
సంఘటన స్థలంలో ఉన్న పుర్రె, ఎముకలు
మనోహరాబాద్(తూప్రాన్): పొలంలో చల్లడానికి తీసుకువచ్చిన వర్మికం పోస్ట్ ఎరువులో మనిషి ఎముకలు, పుర్రె బయటపడిన ఘటన మండల కేంద్రం మనోహరాబాద్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూపర్ సీడ్ పరిశ్రమలో పంట చేనుకు బలం కోసం మండలంలోని జీడిపల్లి శివారులోని తారాచంద్ ఫాం నుంచి వర్మి కంపోస్ట్‌ను ఈ నెల 1న ట్రాక్టర్లలో తెప్పించి చేనులో కుప్పలు వేయించారు.
ఈ కుప్పలను ఆదివారం ఉదయం చల్లుతుండగా అందులోంచి మనిషి పుర్రె, ఎముకలు బయటపడటంతో కార్మికులు బయపడి యజమాన్యానికి తెలిపారు. వారు సమాచారం ఇవ్వడంతో సీఐ లింగేశ్వరరావు, ఎస్‌ఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అక్కడ లభించిన ఎముకలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.