వచ్చే ఎన్నికల్లో ‘అయోధ్యే’ ప్రధానాంశం?! | Aakar Patel write article on Ayodhya Dispute | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో ‘అయోధ్యే’ ప్రధానాంశం?!

Published Sun, Mar 18 2018 1:00 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Aakar Patel write article on Ayodhya Dispute - Sakshi

అవలోకనం

జనాన్ని ఆకట్టుకునే రీతిలో ఎన్నికల ప్రచారాన్ని రూపొందించడానికి అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీలనూ, మార్కెటింగ్‌ సంస్థలనూ నియమించుకోవడమనే సంప్రదాయానికి మన దేశంలో శ్రీకారం చుట్టినవారు రాజీవ్‌గాంధీ. సార్వత్రిక ఎన్నికల సమయంలో రూపొందించుకునే నినాదాలు జనాన్ని ఆకర్షించగలిగితే పార్టీలు విజయం సాధించగలుగుతాయి. లేనిపక్షంలో పేలవమైన ఫలితాలు వస్తాయి. అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు త్వరలో ఇవ్వబోయే తీర్పు ఎలాంటిదైనా వచ్చే ఎన్నికల్లో అదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది.

వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ అంశంపై హోరాహోరీ పోరు ఉంటుంది? ఇప్పటినుంచి రానున్న నెలల్లో పార్టీలు, కూటములు ఏం చేయాలో, ఎటుండాలో ఖరారు చేసుకుంటాయి. అందరినీ ఆకట్టుకునేలా సందేశాలను రూపొందించి ప్రజలకు అందించేందుకు అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీలనూ, మార్కె టింగ్‌ నిపుణులను ఆశ్రయిస్తాయి. ఈ పని కోసం 2014లో బీజేపీ ఓగిల్వీ అండ్‌ మాథెర్‌ (ఓ అండ్‌ ఎం) సంస్థను నియమించుకోగా కాంగ్రెస్‌ డెంట్సూ సంస్థకు అప్పగించింది. నాకు తెలిసి దేశ రాజకీయాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఒక అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీకి అప్పగించడం 1985లోనే మొదలైంది. 

ఆ ఏడాది రాజీవ్‌ గాంధీ కాంగ్రెస్‌ ప్రచార బాధ్యతల కోసం రెడీఫ్యూజన్‌ సంస్థను నియమించుకు న్నారు. ఈసారి కూడా రాజకీయ నాయకులు సూటూ బూటుల్లో వచ్చే నిపుణు లతో సమావేశమవుతారు. ఆ నిపుణులు ఆకట్టుకునే సందేశాలతో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్లు ఇస్తారు. ‘యే దిల్‌ మాంగే మోర్‌’, ‘యే అందర్‌ కి బాత్‌ హై’, ‘అచ్ఛేదిన్‌ ఆనేవాలే హై’ లాంటి ఆకర్షణీయ నినాదాలను రూపొంది స్తారు. 2014 అనుభవాలతో ఈసారీ సామాజిక మాధ్యమాల్లోనూ, టెక్నాలజీ లోనూ భారీ పెట్టుబడులు పెడతారు. ఈ ఎన్నికల్లో చాలా మంది దండిగా డబ్బు గడిస్తారు.

2014 ఎన్నికల ప్రచారంలో రూ. 714 కోట్లు ఖర్చు చేశామని బీజేపీ ఎన్నికల సంఘానికి తెలిపింది. తాము రూ. 516 కోట్లు వ్యయం చేశామని కాంగ్రెస్‌ లెక్క లిచ్చింది. శరద్‌ పవార్‌ నాయకత్వంలోని ఎన్‌సీపీ రూ. 51 కోట్లు ఖర్చు చేసినట్టు నివేదిక సమర్పించింది. 2019 ఎన్నికల నాటికల్లా ఈ ఖర్చు రెట్టింపు నుంచి మూడురెట్లు పెరుగుతుందని భావించవచ్చు. అభ్యర్థులు చేసే ఖర్చు, పార్టీల తర ఫున వేర్వేరు కంపెనీలు చేసే ఖర్చు దీనికి అదనం. ఇదంతా మన దేశంలో సాధార ణమే. ప్రధాన అభ్యర్థులు ఒక్కొక్కరు రూ. 15 కోట్ల వరకూ సులభంగా ఖర్చుచే స్తారు. పార్టీ టిక్కెట్‌ రావడానికి వీరు చేసే ఖర్చు అదనం. మొత్తంగా 2019 ఎన్నికల్లోగా రూ. 25,000 కోట్ల వరకూ చేతులు మారుతుంది. 

ఇది మరీ అతి శయోక్తని మీరనుకుంటే నిరుడు జరిగిన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు రూ. 5,500 కోట్లు ఖర్చయిందని ‘ఎకనామిక్‌ టైమ్స్‌’ ప్రచురించిన అంచనాను గమనిం చండి. వార్తాపత్రికలు, టీవీ చానెళ్లు రాజకీయ ప్రకటనల రూపంలో అదనపు ఆదా యాన్ని సంపాదించుకుంటాయి. ఇందులో చాలా భాగం వార్తా కథనాల రూపంలో ఉంటాయి. చాలా లావాదేవీలుంటాయి. నీరవ్‌ మోదీ కుంభకోణం చూపినట్టు అవినీతి రహిత నేతతో అవినీతి ప్రారంభం కాదు. అక్కడే ముగియదు కూడా. ఏ కూటమివైపు మొగ్గితే గరిష్ట ప్రయోజనం ఉంటుందో ఎలాంటి భావోద్వేగాలకూ తావు లేకుండా రాజకీయ పార్టీలు మదింపు వేసుకుంటాయి. అవసరాన్నిబట్టి కొత్త కూటములకు సిద్ధపడతాయి. 

కొందరు నేతలు తొందరపడకుండా వేచిచూసే ధోరణి అవలంబించి, చివరిలో మరింత రాబట్టుకోవచ్చునన్న అంచనాలతో ఉంటారు. 2019కి ముందు మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. రాహుల్‌కి ఎంత దూరంగా ఉండాలో, లేదా ఎంత దగ్గరగా ఉండాలో ఈ నాలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలూ నిర్ధారించు కోవడానికి ఇవి దోహదపడతాయి. బీజేపీ ఎన్నికల్లో ఎలా విజయం సాధించగలు గుతున్నదో, అందుకు దోహదపడుతున్న కారణాలేమిటో దాని ప్రత్యర్థులు తెలుసు కున్నారు. అందుకు తగ్గట్టుగా తమ వ్యూహాలకు పదును పెట్టుకుం టారు. ఉత్తర ప్రదేశ్‌లో ఈమధ్య జరిగిన రెండు ఉప ఎన్నికల కోసం మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌లమధ్య కుదిరిన ఒప్పందాల వంటివి మనం చాలా చూస్తాం. వచ్చే ఎన్ని కలు ఏ అంశం ప్రాతిపదికన జరగనున్నాయన్న మొదటి ప్రశ్న దగ్గరకు మళ్లీ వెళ్దాం. 

మొత్తం ఆ ఎన్నికల తీరుతెన్నుల్ని ఎవరు నిర్దేశించగలుగుతారన్నదానిపై అది ఆధారపడి ఉంటుంది. 2014లో ప్రతిపక్షానికి చెందిన నాయకుడు ఆ ఎన్నికలను నిర్దేశించారు తప్ప అధికార పక్షం కాదు. బీజేపీ తన సారథికి ఉందంటున్న శక్తి సామర్థ్యాలను ముందుంచి బరిలోకి దిగితే కాంగ్రెస్‌ పార్టీ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంజాయిషీ ఇచ్చుకోక తప్పని స్థితిలో పడింది. 2009లో బీజేపీ తన ప్రచార సారథి ఎల్‌కే అద్వానీని పటిష్టమైన నాయకుడిగా చూపేందుకు  ఫ్రాంక్‌ సిమోస్, టాగ్‌ అండ్‌ ఉటోపియా అనే రెండు ఏజెన్సీలను ఉపయోగించుకుంది. ‘దృఢమైన నేత–నిర్ణయాత్మక ప్రభుత్వం’ అనేది అప్పటి నినాదం. 

మన్మోహన్‌ సింగ్‌ నిర్ణయరాహిత్యంతో కొట్టుమిట్టాడుతున్న నేతగా చూపడం ఆ ప్రచారం వెన కున్న ఉద్దేశం. ఆ ఏడాది కాంగ్రెస్‌ జే వాల్టర్‌ థాంప్సన్‌(జే డబ్ల్యూ టీ) అనే ఏజెన్సీ సాయం తీసుకుంది. ఆ సంస్థ ‘ఆమ్‌ ఆద్మీ’ నినాదానికి రూపకల్పన చేసింది. అయితే దాన్ని అనంతరకాలంలో అరవింద్‌ కేజ్రీ వాల్‌ సొంతం చేసుకున్నారను కోండి. 2004లో వాజపేయి గ్రే వరల్డ్‌వైడ్‌ సంస్థ రూపొందించిన ‘ఇండియా షైనింగ్‌’ నినాదాన్ని స్వీకరించి బరిలోకి దూకారు. ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ ఓడిపోయింది. అలా ఓడిపోవడానికి దారితీసిన పరిస్థితులేమిటో ఇప్పటికీ ఎవరికీ పూర్తి అవగాహనకు రాలేదు. 2019లో జరిగే ఎన్నికలు అనుకూలాంశ (పాజిటివ్‌) ప్రచారంతో ఉండవు. నా ఉద్దేశం ప్రకారం అటు పాలకపక్షం నుంచి గానీ, ప్రతిపక్షం నుంచిగానీ ‘అచ్ఛేదిన్‌’ మాదిరి నినాదంతో ప్రచారం ఉండదు. మన ఆర్థిక వ్యవస్థ అంత ప్రత్యేకత చూపే స్థాయిలో ఏమీ పనిచేయలేదు. పౌరు లుగా మన బతుకులు 2014కూ, ఇప్పటికీ గమనించే స్థాయిలో ఏం మారలేదు. 

కొద్దిరోజుల క్రితం నేను ఒక బీజేపీ నేతతో మాట్లాడాను. 2019నాటికి అయోధ్య అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతామని ఆయన చెప్పారు. ఇప్పటికైతే బీజేపీ దాని జోలికి పోలేదు. కానీ ఇదంతా మారొచ్చు. సుప్రీంకోర్టు అయోధ్య కేసును విచారిస్తోంది. త్వరలో ఆ కేసులో తీర్పు వెలువడొచ్చు. దీన్లో తమను కూడా కక్షిదారులుగా చేర్చాలంటూ సుబ్రహ్మణ్యస్వామి తదితరులు కొద్ది రోజులక్రితం కోరితే సుప్రీంకోర్టు తిరస్కరించింది. సంప్రదింపుల ద్వారా దీనికి పరిష్కారం వెదకాలన్న ప్రతిపాదనను కూడా అది ఒప్పుకోలేదు. ‘భూ వివాదంలో మధ్యేవాద పంధా ఎలా సాధ్యమ’ని ప్రశ్నించింది. అదెలాంటి తీర్పయినా ఆ అంశం వచ్చే ఎన్నికల్లో ప్రధానమవుతుంది. అయితే ఆ ప్రచారం ద్వారా జనంలోకెళ్లే సందేశం ఏమిటన్నది ఊహించడానికే నాకు వణుకొస్తోంది.

 - ఆకార్‌ పటేల్‌ 
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత 
aakar.patel@icloud.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement