గోరక్షక హింసను ఎలా ఆపుతారో చెప్పాలి | Aakar patel writes on Gaurakshaks | Sakshi
Sakshi News home page

గోరక్షక హింసను ఎలా ఆపుతారో చెప్పాలి

Published Sun, Jul 2 2017 12:39 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

గోరక్షక హింసను ఎలా ఆపుతారో చెప్పాలి - Sakshi

గోరక్షక హింసను ఎలా ఆపుతారో చెప్పాలి

అవలోకనం

మోదీ జూన్‌ 29 ప్రసంగం చివర్లో ఆయన హింస గురించి మాట్లాడినా, చంపడం ఆమోదనీయం కాదనడానికే పరిమితమయ్యారు. కానీ గోరక్షణ పేరిట చంపడం ఎందుకు జరుగుతోంది? దాన్ని ఆపడానికి మోదీ ఏమి చేస్తారు? అనేవి తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. మోదీ, బీజేపీలు గోరక్షను ముందుకు తెస్తున్నంతవరకూ గోరక్షకులు పుట్టుకొస్తూనే ఉంటారు. మోదీ, బీజేపీలు గోరక్షకుల చర్యలకు మత కోణం ఉందని అంగీకరించడంలేదు. కానీ మాంసం, తోళ్లు.. ముస్లింలు, దళితుల జీవనాధార వృత్తులు. ఈ గోరక్ష వల్ల ఆ రెండు సామాజిక వర్గాలకు నష్టం జరుగుతోంది.

గోరక్షక హింస అంటే గొడ్డు మాంసం గురించి భారతీయులను హతమారుస్తుండటమనే సమస్య అని అర్థమా? అలాగయితే, ఆ సమస్య పరిష్కారానికి చేయాల్సింది ఏమిటి? మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే 97 శాతం గోరక్షక హింస జరిగిందని లాభాపేక్ష రహితమైన గణాంక పాత్రికేయ వెబ్‌సైట్‌ అయిన ‘ఇండియాస్పెండ్‌’పేర్కొంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, మహారాష్ట్ర, హరియాణా తదితర రాష్ట్రాలు గోమాంస నిషేధాన్ని ముందుకు తేవడం ప్రారంభించడంతోనే ఈ హత్యలు మొదలయ్యాయి. వాస్తవాలిక్కడ సుస్పష్టంగానే కనిపిస్తున్నాయి. వాటిని చూడాలంటే.. ఒక్కసారి గత కొన్ని వారాలను మననం చేసుకుని, దేశవ్యాప్తంగా ఏం జరిగిందో చూడండి. జార్ఖండ్, రాంచీ సమీపంలోని రామ్‌ఘర్‌లో జూన్‌ 29న అలీముద్దీన్‌ అన్సారీ అనే వ్యాపారిని ఒక గుంపు కొట్టి చంపేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తాను హింసకు వ్యతిరేకినని చెప్పిన కొన్ని గంటలకే ఈ దాడి జరిగింది.

జార్ఖండ్‌లో జూన్‌ 27న ఉస్మాన్‌ అన్సారీ అనే పాడి రైతుపై వందిమందికి పైబడిన గుంపు దాడి చేసి చావబాదింది. ఆయన ఇంటికి నిప్పుపెట్టగా కొంత భాగం కాలిపోయింది. దాడి చేసినవారు తమపై కూడా రాళ్లు రువ్వడంతో 50 మంది పోలీసులు గాయపడ్డారని పోలీసు అధికారులు పాత్రికేయులకు చెప్పారు. జూన్‌ 24న పశ్చిమ బెంగాల్‌లోని నార్త్‌ దినాజ్‌పూర్‌లో ఆవులను దొంగిలిస్తున్నారన్న ఆరోపణతో నజీరుల్‌ హక్, మొహమ్మద్‌ సమీరుద్దీన్, మొహమ్మద్‌ నజీర్‌ అనే ముగ్గురు నిర్మాణ కార్మికులను కొట్టి చంపేశారు.

ఇంతవరకు ముగ్గురిని అరెస్టు చేసి వారిపై హత్యానేరాన్ని నమోదు చేశారు. హరియాణాలో జూన్‌ 22న పదిహేనేళ్ల జునైద్‌ ఖాన్‌ను రైలులో కత్తులతో పొడిచి చంపేశారు. జునైద్‌ను పొడిచి చంపడానికి ముందు అతను ‘‘గొడ్డుమాంసం తినేవాడు’’అని ఆరోపిస్తూ అతని తలమీది టోపీని తీసి బయటకు విసిరేశారు. జునైద్‌ సోదరుడు ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. బతికి బయటపడ్డ అతడు, కనీసం 20 మంది ఈ దాడిలో పాల్గొన్నారని చెప్పినట్టు పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. రాష్ట్ర పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.

మహారాష్ట్ర, మాలెగావ్‌లో మే 26న మాంసం వ్యాపారులైన ఇద్దరు ముస్లింలపై వారు గోమాంసాన్ని అమ్ముతున్నారనే ఆరోపణతో ఒక గోరక్షక దళం దాడి చేసింది. వారిని చెంపదెబ్బలు కొట్టి, తిట్టి, ‘‘జై శ్రీరామ్‌’’అనమని నిర్బంధించడం ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఫూటేజీలో కనిపించింది. ఆ కేసులో తొమ్మిది మందిని ఆరెస్టు చేశారు. కానీ, ఆ ఇద్దరు మాంసం వ్యాపారులపైన కూడా ‘‘మత భావనలను గాయపరచడం’’అనే క్రిమినల్‌ నేరారోపణలను మోపారు. అస్సాం, నవగావ్‌లో అబూ హనీఫ్, రియాజుద్దీన్‌ ఆలీలను ఆవును దొంగిలించారన్న అనుమానంతో ఒక గుంపు కొట్టి చంపేసింది. పోలీసులు హత్య కేసు నమోదు చేశారుగానీ ఇంతవరకు అరెస్టులు మాత్రం చేయలేదు.

రాజస్తాన్, ఆల్వార్‌లో ఒక రహదారికి సమీపాన ఏప్రిల్‌ 1న, 55 ఏళ్ల రైతు, పాడి రైతుఅయిన పెహ్లూ ఖాన్, మరో నలుగురు ముస్లింలపై ఒక గుంపు దాడి చేసింది. రెండు రోజుల తర్వాత ఖాన్‌ ఆ గాయాలకు మృతి చెందాడు. వారు ఆవుల స్మగ్లర్లంటూ ఆ గుంపు తప్పుడు ఆరోపణ చేసింది. ఆ హత్యలను సమర్థిస్తున్నట్టుగా.. ఖాన్‌ ఆవుల స్మగ్లర్ల కుటుంబానికి చెందిన వ్యక్తి అని ఆ ఘటన తదుపరి రాజస్తాన్‌ హోంమంత్రి ప్రకటించారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

జూన్‌ 27న జార్ఖండ్‌లో కొట్టి చంపేసిన ఘటన జరిగిన తర్వాత, ఈ హత్యలు ప్రభుత్వ రక్షణతో జరగుతున్నవేనంటూ, వాటిని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ‘‘భారతదేశంలో హింసకు తావు లేదు. గాంధీజీ గర్వపడేలాంటి భారతదేశాన్ని సృష్టిద్దాం’’అని రెండు రోజుల తర్వాత మోదీ ట్వీట్‌ చేశారు. దానికి ఓ రెండున్నర నిమిషాల వీడియోను జత చేశారు. అది జూన్‌ 29న ఆయన గోవధపై చేసిన ప్రసంగం. అందులో మోదీ ఒక నిమిషం 45 సెకన్లపాటూ గోరక్షణను కీర్తించారు. చివరి 30 సెకన్లలో హింస గురించి మాట్లాడారు. అది కూడా చంపడం ఆమోదనీయం కాదని చెప్పడానికే పరిమితమయ్యారు. అసలు చంపడం ఎందుకు జరుగుతోంది, దాన్ని ఆపడానికి ఆయన ఏమి చేస్తారు అనే వాటిపై ఆయన మాట్లాడాలని మనం కోరుకుంటున్నాం.

మోదీ, బీజేపీలు గోరక్షను ముందుకు తెస్తున్నంతవరకూ దేశంలో గోరక్షకులు పుట్టుకొస్తూనే ఉంటారు. దీన్ని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఇక రెండో సమస్యకు వస్తే, మోదీగానీ, బీజేపీగానీ గోరక్షకుల చర్యలకు మత కోణం ఉందని అంగీకరించడంలేదు. మాంసం, తోళ్లు... ముస్లింలు, దళితుల జీవనాధార వృత్తులు. ఈ గోరక్ష వల్ల ఆ రెండు సామాజిక వర్గాలకు నష్టం జరుగుతోందనేదాన్ని నిరాకరించడం నయవంచన. జార్ఖండ్‌లోని తాజా హత్య తర్వాత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దాన్ని మతంతో ముడిపెట్టరాదని అన్నారు. కానీ గణాంక సమాచారం ఆయన చెప్పేది తప్పని చూపుతుండటమే సమస్య. ఇది మతంతో ముడిపడినదే. ఈ గోరక్షా కార్యక్రమంతో ముస్లింలు మాత్రమే లేదా ముస్లింలే ప్రధానంగా దాడులకు, హత్యలకు గురవుతున్నారు,

ఈ సమస్యపై కాంగ్రెస్‌కు తనకంటూ ఒక వైఖరే లేదు. గుజరాత్‌లో అది బహిరంగంగానే గోరక్షకు అనుకూలంగా మాట్లాడింది. ఆ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై దాడి చేశారు. మోదీ ఉపన్యాసం తర్వాత మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ‘‘ప్రధాని గోరక్షకులను హెచ్చరించిన రోజునే, జార్ఖండ్‌లో మొహమ్మద్‌ అలీముద్దీన్‌ను ఒక గుంపు కొట్టి చంపేసింది. ఈ కొట్టి చంపేసే మూకలకు ప్రధాని అంటే భయం లేదనేది స్పష్టమే’’అని అన్నారు. ‘‘ప్రధాని గోరక్షకులను, కొట్టి చంపే మూకలను హెచ్చరించారు. మంచిది. అయితే ఆయన తన ఆదేశం అమలయ్యేలా ఎలా చేస్తారో దేశానికి చెప్పాలి’’అని కోరారు. 2016లో ఇలాంటి దాడులు 26 జరిగాయని ఇండియా స్పెండ్‌ తెలిపింది. 2017లో కేవలం ఆరునెలల్లో, ఇప్పటికే 21 దాడులు జరిగాయి. సమస్య మరింతగా పెరుగుతోందనేది కనబడుతూనే ఉంది. మోదీ దీన్ని ఎలా అంతం చేస్తారో చూడాలని ప్రపంచమంతా వేచి చూస్తోంది.


వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
ఆకార్‌ పటేల్‌
ఈ–మెయిల్‌ : aakar.patel@icloud.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement