అన్ని ప్రభుత్వాల సారాంశం ఒక్కటే
తమ హక్కులకోసం, మనుగడ కోసం ఆందోళన చేస్తున్న పౌరులను భారత రాజ్యవ్యవస్థ అణచివేయటం నరేంద్ర మోదీతోనే మొదలు కాలేదు. తొలి ప్రధాని నెహ్రూ హయాంలో, బ్రిటిష్ హయాంలో, బహుశా అంతకుముందు నుంచి కూడా ఇది కొనసాగుతోంది. మోదీ తర్వాత కూడా ఇదే జరగనుంది. తన కంటే ముందున్నవారు పాటించిన దాన్ని మోదీ కేవలం కొనసాగిస్తున్నారని మనం అంగీకరించక తప్పదు. భాషలో మాత్రమే తేడా ఉంటోంది తప్ప, వైఖరి మాత్రం అప్పుడూ ఇప్పుడూ కూడా కఠినంగా ఉంది.
భారత్‌ను ఉదారవాద వ్యతిరేక దేశంగా మారుస్తున్నారన్నది నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తప్పుగా మోపే ఆరోపణల్లో ఒకటి. ఉదారవాద వ్యతిరేకత (ఇల్లిబ రల్) అనే పదానికి అసహనం అనీ, వాక్ స్వేచ్ఛపై ఆంక్షలకు మద్దతు ఇవ్వడం అని అర్థం. ఈ విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుగా నిందిస్తున్నారని నేనంటాను. ఎందుకంటే భారత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో కూడా ప్రత్యేకించి ఉదారవాద స్వభావంతో లేదని వాస్తవాలు చూపుతున్నాయి.
దశాబ్దాలుగా కొన్ని సమస్యల పరిష్కారంపై పనిచేస్తున్న పౌర సమాజ బృందాలు, ప్రభుత్వేతర సంస్థలు నేను చెప్పిన అంశాన్ని ససాక్ష్యంగా నిర్ధారిస్తాయి. ఆదివాసీలు, కశ్మీరీలు, ఈశాన్య భారత ప్రజల హక్కుల వంటి సమస్యలు ఇటీవల ప్రాధాన్యం సంతరించుకున్నవి కావు. దశాబ్దాలుగా ఈ సమస్యలు మనని పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం లేదా ఈ ప్రధానమంత్రే సమస్యలన్నిటికీ కారణం అని భావించడం తప్పు.
ఖనిజ సంపదకు సంబంధించి అత్యంత సుసంపన్నంగా ఉండే ఆదివాసీ భూములను కొల్లగొట్టడం అనేది నెహ్రూ హయాంలో, ఇంకా చెప్పాలంటే ఆయన కంటే ముందే మొదలైంది. ఆదివాసీలకు వ్యతిరేకంగా అత్యంత అసహ్యకరమైన, అత్యంత తలబిరుసుతనంతో కూడిన చర్యలను మన్మోహన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే చేపట్టారు. కొద్దిమంది చేస్తున్నారని చెబుతున్న నేరాలకు గానూ ఆదివాసులందరినీ శిక్షిస్తున్నారు. మధ్యభారత్ ప్రాంతంలో వేలాది పారామిలటరీ బలగాలు తిష్టవేయడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
2015 అక్టోబర్ నెలలో ‘మావోయిస్టు వ్యతిరేక చర్యలు : ఛత్తీస్‌గఢ్, గగనతలం నుంచి ప్రతీకార దాడులు కొనసాగించనున్న భారత వాయుసేన’ శీర్షికతో పత్రికలు వార్త ప్రచురించాయి. భారత వాయుసేన తన సొంత ప్రజలపై ఆకాశం నుంచి దాడి చేయడానికి రష్యన్ తయారీ ఎమ్‌ఐ–17 హెలికాప్టర్లను ఉపయోగిం చిందన్నది ఆ వార్తా కథనం సారాంశం. వాయుసేన ‘విజయవంతంగా దాడుల’ను కొనసాగించిందని ‘మూడు ఐఎఎఫ్ హెలికాప్టర్లు బీజాపూర్ ప్రాంతంపై విహరించి, దాడులు చేశాయ’ని వార్తలు తెలిపాయి. దాడులు అంటే ‘తక్కువ ఎత్తులో విహరిస్తున్న యుద్ధ విమానం నుంచి పదేపదే బాంబులతో దాడి చేయడం అనీ లేదా మెíషీన్ గన్లతో కాల్పులు జరపటం’ అనీ అర్థం. భారత దేశం గురించి పరిచయం ఉన్నవారికి దేశంలో జనం ఏమాత్రం లేని ప్రాంతాలు అంటూ ఏవీ లేవని తెలిసే ఉంటుంది. మరి మన వాయుసేన పైనుంచి బాంబులతో, మెషీన్ గన్ కాల్పులతో సైనిక చర్యల ప్రాక్టీస్ చేసిన ప్రాంతంలో ఏం జరిగి ఉంటుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.
అయితే ఈ స్థాయి హింస ఆ ప్రాంతానికి కొత్త కాదనీ, బ్రిటిష్ కాలం నుంచి, ఇంకా చెప్పాలంటే అంతకు ముందునుంచి కూడా ఆందోళన చేస్తున్న పౌరులను భారత రాజ్యవ్యవస్థ అణచివేస్తోందన్నదే ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఇదంతా మోదీతోనే ప్రారంభమైందని భావించడం తప్పు మాత్రమే కాకుండా వాస్తవ సమస్యను నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి అలాంటి ఊహే మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. మోదీకి ముందు, భారత రాజ్య వ్యవస్థ తన పౌరులతో ఇలాగే వ్యవహరించింది, దురదృష్టవశాత్తూ మోదీ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తుంది కూడా.
మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంతో నేను కొన్ని నెలల క్రితం సంభాషిం చాను. కశ్మీర్ నుంచి సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పీఎ)ని భారత ప్రభుత్వం ఎత్తివేయాలని ఆయన చెప్పారు. అయితే తాను హోం మంత్రిగా ఉన్నప్పుడు కూడా చిదంబరం ఈ అభిప్రాయాన్నే వ్యక్తీకరించి ఉంటే అది మరింత విశ్వసనీయంగా ఉండి ఉండేదని నేను భావిస్తున్నాను. కశ్మీరీల ఆందోళనపై ప్రస్తుత ప్రభుత్వ కఠిన వైఖరిపట్ల చింతిస్తున్నవారు.. గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి కఠిన వైఖరినే ప్రదర్శించాయని తెలుసుకోవాలి. ఏమంటే దాని వ్యక్తీకరణే కాస్త భిన్నంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేకమందిని చంపించింది. కానీ అది ఈ విషయంపై మృదువుగా మాట్లాడుతుంది. బీజేపీ కఠిన పదాలు వాడుతుంది. రెండు పార్టీల మధ్య ఉన్న అసలు వ్యత్యాసం ఇదే.
తన ప్రజల అవసరాలు, హక్కులకు భిన్నంగా ఉండే ప్రాథమ్యాలపైనే భారత రాజ్యవ్యవస్థ పనిచేస్తూ వచ్చింది. భారత్‌ను లూఠీ చేస్తూ తన సొంత ప్రయోజనాల కోసం మన వనరులను తరలిస్తోందని మనం బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వాన్ని విమర్శిస్తూంటాం. 1943 నాటి బెంగాల్ కరువు ఉదాహరణను యుద్ధ విధాన ఫలితంగా చూపుతుంటారు. ప్రజలు ఆకలిదప్పులకు గురవుతూ, అవిద్యావంతులుగా ఉన్న ప్రాంతంలో అది నిజంగా నీతిబాహ్యమైన ప్రవర్తనే. అయితే, ప్రజాస్వామ్య పం«థాలో ఇది ఎంత భిన్నంగా ఉందని నేను ఆశ్చర్యపోతుంటాను. గత సంవత్సరం భారత వాయుసేనకు 36 యుద్ధ విమానాలకోసం మనం రూ. 59,000 కోట్లు ఖర్చుపెట్టాం. ఈ ఏడు భారత నావికాబలగం కోసం 57 యుద్ధవిమానాలపై రూ. 50,000 కోట్లు ఖర్చుపెడుతున్నాం.
సంవత్సరానికి రూ. 33,000 కోట్ల ఆరోగ్య బడ్జెట్ (వాస్తవానికి అరుణ్ జైట్లీ హయాంలో దీనిపై కోత విధించారు) ఉంటున్న దేశంలో ఇలా జరుగుతోంది. ప్రతి వారం 10 వేలమంది భారతీయ పిల్లలు పోషకాహార లేమి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీళ్ల కోసం మనం మరికొంత డబ్బు వెచ్చించలేం కానీ మన సాయుధబలగాల కోసం మాత్రం మరిన్ని ‘బొమ్మ’లను మాత్రం కొంటుంటాం. ఇది మాత్రం బ్రిటిష్ రాజ్ కాలం నాటి అనైతిక చర్య కాదా? ఈ కొత్త యుద్ధ విమానాలు మనకు తప్పనిసరి అవసరమేనా అని ఎవరైనా కేసు పెట్టగలరా? పెట్టలేరు. మన దేశంలో దీనిపై కనీసం చర్చకూడా జరపరు. దేశంలో అన్ని ప్రభుత్వాలూ ఇదే వైఖరిని అవలంభిస్తున్నాయి. పైగా చాలా విషయాల్లో ప్రస్తుత ప్రధానమంత్రితో ఎవరైనా విభేదించవచ్చు కానీ తనకంటే ముందున్నవారు పాటించిన దాన్ని ఈయన కేవలం కొనసాగిస్తున్నారని మనం అంగీకరించక తప్పదు.
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com