జార్ఖండ్‌లో హోరాహోరీ
13న తొలి దశలో 43 స్థానాల్లో పోలింగ్
ఎన్డీఏ, ఇండియా కూటముల అమీతుమీకి జార్ఖండ్‌లో సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల పోరులో భాగంగా 13వ తేదీన తొలి దశలో 43 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. మిగతా 38 సీట్లకు నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు పోలింగ్ జరగనుంది. 23న రెండు రాష్ట్రాల ఫలితాలు ఒకేసారి వెల్లడవుతాయి. జార్ఖండ్‌లో సంఖ్యాధికులైన ఆదివాసీలే ఈసారి కూడా పార్టీ ల గెలుపోటములను నిర్ణయించనున్నారు.
మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో 28 ఎస్టీ రిజర్వుడు సీట్లే కావడం విశేషం. వాటితో పాటు పలు ఇతర అసెంబ్లీ స్థానాల్లోనూ వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. దాంతో ఆదివాసీలను ప్రసన్నం చేసుకోవడానికి అధికార ఇండియా కూటమి, విపక్ష ఎన్డీఏ సంకీర్ణ సారథి బీజేపీ పోటీ పడుతున్నాయి. 2019 ఎన్నికల్లో 28 ఎస్టీ స్థానాలకు గాను ఇండియా కూటమి సారథి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఏకంగా 19 సీట్లలో పాగా వేయడం విశేషం.
మొత్తమ్మీద 26 ఎస్టీ స్థానాలూ ఇండియా కూటమి ఖాతాలోకే వెళ్లాయి. బీజేపీకి కేవలం రెండే ఎస్టీ స్థానాలు దక్కాయి. అందుకే ఈసారి ఆదివాసీ స్థానాల్లో పాగా వేయడమే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలుకుని బీజేపీ అగ్ర నేతలంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
బంగ్లాదేశీ చొరబాటుదారులకు జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఆదివాసీ హోదా కల్పిస్తూ వారి పొట్ట కొడుతోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. సీఎం హేమంత్ సోరెన్ అవినీతిలో పీకల్లోతున మునిగిపోయారంటూ ఊదరగొడుతున్నారు. బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇండియా కూటమి తరఫున హేమంత్‌కు దన్నుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రచార రంగంలో ఉన్నారు.
ప్రియాంక కూడా ఒకట్రెండుసార్లు ప్రచారంలో పాల్గొన్నారు. ఈసారి ఇండియా కూటమిలో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, వామపక్షాలు 3 చోట్ల పోటీలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం), జేడీ(యూ) కలసి పోటీ చేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాలు గెలిచి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్‌కు 16 దక్కాయి. జేవీఎంకు 3, ఏజేఎస్‌యూకు 2 సీట్లొచ్చాయి. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
బంధువులు, వారసుల జోరు
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారసుల హడావుడి మామూలుగా లేదు. ఈసారి ఏకంగా 25కు పైగా స్థానాల్లో నేతల బంధుమిత్రులు బరిలో ఉన్నారు. జేఎంఎంను వీడి బీజేపీలో చేరిన మాజీ సీఎం చంపయ్ సోరెన్ కుమారుడు బాబూలాల్ సోరెన్, మరో మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా సాహు, ఇంకో మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా, మరో మాజీ సీఎం మధు కోడా భార్య గీత తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. జేఎంఎం నుంచి సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన ఈసారి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. ఆయన సోదరుడు బసంత్ సోరెన్, వదిన సీతా సోరెన్ కూడా పోటీలో ఉన్నారు. జేఎంఎం నుంచి 15 మంది దాకా నేతల వారసులు రంగంలో దిగారు.
వలసదారులే ప్రధానాంశం!
నిరుద్యోగం, ధరల పెరుగుదల, సాగు సంక్షోభం, గ్రామీణుల్లో నిరా శా నిస్పృహలు తదితర సమస్యలె న్నో జార్ఖండ్‌ను పట్టి పీడిస్తున్నాయి. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా వలసల అంశాన్ని తలకెత్తుకుంది. వలసదారుల సంక్షోభాన్ని ప్రధాన ఎన్ని కల అంశంగా మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. జా ర్ఖండ్ జనాభాలో ఏకంగా 35 శాతం మంది వలసదారులే కావడం విశేషం. బంగ్లాదేశ్ నుంచి వచి్చపడుతున్న వలసలు ఆదివాసీల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని బీజేపీ నేతలంతా గట్టిగా ప్రచారం చేస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment