతి
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేసే ఓ కుటుంబం శీతల పానియం తాగి పడుకున్నారు. తల్లి బాలమణి(35)తో పాటు, కూతురు మనీషా(13), కొడుకు కుమార్‌కు తీవ్రమైన కడుపు నొప్పి రావటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. తండ్రి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు తూప్రాన్ మండలం వెంకటాయ పల్లి గ్రామానికి చెందిన కుటుంబీకులుగా గుర్తించారు. -
18మంది పిల్లలు పుట్టాకే కుటుంబ నియంత్రణ..
మనోహరాబాద్ (తూప్రాన్) : 18 మంది బిడ్డలు పుట్టాకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటానని భీష్మించుకుంది ఓ బాలింత. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో నివసిస్తున్న జార్ఖండ్‌కు చెందిన ప్యారేలాల్, మహంతి దేవి దంపతులకు ఇప్పటికే ఏడుగురు పిల్లలు. జూలై 28న మహంతి దేవి ఎనిమిదో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటికైనా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించగా ఆమె నో అంటూ మొండికేసింది. కారణమేంటని అడగ్గా తమ గ్రామానికి చెందిన ఓ దంపతులకు 18 మంది సంతానం ఉన్నారని, వారికంటే ఒక బిడ్డ ఎక్కువ పుట్టేవరకు ఆపరేషన్ చేయించుకోమని ఆ దంపతులు చెప్పారు. ఈ సమాధానంతో అవాక్కయిన వైద్యులు బుధవారం వారి ఇంటికి వచ్చి నచ్చజెప్పారు. ఇప్పటికే ఉన్న పిల్లల భవిష్యత్‌పై దృష్టి పెట్టాలని కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఎట్టకేలకు వారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు ఒప్పుకున్నారు. -
ఎరువులో మనిషి ఎముకలు
మనోహరాబాద్(తూప్రాన్): పొలంలో చల్లడానికి తీసుకువచ్చిన వర్మికం పోస్ట్ ఎరువులో మనిషి ఎముకలు, పుర్రె బయటపడిన ఘటన మండల కేంద్రం మనోహరాబాద్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూపర్ సీడ్ పరిశ్రమలో పంట చేనుకు బలం కోసం మండలంలోని జీడిపల్లి శివారులోని తారాచంద్ ఫాం నుంచి వర్మి కంపోస్ట్‌ను ఈ నెల 1న ట్రాక్టర్లలో తెప్పించి చేనులో కుప్పలు వేయించారు. ఈ కుప్పలను ఆదివారం ఉదయం చల్లుతుండగా అందులోంచి మనిషి పుర్రె, ఎముకలు బయటపడటంతో కార్మికులు బయపడి యజమాన్యానికి తెలిపారు. వారు సమాచారం ఇవ్వడంతో సీఐ లింగేశ్వరరావు, ఎస్ఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అక్కడ లభించిన ఎముకలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తూప్రాన్ డివిజన్‌ను స్వాగతిస్తున్నాం
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వెల్లడి తూప్రాన్: తూప్రాన్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు నర్సాపూర్ ఎమ్మెల్యే సీహెచ్ మదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తూప్రాన్ మండలం మనోహరాబాద్ శివారులోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తూప్రాన్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటును తాను వ్యతిరేకిస్తున్నట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. భౌగోళికంగా అన్ని విధాలుగా ఆలోచించిన తరువాతే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కానీ నర్సాపూర్‌కు తాలూకాగా ఓ చరిత్ర కలిగి ఉందన్నారు. అందుకు తాము తూప్రాన్‌తోపాటు నర్సాపూర్‌ను సైతం రెవెన్యూ డివిజన్‌గా చేయాలని కోరుతున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే తమ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్నే సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. కానీ కొందరు సీఎంతో సన్నిహితంగా ఉన్నంఽదును తూప్రాన్‌ను అడ్డుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ సమావేశంలో శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి. రమణగౌడ్, రాజశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
7న కొత్తపల్లి–మనోహరాబాద్ రైలే ్వ లైనుకు శంకుస్థాపన
ఏడాది చివరి నాటికి భూసేకరణ పూర్తి కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ కరీంనగర్ సిటీ : కరీంనగర్–హైదరాబాద్‌లను కలిపే కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైనుకు ఆగస్టు 7న గజ్వేల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంఖుస్థాపన చేస్తారని ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల మీదుగా 151.36 కిలోమీటర్లతో ఈ లైను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మెదక్ జిల్లాలో 1260 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 60 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 900 ఎకరాల భూమి అవసరమన్నారు. మెదక్ జిల్లాలో 900 ఎకరాలు సేకరించామని, వరంగల్ జిల్లాలోని 60 ఎకరాలు సేకరించి పెగ్‌మార్కింగ్ చేపట్టామన్నారు. జిల్లాలో ఈ ఏడాది చివరివరకు భూసేకరణ పూర్తవుతుందన్నారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నపుడు జిల్లా కేంద్రం, రాజధానిలను కలిపేందుకు ఈ లైనును ప్రతిపాదించారన్నారు. మూడవ వంతు రాష్ట్ర వాటా కింద అప్పటి ప్రభుత్వం అంగీకరించి, ఉచితంగా భూమిని ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. మొదటి ఐదు సంవత్సరాల్లో రైల్వే శాఖకు నష్టం వస్తే భరించాలనే ప్రతిపాదనకూ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. పెద్దపల్లి–కరీంనగర్–నిజామాబాద్ రైల్వే లైను 26 సంవత్సరాలైనా పూర్తి కాలేదని, ఈ కొత్తపల్లి–మనోహరాబాద్ లైన్ మాత్రం వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. సిరిసిల్లలో బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభుతో శంకుస్థాపన చేయిస్తామన్నారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, బాసర తదితర పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైల్వే కారిడార్ నిర్మించనున్నట్లు చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త జిల్లాలు రెండే ఉంటాయన్నారు. స్మార్ట్‌సిటీగా ఎంపికైన కరీంనగర్ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు పీపుల్స్ కాంటాక్ట్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. జిల్లాలో విమానాశ్రయానికి బదులు ఎయిర్స్ ట్రిప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎలగందుల, ఎల్ఎండీ ప్రాంతాలను ఇందుకు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే బొడిగె శోభ, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.