కశ్మీర్ అనే పేరు వినగానే మన కళ్ల ముందు ఒక అందమైన ప్రదేశం కదలాడుతుంటుంది. అయితే ఇంతలోనే అక్కడ ఉగ్రవాదం నీడలు ఉన్నాయన్న వాస్తవం కూడా కళ్లముందుంటుంది. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులపై ఆర్మీ సిబ్బంది చేపడుతున్న చర్యలు తీవ్రవాదాన్ని అణచివేస్తున్నాయి. ఈ నేపధ్యంలో నెలకొన్న శాంతియుత పరిస్థితుల్లో కశ్మీర్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.
ఈ ఏడాది(2023) దాదాపు రెండు కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది లోయలో మెరుగైన భద్రతా పరిస్థితికి తార్కాణంగా నిలిచిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు భద్రతా సంస్థలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయన్నారు. కథువా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ కశ్మీర్‌లో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని అనడం సరైనదికాదన్నారు.
ఇదిలా ఉండగా గురువారం పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దీని గురించి విలేకరులు.. జితేంద్ర సింగ్‌ను అడిగినప్పుడు అలాంటి సంఘటనలను మరువలేమని, సంబంధిత ఏజెన్సీలు వాటిని ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. కాగా పర్యాటకులు తమకు కశ్మీర్‌లో తగిన భద్రత ఉందని భావించినందునే భారీ సంఖ్యలో ఇక్కడికి తరలివస్తున్నారని జితేంద్ర సింగ్ తెలియజేశారు.
ఇది కూడా చదవండి: మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ!
Comments
Please login to add a commentAdd a comment