సాక్షి, మనోహరాబాద్(మెదక్): ఫకీర్‌లమంటూ వచ్చి మాయమాటలు చెప్పి, మందు చల్లి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో షేక్ సాదుల్ల, జరీనాబేగం నివసిస్తున్నారు. షేక్ సాదుల్లా చికెన్ దుకాణ వ్యాపారి. ఈనెల 15వ తేదీ ఉదయం దుకాణానికి వెళ్లాడు. అతను వెళ్లిన కొంతసేపటికి ఇద్దరు ఫకీర్‌లు వచ్చారు. మీ ఇంటికి నజర్ బాగా ఉంది పోవడానికి రూ.1100 ఇస్తే నజర్ తీసేస్తామంటూ, ఇంట్లోకి బలవంతంగా వచ్చి కూర్చున్నారు.
నీ భర్త మరో మూడు రోజుల్లో చనిపోతాడు, అతడికి ఎమీ కావద్దంటే నీ బంగారు ఆభరణాలు ఇవ్వాలని జరీనా బేగంను భయపెట్టారు. నీకు బంగారం ముఖ్యమా? భర్త ఆరోగ్యం ముఖ్యమా? అని కంగారుపెట్టారు. ఆ భయంతో తన ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారపు నల్లపూసల దండ, తులం బంగారు చెవికమ్మలు, కాళ్లకు పెట్టుకున్న 15 తులాల వెండి పట్టీలు, 8 తులాల వెండిచైన్, 4 తులాల వెండి బ్రాస్‌లెట్, తులం వెండి ఉంగరాలు ఇచ్చింది. నగలు తీసుకున్న ఫకీర్‌లు జరీనాపై మందు చల్లడంతో సృహకోల్పోయింది. కొంత సేపటికి సృహ రావడంతో లేచి చూడగా వాళ్లు కనిపించలేదు, నగలు కనిపించలేదు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment