ఆంగ్లేయుల దోపిడీని ఎదురించి ఆదివాసులు స్వాతంత్య్ర పోరాటానికి పునాదులు వేశారు. కానీ కనీస హక్కులు లేకుండా ఇప్పటికీ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన వారిలో 55 శాతం దాకా ఆదివాసులేనని గణాంకాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తూఈ అభివృద్ధి ఫలాలలో ఆదివాసుల వాటా తక్కువ. సాధారణంగా అభివృద్ధికి మరో పార్శ్వం కూడా ఉంటుంది.
కానీ తమ అటవీ ఉత్పత్తులతో విధ్వంస కోణానికి తావులేని అభివృద్ధిని అడవి బిడ్డలు అందించగలరు. వారికి కావలసిందల్లా తగిన శిక్షణ, ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు మాత్రమే. సుస్థిరాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసినప్పుడే, తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి సమాజం తరఫున ప్రాయశ్చిత్తం చేసినట్లవుతుంది.
వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతిలో ఆదివాసులది కీలకమైన భూమిక. ప్రకృతిని దైవంగా భావించే ఆదివాసులు, ఆంగ్లేయుల దోపిడీని ఆది నుంచీ ఎదురించి స్వాతంత్య్ర పోరాటానికి పునాదులు వేశారు. భారతదేశంలోని అపారమైన సహజ సంపదపై కన్ను వేసిన బ్రిటిష్ పాలకులు 1865లో అటవీ చట్టాన్ని తీసుకువచ్చారు. 1927లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ పేరుతో మరో చట్టం చేశారు.
అడవుల పరిరక్షణ ముసుగులో సహజ వనరులను దోచుకునేందుకు ఉద్దేశించిన ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఆదివాసులు అనేక పర్యాయాలు తిరుగు బాటు చేసి మరింత అణచివేతకు గురయ్యారు. కానీ, తమ నిరంతర తిరుగుబాటు ద్వారా స్వాతంత్య్ర పోరాటానికి జీవం పోశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాల చొరవ వల్లనో, ప్రజల పోరాటాల వల్లనో వలస పాలన దుష్పరిణామాల నుంచి బయట పడగలిగాము.
అయితే, ప్రధాన స్రవంతికి దూరంగా అడవుల్లో నివసిస్తున్న ఆదివాసులు ఇప్పటికీ వివక్షకు, ఉదాసీనతకు గురవుతూనే ఉన్నారు. తరతరాలుగా తాము కాపాడుకుంటున్న అడవులలో కనీస హక్కులు లేకుండా మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం దేశంలో అడవుల హద్దులను గుర్తించారు, కానీ అడవి బిడ్డల హక్కులను విస్మరించారు. అభివృద్ధి కూడా ఆదివాసుల పాలిటశాపంగా పరిణమించింది. దేశ జనాభాలో వారు సుమారు 8 శాతం ఉంటారు. అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన వారిలో 55 శాతం దాకా ఆదివాసులేనని గణాంకాలు తెలుపుతున్నాయి. దురదృష్టవ శాత్తూ ఈ అభివృద్ధి ఫలాలలో ఆదివాసుల వాటా అతి తక్కువ.
అటవీ చట్టాలు అమలు చేయాలి!
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాల దాకా ఆదివాసు లను ప్రధాన స్రవంతిలో కలిపేందుకు పెద్దగా ప్రయత్నాలు జరగ లేదు. 1996లో వచ్చిన పెసా(పీఈఎస్‌ఏ– షెడ్యూల్డ్ ప్రాంతాలకుపంచాయతీల విస్తరణ) చట్టం, 2006 నాటి అటవీ హక్కుల చట్టం (ఫారెస్ట్ రైట్స్ యాక్ట్) ఆదివాసులకు జరుగుతూ వచ్చిన అన్యాయాల పరిష్కారం దిశగా మైలురాళ్లుగా చెప్పుకోవచ్చు.
పెసా చట్టం అడవి బిడ్డల సంప్రదాయిక వనరుల నిర్వహణ విధానాలను ఆమోదిస్తూ, వారి స్వయం పాలనకు వీలు కల్పించేందుకు తీసుకువచ్చారు. ఎఫ్‌ఆర్‌ఏ చట్టం ఇంకొక అడుగు ముందుకు వేసి చారిత్రకంగా ఆది వాసులకు అటవీ హక్కుల విషయంలో జరిగిన అన్యాయాలకుముందుమాటలో క్షమాపణ చెప్పింది. ఉద్దేశాలు ఉన్నతంగా ఉన్న ప్పటికీ ఈ చట్టాల అమలు సంతృప్తికరంగా లేదు. పాలనా యంత్రాంగంలోని కొన్ని వర్గాల వ్యతిరేకత, రాష్ట్ర చట్టాలతో సరైన అనుసంధానం లేకపోవడం వల్ల ఈ చట్టాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు.
పెసా, ఎఫ్‌ఆర్‌ఏ చట్టాల అమలు విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర కాస్త మెరుగైన స్థానంలో ఉంది. చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు తీసుకున్న చొరవ వల్ల ఇది సాధ్యమయింది. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులలో ఐదు శాతం నేరుగా గ్రామ పంచాయతీలకు, గ్రామసభలకు అందించాలని ఆయన నిర్దేశించడం వల్ల షెడ్యూల్డ్ ప్రాంతాలలోని ఆదివాసీ పల్లెల సాధికా రీకరణకు మార్గం సుగమమైంది. వెదురు, బీడీ ఆకుల వంటి చిన్న చిన్న అటవీ ఉత్పత్తులపై గ్రామ సభలకు హక్కులు పునరుద్ధరించారు. తద్వారా అడవులను నమ్ముకున్న స్థానికులకు ఆదాయం పొందే అవకాశం కల్పించారు.
గిరిజన గ్రామసభలు అటవీ ఉత్పత్తుల విక్రయం ద్వారా నెలకు 10 నుంచి 80 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాయి. ఆదాయం పొందే అవకాశం కల్పించడం వల్ల ఆదివాసులు అడవుల పరిరక్షణతో పాటు పెంపకం కూడా చేపట్టి ప్రకృతితో తమకున్న అవినాభావ సంబంధాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. దీంతో పెసా, ఎఫ్‌ఆర్‌ఏ చట్టాల వల్ల అడవులు నాశనమవుతాయని కొన్ని వర్గాలు చేసిన ప్రచారంలోని డొల్లతనం కూడా బయటపడింది.
పెసా చట్టం అమలులో గడ్చిరోలి జిల్లా దేశంలోనే ముందంజలో ఉండి మార్గదర్శకంగా నిలిచింది. మహారాష్ట్రలో విద్యాసాగర్ రావు చొరవతో 20 లక్షల ఎకరాల అటవీ భూమి నిర్వహణ బాధ్యతను స్థానిక ఆదివాసీ గ్రామసభలకు అప్పగించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ అనుభవాలను పాఠాలుగా తీసుకొని సుస్థిరాభివృద్ధిలో ఆదివాసులను భాగస్వాములను చేయాలి.
పర్యావరణ హిత ఉపాధి అవకాశాలు
సాధారణంగా అభివృద్ధికి మరో పార్శ్వం కూడా ఉంటుంది. పరిశ్రమలు ఉపాధికి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నప్పటికీ వాటినుంచి వెలువడే వ్యర్థాల వల్ల గాలీ, నీరూ కలుషితమై రకరకాల రోగాలు ప్రబలుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి విధ్వంస కోణా నికి తావులేని అభివృద్ధిని అడవి బిడ్డలు అందిస్తారు. వారికి కావలసిందల్లా తగిన శిక్షణ, ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు మాత్రమే. అడవిలో లభ్యమయ్యే పలు వనరులను ప్రపంచానికి అవసరమయ్యే ఉత్పత్తులుగా మలిస్తే పర్యావరణానికి ఏ మాత్రం ముప్పు లేకుండా ఆదివాసులకు ఉపాధి లభిస్తుంది, దేశ ఆర్థికాభివృద్ధిలో వారు భాగస్వాములవుతారు.
అడవులలో విస్తృతంగా లభించే వెదురు ద్వారా ప్రపంచానికి అవసరమయ్యే అనేక ఉత్పత్తులను తయారు చేయవచ్చు. గృహోపకర ణాల నుంచి దుస్తుల దాకా సంగీత పరికరాల నుంచి ఔషధాల దాకా రకరకాల అవసరాలకు వెదురును ఉపయోగిస్తున్నారు. అటవీ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థలు ముందుకు వచ్చి ఆదివాసులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రోత్స హించాలి. మహారాష్ట్రలో ఒక విశ్వవిద్యాలయం, మరో స్వచ్ఛందసంస్థ కలిసి ఆదివాసులకు వెదురు నుంచి రాఖీలు తయారు చేయడంలో శిక్షణ ఇచ్చాయి.
మిగతా రాష్ట్రాలలో కూడా స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకొని ఆదివాసులకు ఆసరాగా నిలవాలి. సేంద్రీయ ఉత్ప త్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అడవిలో లభించే వనరుల ద్వారా సబ్బులు, షాంపూలు, సుగంధ ద్రవ్యాలు తయారు చేయవచ్చు. వీటికి ఎక్కువ ధర చెల్లించడానికి కూడా వినియోగ దారులు వెనకాడటం లేదు. కాబట్టి స్టార్టప్ కంపెనీలు కూడా అటవీ ఉత్పత్తులపై దృష్టి సారించాలి.
ఆదివాసులకు ఆత్మగౌరవం ఎక్కువ. అవసరమైతే ఉపవాసమైనా ఉంటారు కానీ ఇంకొకరి ముందు చేయి చాచడానికి ఇష్టపడరు. అటువంటి వారికి ఆసరాగా నిలబడి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతనిస్తే తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి సమాజం తరఫున ప్రాయశ్చిత్తం చేసినట్లవుతుంది. అంతే కాకుండా వేల ఏళ్లుగా ప్రతిఫలాపేక్ష లేకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ వస్తున్న అడవిబిడ్డల రుణం తీర్చుకున్నట్లవుతుంది.
- వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్‌మొబైల్ : pvg@ekalavya.net
- పి. వేణుగోపాల్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment