రన్ వేపై రెక్కల ముక్కలు | DGCA instructions for protecting wild animals | Sakshi
Sakshi News home page

రన్ వేపై రెక్కల ముక్కలు

Published Wed, Apr 30 2025 4:52 AM | Last Updated on Wed, Apr 30 2025 4:52 AM

లోహ విహంగాలను ఢీకొడుతున్న పక్షులు

వన్యప్రాణులతోనూ ప్రమాదాల ముప్పు.. 

టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లోనే ఎక్కువ 

20182023 మధ్య ఢిల్లీ రన్‌వేపైనే 700 ఘటనలు..  

మూగ జీవాల రక్షణకు డీజీసీఏ సూచనలు

భారత విమానాశ్రయాలు చాలావరకు భద్రమైనవి. అయితే ఆ భద్రతకు ఊహించని విధంగా పక్షులు, ఇతర వన్యప్రాణుల మూలంగా తరచూ ముప్పు వాటిల్లుతోంది. పక్షులు ఢీకొనటం; జింకలు, నక్కలు, కుక్కలు వంటి జంతువులు తగలటం వల్ల రన్ వే పైన విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాదు, గత అక్టోబర్‌లో భువనేశ్వర్‌ విమానాశ్రయం సమీపంలో అడవి పిల్లి సంచరిస్తూ కనిపించటం, ఈ ఏడాది మార్చిలో డయ్యూ ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణంలో సింహం ప్రత్యక్షమవటం భవిష్యత్తులో జరగనున్న విమాన ప్రమాదాలకు సంకేతంగా గుర్తించి, అధికారులు అప్రమత్తం అవుతున్నారు. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

అడ్డొచ్చి తగులుతుంటాయి :..  ఏప్రిల్‌ 14న హిసార్‌–అయోధ్యల మధ్య విమానాన్ని ప్రారంభించటానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ముందు హర్యానాలోని మహారాజా అగ్రసేన్‌ విమానాశ్రయం అధికారులు డెహ్రాడూన్‌లోని ‘వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’నుంచి నిపుణులను రప్పించి మరీ ఆ దరిదాపుల్లోకి ‘నీల్‌గై’భారీ జింకలు రాకుండా చూసుకున్నారు. అగ్రసేన్‌ ఎయిర్‌పోర్ట్‌ ఉన్న ప్రదేశం చాలాకాలంగా నీల్‌గైలకు నివాసంగా ఉంటోంది! 

ఇక కోల్‌కతాలోని రన్‌వేల మీద ఇటీవల నక్కలు పరుగులు తీశాయి. సంతతి కోసం విమానాశ్రయంలో అవి తవ్వుకున్న బొరియల్ని సైతం అధికారులు గుర్తించారు. వాటిని పట్టుకునేందుకు ప్రాంగణంలో రహస్యంగా ముపై్పకి పైగా బోన్లు ఏర్పాటు చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రన్‌వేలపై విమానాలు టేకాఫ్‌ అవుతున్నప్పుడు లేదా ల్యాండ్‌ అవుతున్నప్పుడు పక్షులు, వన్యప్రాణులు వచ్చి తగిలే అవకాశం ఉండటంపై అధికారులూ, ప్రయాణికులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఇటీవలే అతి పెద్ద ప్రమాదం!
రన్‌వేపై పక్షులు ఢీకొనడం, జంతువులు వచ్చి వేగంగా వెళ్తున్న విమానానికి తగలటం చాలాసార్లు ప్రాణాంతకం కాకపోయినా కొన్నిసార్లు ఘోర ప్రమాదానికి కారణం అవుతుంటాయి. ఇందుకు ఉదాహరణ.. ఇటీవల పక్షి ఢీకొని దక్షిణ కొరియాలో సంభవించిన జెజు ఎయిర్‌ క్రాష్‌లో విమానంలోని 179 మందీ మరణించటం! (దీనిపై ఇంకా విచారణ సాగుతోంది). భారత్‌లో చివరిసారిగా 2015లో ఇలాంటి ప్రమాదం జరిగింది. కత్రా నుండి వైష్ణోదేవి ఆలయానికి వెళుతున్న హెలికాప్టర్‌.. రాబందు ఢీకొనటంతో పల్టీలు కొట్టి, మంటలు చెలరేగి పైలట్‌తో సహా ఏడుగురు చనిపోయారు.  

ఢిల్లీ రన్‌వేపై 700సార్లు!
పక్షులు ఢీకొన్న సంఘటనల్లో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానంలో ఉంది. 2018–2023 మధ్య ఆ రన్‌వేలపై 700 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు... జంతు సంక్షేమ కార్యకర్త గౌరీ మౌలేఖి దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌’, ‘ఎయిర్‌పోర్ట్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా’సంస్థలకు నోటీసులు జారీ చేసింది. విమానా శ్రయం పరిసరాల్లో కబేళాలు, మాంసం దుకాణాలు, పాడి పరిశ్రమలు ఉండటం విమానయాన భద్రతా నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని మౌలేఖీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

39 ఫ్లెమింగోల మృత్యువాత.. 
2023 డిసెంబర్‌ 18న రాజ్యసభలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం... భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు వన్యప్రాణులు, ప్రధానంగా పక్షుల బెడదతో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని తెలుస్తోంది. గత ఏడాది ఎమిరేట్స్‌ విమానం ముంబైలో ఫ్లెమింగోల గుంపును ఢీకొట్టడంతో 39 పక్షులు చనిపోయాయి. ఈ ఘటన వన్యప్రాణుల ప్రేమికులను ఎంతగానో కలవరపరిచింది.

పక్షులు తగిలితే ఎందుకు కూలిపోతాయి? 
నిజానికి పక్షుల తగిలినంత మాత్రానే విమానాలు కూలిపోవు. కొన్ని సందర్భాలలో ఇంజిన్‌ లేదా ఇతర భాగాలకు నష్టం వాటిల్లుతుంది. విమానాలు చాలా వేగంగా టేకాఫ్‌ అవుతాయి. పక్షులు, ముఖ్యంగా పెద్ద పక్షులు; ఇంజిన్‌ లేదా విండ్‌షీల్డ్‌లోకి ప్రవేశించే పక్షి సమూహాలు ఢీకొనడం వల్ల మాత్రం పెద్ద ముప్పే వాటిల్లవచ్చు. టేకాఫ్‌ దశలో ఇంజిన్‌ చాలా వేగంతో తిరుగుతున్నప్పుడు, విమానం తక్కువ ఎత్తులో ఉండగానే పక్షి ఢీకొన్నప్పుడు ఇంజిన్‌ ఫ్యాన్‌ బ్లేడ్‌లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో ఇంజిన్‌ విఫలమై ప్రమాదం సంభవించవచ్చు. పక్షి ఢీకొట్టగానే పైలట్‌ దృష్టి చెదిరి ప్రమాదాలు జరుగుతుంటాయి.  

పక్షులను చెదరగొట్టే మార్గాలు 
ప్రమాదాలు జరిగి అటు వన్యప్రాణులు, పక్షులు గానీ, ఇటు విమానాలు, ప్రయాణికులు గానీ నష్టపోకుండా / ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్షంగా చేపట్టాల్సినవి, అప్రమత్తం చేసే ధ్వని పరికరాలు, రాప్టర్‌ కైట్స్, బెలూన్లు, రిఫ్లెక్టింగ్‌ టేప్‌ వంటివి వాడాలి. 

ఇక పరోక్షంగా.. నీటి వనరుల మూసివేత, వ్యర్థాల తొలగింపు, పచ్చిక ఉన్న ప్రదేశాలలో చీడపురుగుల ఏరివేత, గూళ్లు పెట్టకుండా గడ్డిని కత్తిరించడం, ఎలుకల నియంత్రణ వంటివి చేపట్టాలని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ యావియేషన్‌ సూచించింది. అంతిమంగా మనమంతా.. పక్షులు మన స్థలంలోకి రావటం లేదు, వాటి స్థలంలోకే మనం వెళ్లి అభివృద్ధి పేరిట అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అని గుర్తించి వన్యప్రాణి హితమైన చర్యలు మాత్రమే తీసుకోవాలి.  

అన్ని పక్షులూ ముప్పుకాదు.. 
1966–1989 మధ్య కాలంలో తీవ్రమైన విమాన నష్టానికి కారణమైన పక్షుల జాబితాలో రాబందులు ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేవి. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో వాటి వల్ల ముప్పు తగ్గుముఖం పట్టింది. నేడు ప్రధానంగా బ్లాక్‌ కైట్స్‌ (డేగ జాతి), గబ్బిలాలు, ల్యాప్‌విగ్‌ పక్షులు ప్రమాదం కలిగించే జాబితాలోకి చేరాయి. 2020 జూన్‌లో ‘డిఫెన్స్‌ లైఫ్‌’సైన్స్‌ జర్నల్‌ లో ‘భారతదేశంలో విమానాలకు వన్యప్రాణుల తాకిడి’అనే శీర్షికతో ప్రచురితమైన అధ్యయన పత్రం ప్రకారం.. ఈ మూడు జాతుల పక్షులే ఇప్పుడు ప్రధానంగా రన్‌వేపై విమాన ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. 

2012–2018 మధ్య భారతదేశంలో 3,665 వన్యప్రాణు తాకిళ్లు సంభవించినట్లు ఈ పత్రం పేర్కొంది. వీటిల్లో 385 ఘటనలు విమాన నష్టానికి కారణం అయ్యాయి. 2005–2018 మధ్య మూడు సైనిక విమానాలు కూలిపోవటానికి బ్లాక్‌ కైట్స్‌ పక్షులు కారణమయ్యాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement