
శని, ఆదివారాల్లో పెరిగిన రద్దీ
సురక్షితమేనంటున్న పర్యాటకులు
కశ్మీర్ నెత్తుటి మరకలను తుడుచుకుంది. పాశవిక దాడి తాలూకు చేదు అనుభవం నుంచి చూస్తుండగానే తేరుకుంది. పర్యాటకులను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటోంది. దాడి నేపథ్యంలో భయాందోళనలతో లోయను వీడిన టూరిస్టులు ఇప్పుడు అక్కడికి తిరిగి వెళ్తున్నారు. ఉగ్ర దాడుల ఆందోళనలు పూర్తిగా తొలగకపోయినా దేశమంతా ఏకమై ఉందని చెప్పడానికి కశ్మీర్‌ను సందర్శిస్తున్నారు. శని, ఆదివారాల్లో కోల్‌కతా, బెంగళూరు సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రయాణికులు కశ్మీర్ చేరుకున్నారు.
‘‘కశ్మీర్ ఇప్పుడు సురక్షితంగా ఉంది, షాపులు, సందర్శన స్థలాలు అన్నీ తెరిచే ఉన్నాయి’’ అని వారు స్వయంగా చెబుతున్నారు. ‘‘లోయ మళ్లీ పర్యటాకులతో కళకళలాడుతోంది. కశ్మీర్ పర్యటనకు రండి’ అని స్థానిక టూర్ ఆపరేటర్లతో పాటు ప్రభుత్వం కూడా పిలుపునిస్తోంది. ప్రఖ్యాత దాల్ సరస్సు ఆదివారం ఉదయం మళ్లీ సందడిగా మారింది. పర్యాటకులు షికారాల్లో విహరాన్ని, స్థానిక ఆతిథ్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నారు. కశ్మీరీల ఆతిథ్యం గొప్పగా ఉందంటూ కొనియాడుతున్నారు. ఉగ్ర దాడితో పర్యాటకం దెబ్బతినకుండా చూసుకుందామంటూ పిలుపునిస్తున్నారు.
‘ఛలో కశ్మీర్’ నటుడు అతుల్ కులకర్ణి
కశ్మీర్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు బాలీవుడ్ నటుడు అతుల్ కులకర్ణి ముందుకొచ్చారు. ‘చలో కశ్మీర్’ అంటూ ఆయన ఆదివారం ఉదయం పహల్గాం చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘కశ్మీర్ పర్యటన ప్రణాళికలను రద్దు చేసుకుంటే ఉగ్రవాదులు అనుకున్నది నెరవేరుతుంది. అది జరగకూడదు. పర్యాటకులు కశ్మీర్‌కు రావాలి’’ అని ఎక్స్‌లో పిలుపునిచ్చారు. ‘చలో కశ్మీర్’, ‘టెర్రరిజాన్ని ఓడించండి’, ‘ఫీట్స్ ఇన్ కశ్మీర్’ అంటూ హ్యాష్‌టాగ్‌లు జోడించారు. ఉగ్రవాదాన్ని ఓడించాలనే సందేశంతో కశ్మీర్లో రెండు రోజుల పాటు పర్యటిస్తానని కులకర్ణి చెప్పారు.
ఇలాంటి కార్యకలాపాలు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు పరస్పరం అర్థం చేసుకోవడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. కశ్మీరీ జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్న తమిళనాడుకు చెందిన పర్యాటకుల బృందాన్ని పహల్గాంలో చూశానని, ఇలాంటి సంభాషణలు ప్రజల సన్నిహిత బంధాలను పెంపొందించడానికి, ఐక్యత, కరుణ సందేశాన్ని పంపడానికి కూడా సహాయపడతాయని ఆయన అన్నారు. పహల్గాంలోని బైసారన్ లోయలో మంగళవారం ఉగ్ర దాడి జరిగిన వెంటనే కశ్మీర్‌లోని హోటళ్లు, హౌస్ బోట్ల టూరిస్ట్ బుకింగ్స్‌లో 80 శాతం వరకు రద్దవడం తెలిసిందే. వేలాది మంది పర్యాటకులు కశ్మీర్‌లో పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని ప్రత్యేక విమానాలు, రైళ్లలో స్వస్థలాలకు చేరుకున్నారు.
ఉగ్ర లక్ష్యం నెరవేర నీయొద్దు
‘‘దుర్గా పూజ తర్వాత కశ్మీర్ పర్యటనకు బుకింగ్స్ చేసుకున్నాం. దాడితో షాకయ్యాం. కానీ స్థానికులతో మాట్లాడాక వెళ్లొచ్చని నిర్ధారించుకున్నాం. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో కశ్మీర్‌ను కచ్చితంగా పర్యటించాలనే వచ్చాం. భయపడి ఆగిపోతే ఉగ్రవాదుల లక్ష్యాన్ని నెరవేర్చిన వాళ్లమవుతాం అనిపించింది. అందుకే వచ్చాం’ అని కోల్‌కతా నుంచి వచ్చిన ఓ యువతి తెలిపారు. ‘‘ఇప్పుడు కశ్మీర్ సురక్షితంగా ఉంది. గుల్మార్గ్, సోన్‌మార్గ్, తరువాత పహల్గాం కూడా వెళ్లాలనుకుంటున్నాం. కశ్మీర్ భారత్‌లో భాగం. మనం కశ్మీర్ సందర్శించడం స్థానికులకు సాయం చేసినట్టవుతుంది. ఈ విషాద సమయాల్లో మనమంతా ఒక్కటని చాటాల్సిన అవసరముంది’’ అని మరో యువకుడు నొక్కి చెప్పారు. ‘‘మేం దాడి తర్వాతే వచ్చాం. ఇప్పుడిక్కడ అంతా సాధారణంగానే ఉంది. చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేశాం’ అని బెంగళూరుకు చెందిన దంపతులు చెప్పారు.
– సాక్షి, నేషనల్ డెస్క్