రోదిస్తున్న కుటుంబ సభ్యులు
మనోహరాబాద్(తూప్రాన్): దుస్తులు ఉతికేందుకు చెరువుకు వెళ్లగా..అదే వారి పాలిట మృత్యుకుహరమైంది. బోనాల పండుగకు వచ్చిన తోటికోడళ్లు, కుటుంబసభ్యులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. మూడు కుటుంబాల్లో పెను విషాదం నింపిన ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో ఆదివారం బోనాలు జరిగాయి. గ్రామానికి చెందిన ఫిరంగిలక్ష్మి ఇంట్లో జరిగిన ఈ వేడుకలకు ఆమె అన్నదమ్ములు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్‌పేట్‌కు చెందిన దుడ్డు యాదగిరి, శ్రీకాంత్‌లు భార్యాపిల్లలతో హాజరయ్యారు.
సోమవారం మధ్యాహ్నం దుస్తులు ఉతికేందుకు ఫిరంగిలక్ష్మి తన పెద్దకూతురు లావణ్య (23), సోదరుల భార్యలు దుడ్డు బాలమణి (30), దుడ్డులక్ష్మి(25), బాలమణి కుమారుడు చరణ్(10)తో కలిసి ఊర చెరువు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో చెరువులో ఆడుకుంటున్న చరణ్ ఒక్కసారిగా నీటి మునిగిపోయాడు. గమనించిన లావణ్య, బాలమణి, లక్ష్మిలు కాపాడేందుకు లోతుగా ఉన్న నీటిలోకి వెళ్లి వారు కూడా మునిగిపోయారు. గట్టుపై ఉన్న ఫిరంగి లక్ష్మి కేకలు వేస్తూ వారిని కాపాడేందుకు నీటిలోకి దిగింది. పట్టుతప్పి ఆమె కూడా నీటిలో మునిగింది.
అటుగా వెళుతున్న ఓ యువకుడు గమనించి ఆమెను జుట్టు పట్టి బయటకు లాగడంతో ప్రాణాలతో బయటపడింది. బాలుడితోసహా నీటిలో మునిగిన లావణ్య, బాలమణి, లక్ష్మిని బయటకు తీయగా, అప్పటికే వారు విగతజీవులుగా మారారు. చరణ్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సర్పంచ్ నాగభూషణం, తూప్రాన్ పీఎసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment