మన స్కూళ్లు.. నిరుద్యోగుల ఫ్యాక్టరీలు
ఇంతకూ మన దేశంలో విద్యకు సంబంధించిన అసలు సమస్య ఏమిటి? ప్రాథమిక స్థాయి విద్య నాణ్యత అన్నిటిలోకీ అతి పెద్దది. ప్రాథమిక పాఠశాలల్లో సరైన సదుపాయాలు లే వు, ఉపాధ్యాయులు తరచుగా విధులకు హాజరు కారు... అక్కడ పెట్టే ఉచిత భోజనాన్ని ఎంత నిర్లక్ష్యంగా తయారు చేస్తారంటే కొన్ని సంద ర్భాల్లో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటారు. ఈ కీలక కృషిని సక్రమంగా నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమై... పేదలు సైతం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. 2006లో 20 శాతం కంటే తక్కువ మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో ఉండగా, పదేళ్ల తర్వాత నేడది 30 శాతానికి పెరిగింది. ఈ ప్రైవేటు పాఠశాలల్లోనూ విద్య నాణ్యత రకరకాలుగా ఉంటోంది. చాలా సందర్భాల్లో ప్రభుత్వ పాఠశాలల కంటే అధ్వానంగా ఉంటోంది.
పర్యవసానం మన పాఠశాలల్లో తయారైన విద్యార్థులలో అధికులు విద్యా వంతులు కాకపోవడం. ప్రథమ్ అనే సంస్థ భారతదేశంలో విద్యపై అత్యుత్తమ మైన వార్షిక సర్వేను నిర్వహించింది. గుజరాత్‌కు సంబంధించిన ఆ అధ్యయన ఫలితాలను చూస్తే పరిస్థితి బాగా అర్థం అవుతుంది. 2014లో గ్రామీణ గుజరాత్‌లోని 7వ తరగతి విద్యార్థులలో 22 శాతం మాత్రమే ఒక ఇంగ్లిషు వాక్యాన్ని చదవగలిగారు. 2007లో ఇది 37 శాతంగా ఉండేది. అంటే, సుపరి పాలనకు పేరు మోసినదిగా భారతీయులలో చాలా మంది విశ్వసిస్తున్న రాష్ట్రం లోనే విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ఈ అధ్యయనం కోసం పరీక్షించిన 5వ తరగతి విద్యార్థులలో ఈ సంఖ్య 6 శాతం. అంటే, పదేళ్ల వ యస్కులైన 94 శాతం గుజరాతీ విద్యార్థులు ఒక ఇంగ్లిషు వాక్యాన్ని చదవలేరు. సర్వే చేసినది 20,000 మంది విద్యార్థులను కాబట్టి ఎంపిక చేసినవారి సంఖ్య చాలా తక్కువనడానికి లేదు.
5వ తరగతి విద్యార్థులలో సగం కంటే తక్కువ మందికి (44%) మాత్రమే గుజరాతీ చదవగలిగే శక్తి ఉంది. ఈ సంఖ్య కూడా గత కొన్నేళ్లుగా పడిపోతూ వస్తోంది. 3వ తరగతి విద్యార్థుల్లో కేవలం మూడింట ఒక వంతుకు మాత్రమే 1వ తరగతి స్థాయి చదివే సామర్థ్యం ఉంది. 2007 నుంచి ఈ ఏడాదికి ఈ సంఖ్య 10 శాతం మేరకు తగ్గిపోయింది. ఈ సమాచారం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధిం చినది. అయితే, ప్రైవేటు పాఠశాలల పరిస్థితీ అలాగే ఉంది. ఉదాహరణకు ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి విద్యార్థుల్లో 13% భాగహారాలు చేయగలిగితే, ప్రైవేటు పాఠశాలల్లో అది 16% మాత్రమే. భారతీయులందరిలోకీ గుజరాతీలు మాత్రమే పుట్టుకతో వ్యాపారస్తులని భావిస్తుంటారు. కానీ 80 శాతం ప్రాథమిక మైన అంక గణితం లెక్కలు చేయలేకపోతే భవిత నిరాశాజనకమైనదే అవుతుంది.
ఈ పరిస్థితికి కొంత వరకు వనరుల లేమిదే బాధ్యత అని అనుకోవచ్చు. 6 నుంచి 15 ఏళ్ల పిల్లలు ఒక్కొక్కరి విద్య కోసం అమెరికా ప్రభుత్వం మొత్తం రూ. 1,15,000 డాలర్లను ఖర్చు చేస్తుంది. అంటే పిల్లల్లో ఒక్కొక్కరిపై ఏడాదికి సగటున రూ. 7 లక్షల ఖర్చు. మన దేశంలోైనైతే ఇది అనూహ్యమైన విషయం. ఆ స్థాయికి చేరాలంటే మనకు 100 ఏళ్లు కావాలి. అయితే మనం ఎదుర్కొనే ఇలాంటి సమస్యలను ఎదుర్కొనని పేద దేశాలు కూడా ఉన్నాయని అంగీకరించక తప్పదు. మన దేశం కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న జింబాబ్వే మనకంటే మెరుగ్గా ఉంది. సమస్య కేవలం డబ్బుకు సంబంధించినదే కాదు.
భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం పాక్షికంగా మాత్రమే కారణమని నేను చాలా సార్లే రాశాను. పెద్ద సమస్యలు సమాజంలోనే ఉన్నాయి. వాటిని ఒక మంత్రి... ఆమె లేదా అతడు తాము ఎంతటి అద్భుత ప్రతిభా వంతులమని భావించినాగానీ మార్చలేరు. నిరుద్యోగులు కాగలిగిన బొటాబొటీ విద్యావంతులైన పౌరులను మన దేశం ఉత్పత్తి చేస్తోంది. వారు ఉత్పాదక మైనవారు కారు. వారు తమంతట తాముగా చేసిన తప్పంటూ ఏమీ లేకపోయినా గానీ వారు ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పనిచేయడానికి తగిన శక్తిసామర్థ్యాలతో సంసిద్ధులై లేరు. ఇది మన మానవ వనరుల మంత్రి తప్పేమీ కాదు. కాబట్టి ఇది ఆమె వినమ్రంగా అంగీకరించాల్సిన విషయం. ఆమె నేతృత్వంలోనే మొట్టమొద టిసారిగా కొత్త విషయాలేవైనా జరిగాయని ఆమె విశ్వసించినాగానీ... ఆమెకు ముందు ఎంతో మంది గొప్పవారు ఆ పదవీ బాధ్యతలను నిర్వహించారు. అంతా విఫలమయ్యారు.
అబ్దుల్ కలామ్ ఆజాద్ మన దేశ ప్రథమ విద్యామంత్రి. ఆయన గొప్ప మేధావి. రాజకీయ రంగానికి చెందిన వారిలో అత్యంత అధికంగా అధ్యయనం చేసిన వారిలో ప్రపంచంలోనే ఆయన ఎన్నదగినవారు. మత విషయాలకు సంబంధిం చిన పాండిత్యం కారణంగా ఆయనను మౌలానా అని పిలిచేవారు. ఆయన సులభతరం చేసిన ఖురానునే భారత, పాకిస్తాన్‌లలోని మౌల్వీలంతా నేటికీ ప్రామాణిక గ్రంథంగా అనుసరిస్తారు. చరిత్ర, సాహిత్యాలలో ఆయన పాండి త్యానికి కాంగ్రెస్‌లో మరెవరూ సాటిరారు.
1931లో, నెహ్రూ జైల్లో ఉండగా 900 పేజీల ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ అనే చక్కటి గ్రంథాన్ని రాశారు. వాస్తవాలను, తేదీలను సరిపోల్చుకోడానికి అప్పు డాయన వద్ద రిఫరెన్స్ గ్రంథాలేమీ లేవు. కానీ ఆజాద్, విజ్ఞాన సర్వస్వం వంటి ఆయన జ్ఞానమూ అందుబాటులో ఉండేవి. ప్రాచీన ఈజిప్ట్, గ్రీస్, రోమ్‌ల చరిత్రల నుంచి చైనా టీ వరకు సకల విషయ పరిజ్ఞానం ఆయనకుండేది. సాహిత్య అకాడమీ ఆయన ఏర్పరచినదే. గతంలో ఈ పదవిని నిర్వహించినవారిలో చాలా మంది గొప్పవారున్నారని చెప్పడానికే ఇదంతా చెబుతున్నాను.
నేటి విద్యాశాఖను మరో పేరుతో ఇప్పుడు మానవ వనరుల శాఖ అని పిలు స్తున్నారు. అదిప్పుడు నటి స్మృతి ఇరానీ నేతృత్వంలో ఉంది. ఆ పదవీ బాధ్య తలను తాను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని ఆమె విశ్వసిస్తున్నారు. కాకపోతే నరేంద్రమోదీ మద్దతుదార్లలో కొందరు సైతం ఆమె పని తీరు బాగాలేదని భావి స్తున్నారు. ఆ బాధ్యతలను నిర్వహించడానికి అవసరమైన విద్య, అనుభవమూ ఆమెకు కొరవడ్డాయని వారు అనుకోవడమే అందుకు కారణం.
కొన్ని రోజుల క్రితం, ఇరానీ తాను సాధించిన విజయాలలో కొన్నిటిని ఏక రువు పెట్టారు. అవి: ఒక్క ఏడాదిలో 4 లక్షలకుపైగా పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించడం. గణిత, విజ్ఞానశాస్త్ర స్థాయిలనూ, చదవడం, రాయటాలనూ మెరుగు పరచటంపై దృష్టిని కేంద్రీకరించడం, తదితరాలు. వీటిలో చాలా వరకు మొట్ట మొదటిసారిగా తన నిర్దేశనలో చేపట్టినవేనని ఆమె అన్నారు. విగ్రహాలను నెల కొల్పడం, హాజరును నమోదు చేయడంలో వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టడం వగైరాలు ఇంకా చాలానే ఆమె పేర్కొన్న ఆ జాబితాలో ఉన్నాయి.
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
aakar.patel@icloud.com