విపక్ష కొత్త కూటమి ఆవిర్భావంతో అధికారంలో ఉన్న ఎన్డీయే National Democratic Alliance కూడా అప్రమత్తమైంది. బెంగుళూరులో జరిగిన కాంగ్రెస్, తదితర ప్రతిపక్షాల కూటమి సమావేశానికి పోటీగా.. ఢిల్లీలో బిజెపి ఆధ్వర్యంలోని NDA కూటమి కూడా భేటీ అయింది. ఈ రెండు కూటములకు హాజరైన నేతలను గమనిస్తే, చూడడానికి విపక్ష కూటమిలో బలమైన నేతలు ఉన్నారు. అదే ఎన్డీయే కూటమిలో ప్రధాని నరేంద్ర మోదీనే అన్నిటింకి కర్త,కర్మ,క్రియగా ఉన్నట్లు కనిపించింది. గత తొమ్మిదేళ్లలో విపక్షం ఈ భేటీతో తొలిసారిగా మోదీకి ఒక సవాలు విసిరిందని చెప్పవచ్చు.
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇంతకాలం సర్వేలు చెబుతూ వచ్చాయి. ఇప్పుడు ఇండియా పేరుతో కొత్త కూటమి పూర్థి స్థాయి రూపానికి వస్తే రాజకీయ వాతావరణం కొంత మారే అవకాశం కూడా ఉంది. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలియన్స్ Indian National Developmental Inclusive Alliance అన్నది పూర్తి పేరు అయినా, ఇండియా మొత్తం బీజేపీ పోరాడబోతోందన్న సంకేతం ఇవ్వడానికి ఇండియా కూటమిగానే ప్రచారం చేస్తారు. అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇండియాపై యుద్దానికి దిగితే గెలుపెవరిదో అందరికి తెలుసు అని సెంటిమెంట్ డైలాగు వాడారు. కానీ, నితీష్ కుమార్ ఈ పేరును వ్యతిరేకించారట. ఈ కూటమికి ఉండే ప్రధాన సమస్య పార్టీల మద్య వైరుధ్యాలు. అలాగే అందరూ పెద్ద నాయకులు కావడం కాబోలు. వీరిలో ప్రధాని అభ్యర్ధి ఎవరు అన్నది తేలడం కూడా అంత తేలికకాదు.
కాంగ్రెస్, తదితర విపక్షాలు అవినీతి పార్టీలని, కుటుంబం కోసం పనిచేసే పార్టీలని, ఎన్డీయే మాత్రం ప్రగతిదాయకమని అని మోదీ వ్యాఖ్యానిస్తే.. దేశ రాజ్యాంగాన్ని బీజేపీ భ్రస్టుపట్టించిందని, రాష్ట్ర ప్రభుత్వాలను దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తోందని, ప్రత్యర్ధి పార్టీల నేతలపై వాటిని ప్రయోగిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటూ ఇండియా కూటమి పిలుపు ఇస్తోంది.
ఇందులో కీలకమైన పాయింట్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాని పదవిని వదలుకోవడానికి సిద్దం అవడం అని చెప్పాలి. బీజేపీ అధికారంలోకి రాకుండా ఉంటే చాలు అనే గట్టి ధోరణిని కాంగ్రెస్ కనబరుస్తోంది.
✍️ ఎన్డీయే తరపున భేటీ అయిన పార్టీలు పేరుకు 38 అయినా వాటిలో 24 పార్టీలకు ఒక్క ఎమ్.పి కూడా లేరట!. రెండు పార్టీలకు ఇద్దరు ఎమ్.పిలు ఉంటే, ఏడు పార్టీలకు ఒక్క ఎమ్.పి చొప్పునే ఉన్నారట. దానిని మోదీ సమర్ధించుకునే ప్రయత్నం చేసినా, చూసేవారికి అర్ధం అయ్యేదేమిటంటే, అసలు బలం లేని, ఎంపీలు లేని ,చిన్నా,చితక పార్టీలను పోగుచేసి , విపక్ష కూటమి కన్నా తమ వద్దే ఎక్కువ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవడానికి ప్రయత్నించినట్లు కనబడుతుంది. కొన్ని పార్టీల పేర్లను గతంలో ఎప్పుడూ విని ఉండకపోవచ్చు. వీటిలో కూడా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చిన్న పార్టీలు, అలాగే యూపీ, తమిళనాడుకు చెందిన చిన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. ఏపీ నుంచి జనసేన హాజరు అయింది.ఆ పార్టీకి ఒక్క ఎమ్.పి కూడా లేరు. అలాగే ఒక్క ఎమ్మెల్యే ఆ పార్టీ పక్షాన గెలిచినా, ప్రస్తుతం ఆ పార్టీలో లేరు. మహారాష్ట్రలో చీలిక వర్గానికి చెందిన ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్.సి.పి చీలికవర్గం మాత్రం ఎన్డీయే సమావేశానికి హాజరయ్యాయి.
అదే.. విపక్ష కూటమి సమావేశానికి సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే వంటి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు, ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీ, స్టాలిన్ , మహారాష్ట్ర నుంచి శరద్ పవార్, ఉద్దావ్ ఠాక్రే వంటి హేమాహేమీలు హాజరవడం విశేషం.
ఒంటరి కేసీఆర్
తెలంగాణ లో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఈ రెండు సమావేశాలలో దేనికి వెళ్లలేదు. కొన్నాళ్లు ఫెడరల్ ప్రంట్ అని, ఆ తర్వాత జాతీయ రాజకీయ పార్టీని స్థాపించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి ప్రధాన ప్రత్యర్ధులుగా ఉండడంతో ఆయన ఎటువైపు మొగ్గలేకపోయారు. కాంగ్రెస్ , బీజేపీయేతర కూటమి కట్టాలన్న ఆయన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆయనను ఇంతకుముందు కలిసిన అఖిలేష్ యాదవ్ కాని, జార్ఖండ్ ముఖ్యమంత్రి సొరేన్ కాని విపక్ష కూటమికే జై కొట్టారు. స్టాలిన్, నితీష్ కుమార్ వంటివారు ఇప్పటికే కాంగ్రెస్ తో జట్టు కట్టారు. దీంతో కేసీఆర్ ఒంటరిగా మిగిలిపోయినట్లయింది.
✍️ 2018 లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా క్రాస్ రోడ్స్ లో నిలబడి ఎదురు చూస్తున్నారు. ఆయన ఎన్.డి.ఎ. కూటమి నుంచి పిలుపు వస్తుందని ఆశించారు కాని అది జరగలేదు. కాకపోతే ఆయన దత్తపుత్రుడుగా పేరుపడ్డ పవన్ కల్యాణ్ ఆ కూటమిలో ఉండడం ద్వారా తన వాయిస్ ను బీజేపీకి చేరవేసే అవకాశం కల్పించుకున్నట్లయింది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎఎస్ ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ ఏ కూటమిలో లేదు కనుక ఆ చర్చే రాదు. అలాగే ఒడిషాలో బిజు జనతాదళ్ కూడా స్వతంత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల తర్వాత జాతీయ కూటములు రెండిటిలో దేనికి మెజార్టీ రాకపోతే వైఎస్సార్‌సీపీ, బీజేడీ, బీఆర్ఎస్ వంటి పార్టీలకు ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంటుంది.
✍️ 2019 నాటికన్నా విపక్షాలు ఈసారి ఒక స్పష్టతతో ముందుకు వచ్చినట్లు కనిపిస్తుంది. అయినా ఆయా పార్టీల మధ్య పరస్పర వైరుధ్యాలు లేకపోలేదు. పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు సీపీఎం, కాంగ్రెస్ లు ప్రత్యర్ధి పార్టీలుగా ఉన్నాయి. కాకపోతే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడడంతో వాతావరణం మారింది. వచ్చే ఎన్నికలలో కనుక కాంగ్రెస్, సీపీఎంలు టీఎంసీతో రాజీపడి సీట్ల సర్దుబాటు చేసుకోగలిగితే బిజెపికి ఇప్పుడు ఉన్న లోక్ సభ సీట్లు రావడం కష్టం కావచ్చు.
✍️ బీహారులో రెండు చిన్న పార్టీలను బీజేపీ చేర్చుకున్నా, జేడీయూ, ఆర్జేడీ ,కాంగ్రెస్ కూటమి అత్యధిక సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. డిల్లీ, పంజాబ్ లలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు సర్దుబాటు చేసుకోగలుగుతాయా?అనే సందేహం ఉన్నా.. కలిస్తే మాత్రం బీజేపీకి కొంత సమస్య ఎదురుకావచ్చు. గతసారి కర్నాటకలో జెడిఎస్ ,కాంగ్రెస్ ల ప్రభుత్వం ఉన్నా.. లోక్ సభ ఎన్నికలలో మోడీ హవా బాగా పనిచేసింది. అది అలాగే ఉండాలంటే జెడిఎస్ తో బిజెపి కూటమి కట్టాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి రావడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం. ఇలా.. వెస్ట్ బెంగాల్, కర్నాటక, తమిళనాడు, పంజాబ్, డిల్లీ జార్కండ్, బీహార్ ,కేరళ, రాజస్తాన్ ,చత్తీస్ గడ్ వంటి విపక్ష పాలిత రాష్ట్రాలలో ఇండియా కూటమి పుంజుకుంటే బిజెపికి దానిని అధిగమించడం పెద్ద సవాలు కావచ్చు.
✍️ కాకపోతే ఈ కూటమి పార్టీలలో ఉండే అంతర్గత వైరుధ్యాలను క్యాష్ చేసుకోవడానికి బిజెపి ప్రయత్నించక మానదు. ఎన్నికల ముందు ఏదైనా సరికొత్త సెంటిమెంట్ ను ముందుకు తీసుకు వస్తుందా? అనే చర్చా నడుస్తోంది కూడా. ప్రత్యేకించి యూనిఫాం సివిల్ కోడ్ ద్వారా మతపరంగా ఓట్ల పోలరైజేషన్ కు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. తెలుగుదేశం, అకాలీదళ్ వంటి పార్టీలను ఎన్.డి.ఎ.లో కలుపుకుంటారా?లేదా? అన్నది అప్పుడే చెప్పలేం. మహారాష్ట్రలో శరద్ పవార్ లేని ఎన్.సిపి అజిత్ పవార్ చీలికవర్గం, ఉద్దావ్ ఠాక్రే లేని శివసేన చీలికవర్గం ఎంతవరకు ప్రజలను ప్రభావితం చేస్తాయన్న సందేహాలు ఉన్నాయి. యూపీ, మధ్యప్రదేశ్, వంటి రాష్ట్రాలు బిజెపికి కీలకంగా మారతాయి. అందుకే.. ఇండియా కూటమికి విజయావకాశాలు ఉన్నాయన్న సంకేతాలు ప్రజలలోకి వెళితే తమకు నష్టం జరుగుతుందని భావించే బిజపి హడావుడిగా పోటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తమకు అంతకన్నా ఎక్కువ పార్టీల మద్దతు ఉందని చూపించుకునే యత్నం చేసింది.
కాంగ్రెస్ నిజంగానే ప్రధాని పదవిని వదలుకుంటే నితీష్ కుమార్ లేదా మమత బెనర్జీ వంటివారు ప్రదాని పదవి రేసులోకి వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూటమి ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోబోతోంది. బిజెపికి ఇంతకాలం డివైడెడ్ అప్పోజిషన్ కలిసి వచ్చింది. ఈసారి అలాకాకుండా ప్రతిపక్షం అంతా ఒకటైతే మాత్రం పలు రాష్ట్రాలలో గట్టి పోటీనే ఎదుర్కొనాల్సి రావచ్చు.
✍️ ఇప్పటికి బీజేపీదే అధికారం అనే భావన ఉన్నప్పటికీ.. వచ్చే కొద్ది నెలల్లో జరిగే పరిణామాలను బట్టి ప్రజాభిప్రాయంలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని విపక్ష కూటమి బలపడడానికి ముందే మోదీ ప్రభుత్వం జనవరి నాటికే లోక్ సభ ఎన్నికలకు వెళుతుందా? అన్న సంశయం కూడా కొన్ని వర్గాలలో ఉంది. 2004లో ఎన్డీయే, యూపీఏకి మద్య ఎలాంటి పోటీ జరిగిందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో దేశంలో పోటీ ఉండవచ్చు. కాకపోతే అప్పటి బిజెపి ప్రదాని వాజ్ పేయి సాప్ట్ కాగా, ప్రస్తుత ప్రదాని మోడీ హార్డ్ . ఆ రోజులలో యూపీఏ గెలిచినంత ఈజీగా ఇప్పుడు ఇండియా కూటమి గెలుస్తుందని చెప్పలేం. కానీ, ఐక్యమత్యంగా పోటీచేస్తే మాత్రం ఎన్డీయే తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పదన్న భావన కలుగుతోంది.
::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment