pesa act
-
ఆదివాసులకు చేయూతనిద్దాం!
ఆంగ్లేయుల దోపిడీని ఎదురించి ఆదివాసులు స్వాతంత్య్ర పోరాటానికి పునాదులు వేశారు. కానీ కనీస హక్కులు లేకుండా ఇప్పటికీ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన వారిలో 55 శాతం దాకా ఆదివాసులేనని గణాంకాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తూఈ అభివృద్ధి ఫలాలలో ఆదివాసుల వాటా తక్కువ. సాధారణంగా అభివృద్ధికి మరో పార్శ్వం కూడా ఉంటుంది. కానీ తమ అటవీ ఉత్పత్తులతో విధ్వంస కోణానికి తావులేని అభివృద్ధిని అడవి బిడ్డలు అందించగలరు. వారికి కావలసిందల్లా తగిన శిక్షణ, ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు మాత్రమే. సుస్థిరాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసినప్పుడే, తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి సమాజం తరఫున ప్రాయశ్చిత్తం చేసినట్లవుతుంది.వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతిలో ఆదివాసులది కీలకమైన భూమిక. ప్రకృతిని దైవంగా భావించే ఆదివాసులు, ఆంగ్లేయుల దోపిడీని ఆది నుంచీ ఎదురించి స్వాతంత్య్ర పోరాటానికి పునాదులు వేశారు. భారతదేశంలోని అపారమైన సహజ సంపదపై కన్ను వేసిన బ్రిటిష్ పాలకులు 1865లో అటవీ చట్టాన్ని తీసుకువచ్చారు. 1927లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ పేరుతో మరో చట్టం చేశారు.అడవుల పరిరక్షణ ముసుగులో సహజ వనరులను దోచుకునేందుకు ఉద్దేశించిన ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఆదివాసులు అనేక పర్యాయాలు తిరుగు బాటు చేసి మరింత అణచివేతకు గురయ్యారు. కానీ, తమ నిరంతర తిరుగుబాటు ద్వారా స్వాతంత్య్ర పోరాటానికి జీవం పోశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాల చొరవ వల్లనో, ప్రజల పోరాటాల వల్లనో వలస పాలన దుష్పరిణామాల నుంచి బయట పడగలిగాము. అయితే, ప్రధాన స్రవంతికి దూరంగా అడవుల్లో నివసిస్తున్న ఆదివాసులు ఇప్పటికీ వివక్షకు, ఉదాసీనతకు గురవుతూనే ఉన్నారు. తరతరాలుగా తాము కాపాడుకుంటున్న అడవులలో కనీస హక్కులు లేకుండా మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం దేశంలో అడవుల హద్దులను గుర్తించారు, కానీ అడవి బిడ్డల హక్కులను విస్మరించారు. అభివృద్ధి కూడా ఆదివాసుల పాలిటశాపంగా పరిణమించింది. దేశ జనాభాలో వారు సుమారు 8 శాతం ఉంటారు. అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన వారిలో 55 శాతం దాకా ఆదివాసులేనని గణాంకాలు తెలుపుతున్నాయి. దురదృష్టవ శాత్తూ ఈ అభివృద్ధి ఫలాలలో ఆదివాసుల వాటా అతి తక్కువ. అటవీ చట్టాలు అమలు చేయాలి!స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాల దాకా ఆదివాసు లను ప్రధాన స్రవంతిలో కలిపేందుకు పెద్దగా ప్రయత్నాలు జరగ లేదు. 1996లో వచ్చిన పెసా(పీఈఎస్ఏ– షెడ్యూల్డ్ ప్రాంతాలకుపంచాయతీల విస్తరణ) చట్టం, 2006 నాటి అటవీ హక్కుల చట్టం (ఫారెస్ట్ రైట్స్ యాక్ట్) ఆదివాసులకు జరుగుతూ వచ్చిన అన్యాయాల పరిష్కారం దిశగా మైలురాళ్లుగా చెప్పుకోవచ్చు. పెసా చట్టం అడవి బిడ్డల సంప్రదాయిక వనరుల నిర్వహణ విధానాలను ఆమోదిస్తూ, వారి స్వయం పాలనకు వీలు కల్పించేందుకు తీసుకువచ్చారు. ఎఫ్ఆర్ఏ చట్టం ఇంకొక అడుగు ముందుకు వేసి చారిత్రకంగా ఆది వాసులకు అటవీ హక్కుల విషయంలో జరిగిన అన్యాయాలకుముందుమాటలో క్షమాపణ చెప్పింది. ఉద్దేశాలు ఉన్నతంగా ఉన్న ప్పటికీ ఈ చట్టాల అమలు సంతృప్తికరంగా లేదు. పాలనా యంత్రాంగంలోని కొన్ని వర్గాల వ్యతిరేకత, రాష్ట్ర చట్టాలతో సరైన అనుసంధానం లేకపోవడం వల్ల ఈ చట్టాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాల అమలు విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర కాస్త మెరుగైన స్థానంలో ఉంది. చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు తీసుకున్న చొరవ వల్ల ఇది సాధ్యమయింది. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులలో ఐదు శాతం నేరుగా గ్రామ పంచాయతీలకు, గ్రామసభలకు అందించాలని ఆయన నిర్దేశించడం వల్ల షెడ్యూల్డ్ ప్రాంతాలలోని ఆదివాసీ పల్లెల సాధికా రీకరణకు మార్గం సుగమమైంది. వెదురు, బీడీ ఆకుల వంటి చిన్న చిన్న అటవీ ఉత్పత్తులపై గ్రామ సభలకు హక్కులు పునరుద్ధరించారు. తద్వారా అడవులను నమ్ముకున్న స్థానికులకు ఆదాయం పొందే అవకాశం కల్పించారు. గిరిజన గ్రామసభలు అటవీ ఉత్పత్తుల విక్రయం ద్వారా నెలకు 10 నుంచి 80 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాయి. ఆదాయం పొందే అవకాశం కల్పించడం వల్ల ఆదివాసులు అడవుల పరిరక్షణతో పాటు పెంపకం కూడా చేపట్టి ప్రకృతితో తమకున్న అవినాభావ సంబంధాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. దీంతో పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాల వల్ల అడవులు నాశనమవుతాయని కొన్ని వర్గాలు చేసిన ప్రచారంలోని డొల్లతనం కూడా బయటపడింది. పెసా చట్టం అమలులో గడ్చిరోలి జిల్లా దేశంలోనే ముందంజలో ఉండి మార్గదర్శకంగా నిలిచింది. మహారాష్ట్రలో విద్యాసాగర్ రావు చొరవతో 20 లక్షల ఎకరాల అటవీ భూమి నిర్వహణ బాధ్యతను స్థానిక ఆదివాసీ గ్రామసభలకు అప్పగించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ అనుభవాలను పాఠాలుగా తీసుకొని సుస్థిరాభివృద్ధిలో ఆదివాసులను భాగస్వాములను చేయాలి.పర్యావరణ హిత ఉపాధి అవకాశాలుసాధారణంగా అభివృద్ధికి మరో పార్శ్వం కూడా ఉంటుంది. పరిశ్రమలు ఉపాధికి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నప్పటికీ వాటినుంచి వెలువడే వ్యర్థాల వల్ల గాలీ, నీరూ కలుషితమై రకరకాల రోగాలు ప్రబలుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి విధ్వంస కోణా నికి తావులేని అభివృద్ధిని అడవి బిడ్డలు అందిస్తారు. వారికి కావలసిందల్లా తగిన శిక్షణ, ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు మాత్రమే. అడవిలో లభ్యమయ్యే పలు వనరులను ప్రపంచానికి అవసరమయ్యే ఉత్పత్తులుగా మలిస్తే పర్యావరణానికి ఏ మాత్రం ముప్పు లేకుండా ఆదివాసులకు ఉపాధి లభిస్తుంది, దేశ ఆర్థికాభివృద్ధిలో వారు భాగస్వాములవుతారు.అడవులలో విస్తృతంగా లభించే వెదురు ద్వారా ప్రపంచానికి అవసరమయ్యే అనేక ఉత్పత్తులను తయారు చేయవచ్చు. గృహోపకర ణాల నుంచి దుస్తుల దాకా సంగీత పరికరాల నుంచి ఔషధాల దాకా రకరకాల అవసరాలకు వెదురును ఉపయోగిస్తున్నారు. అటవీ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థలు ముందుకు వచ్చి ఆదివాసులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రోత్స హించాలి. మహారాష్ట్రలో ఒక విశ్వవిద్యాలయం, మరో స్వచ్ఛందసంస్థ కలిసి ఆదివాసులకు వెదురు నుంచి రాఖీలు తయారు చేయడంలో శిక్షణ ఇచ్చాయి. మిగతా రాష్ట్రాలలో కూడా స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకొని ఆదివాసులకు ఆసరాగా నిలవాలి. సేంద్రీయ ఉత్ప త్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అడవిలో లభించే వనరుల ద్వారా సబ్బులు, షాంపూలు, సుగంధ ద్రవ్యాలు తయారు చేయవచ్చు. వీటికి ఎక్కువ ధర చెల్లించడానికి కూడా వినియోగ దారులు వెనకాడటం లేదు. కాబట్టి స్టార్టప్ కంపెనీలు కూడా అటవీ ఉత్పత్తులపై దృష్టి సారించాలి.ఆదివాసులకు ఆత్మగౌరవం ఎక్కువ. అవసరమైతే ఉపవాసమైనా ఉంటారు కానీ ఇంకొకరి ముందు చేయి చాచడానికి ఇష్టపడరు. అటువంటి వారికి ఆసరాగా నిలబడి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతనిస్తే తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి సమాజం తరఫున ప్రాయశ్చిత్తం చేసినట్లవుతుంది. అంతే కాకుండా వేల ఏళ్లుగా ప్రతిఫలాపేక్ష లేకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ వస్తున్న అడవిబిడ్డల రుణం తీర్చుకున్నట్లవుతుంది.- వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్మొబైల్ : pvg@ekalavya.net - పి. వేణుగోపాల్ రెడ్డి -
పకడ్బందీగా పెసా
సాక్షి, ఆసిఫాబాద్: అడవి బిడ్డలకు స్వయం పాలన మరింత సులువు కానుంది. ఇన్నా ళ్లు షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనుల హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగింది. పెసా (పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టూ షెడ్యూల్ ఏరియా) 1996 చట్టం పకడ్బందీగా అమలు కానున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట పడే ఆస్కారముంది. ఇందుకు ప్రత్యేకంగా ఏజెన్సీ పరిధిలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మూడు జిల్లాలకు తొలిసారిగా పెసా కో ఆర్డినేటర్ల నియామకం జరుగుతోంది. ఏజెన్సీ గ్రామాల్లో గత నాలుగు రోజులుగా పెసా గ్రామసభల నిర్వహణ సాగుతోంది. మరో వారం రోజుల్లో ఏజెన్సీ పరిధిలో ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని అన్ని గిరిజన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పెసా ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోనున్నారు. పెసా గ్రామసభలు ఎంపీడీవో, డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో జరగనున్నాయి. వీరితో పాటు జిల్లాకు ఒక పెసా కో ఆర్డినేటర్‌ను కొత్తగా నియమించారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల పెసా కో ఆర్డినేటర్‌గా వెడ్మ బొజ్జు, కుమురం భీం జిల్లా కో ఆర్డినేటర్‌గా అర్క వసంతరావు నియమితులయ్యారు. వీరికి ప్రభుత్వం నుంచి నెలకు రూ.25వేల జీత భత్యాలతో పాటు వాహన, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. అలాగే పెసా సభ్యులకు నెలకు రూ.2500 గౌరవ వేతనం అందనుంది. వాస్తవానికి పెసా కో ఆర్డినేటర్ల నియామకం పీవో ఐటీడీఏ, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో 2017లోనే జరిగింది. 2018 ఏప్రిల్ నుంచి వారు విధుల్లో చేరారు. కాగా వరుస ఎన్నికలతో గ్రామాల్లో ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోలేకపోయారు. పెసా గ్రామసభ అంటే.? దేశంలోని గ్రామాలను సర్వాతోముఖాభివృద్ధి చేసేందుకు భారత పార్లమెంటు 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారానే ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలు పురుడుపోసుకున్నాయి. అయితే ఈ సవరణ కేవలం మైదాన ప్రాంతంలోని గ్రామాలకే అధికారాలు కల్పించాయి. కాని రాజ్యాంగంలో ఉన్న ఐదో షెడ్యూల్డ్‌లో పేర్కొన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. దీంతో మరోమారు గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించాలని వారి ప్రాంతాల్లో గిరిజనేతరుల జోక్యం తగ్గించాలనే ఉద్దేశంతో 1996లో పంచాయతీరాజ్ ఎక్స్టేన్షన్ టూ షెడ్యూల్ ఏరియా(పెసా) చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకొచ్చినప్పటికీ నియమనిబంధనలు మాత్రం 2011లో ఉనికిలోకి వచ్చాయి. ఆ తర్వాత ఎనిమిదేళ్ల అనంతరం ఈఏడాది నుంచి పెసా కమిటీలను పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం జిల్లాలో విస్తరించిన ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పెసా గ్రామసభలను నిర్వహించేందకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకొనున్నారు. మూడు జిల్లాల పరిధిలో.. ఆదిలాబాద్‌లో ఏజెన్సీ విస్తరించి ఉన్న 16 మండల్లాలోని 248 గ్రామ పంచాయతీల్లో 363 రెవెన్యూ గ్రామాల పరిధిలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. వీటి ద్వారా 726 ఆవాసాల నుంచి ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోనున్నారు. అలాగే మంచిర్యాలలోని ఎనిమిది మండలాల్లో విస్తరించి ఉన్న ఏజెన్సీ పరిధిలో 18 గ్రామ పంచాయతీల్లో 29 గ్రామసభల్లో 75 గిరిజన గూడాల నుంచి ఇద్దరేసి చొప్పున ఎన్నుకోనున్నారు. ఇక కుమురం భీం జిల్లాలో 13 ఏజెన్సీ మండలాల్లో 168 గ్రామ పంచాయతీల పరిధిలో 204 గ్రామసభల్లో 580 ఆవాసాలకు ఇద్దరేసి చొప్పున ఎన్నుకోనున్నారు. ఈ మూడు జిల్లాల సభ్యులకు జిల్లా స్థాయిలో కో ఆర్డినేటర్లు ఉంటారు. వీరు పెసా చట్టం అమలులో నిర్ణయాత్మకంగా ఉంటారు. ఒక్కో గ్రామసభకు ఇద్దరేసి.. ఏజెన్సీ గ్రామ పంచాయతీ సర్పంచ్ పెసా చట్టం ప్రకారం అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కొత్తగా ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవులకు ప్రస్తుతం గ్రామసభల తీర్మానం ద్వారా ఎన్నుకుంటున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం జిల్లాల నుంచి మొత్తం 37 మండలాల్లో 434 షెడ్యూల్ పంచాయతీల్లో ఈ ప్రక్రియ జరగనుంది. గ్రామంలో ఉన్న ఓటర్లు గ్రామసభలో సభ్యులుగా ఉంటారు. గ్రామసభ తప్పనిసరిగా 1/3 వంతు కోరం ఉండాలి. అప్పుడే తీర్మానాలు ఆమోదింబడతాయి. స్వయం పాలనకు పునాది.. అధికార యంత్రాంగం ఇష్టారీతిన గిరిజనుల హక్కులు కాలరాసిన సందర్భాలు అనేకం. అయితే ఇక నుంచి ఏజెన్సీ పరిధిలోని భూములు, సహజ వనరులు, అటవీ సంపదతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, వారసంతలు, అక్రమ మైనింగ్, భూగర్భ గనులు, సంఘాలు, బెల్టు, వైన్స్, వ్యాపారం, ఇతరత్ర అభివృద్ధి కార్యాక్రమాలన్ని పెసా చట్టం ప్రకారం గ్రామసభల ఆమోదం తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్ణీత వ్యవధిలో ఆ శాఖ అధికారిపై చర్యలు తీసుకుంటారు. చట్టం అమలు, గిరిజనులకు అవగాహన తదితర అంశాలను కో ఆర్డినేటర్లు పర్యవేక్షిస్తారు. సమర్థవంతంగా అమలు చేస్తాం ప్రస్తుతం అన్ని గిరిజన గ్రామాల్లో పెసా చట్టం అనుసరించి గ్రామసభల ద్వారా ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవులకు ఎన్నిక జరుగుతోంది. మరో వారం రోజుల్లో పూర్తవుతుంది. ఏజెన్సీలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా పెసా చట్టం లోబడే ఉండేలా కృషి చేస్తాం. – వెడ్మ బొజ్జు, అర్క వసంతరావు, పెసా కో ఆర్డినేటర్లు, కుమురం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలు -
పకడ్బందీగా పీసా చట్టం అమలు
సీతంపేట: పీసా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ ఆదేశించారు. సీతంపేటలో షెడ్యూల్డ్ ఏరియా పంచాయతీలకు రెండు రోజుల పాటు జరగనున్న పీసాచట్టం అవగాహన సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులపై గ్రామసభల్లో తీర్మాన చేయాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్‌షాపులు ఏర్పాటు చేయాలన్నా, ప్రభుత్వం నుంచి పథకాలు రావాల్సి ఉన్నా పీసా అనుమతి తప్పని సరిగా తీసుకుంటేనే దానికి చట్టబద్ధత ఉంటుందన్నారు. మైనింగ్, గనుల తవ్వకాలు చేపట్టాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలని చెప్పారు. సదస్సులో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో ఉరిటి రాధాకృష్ణన్, రిసోర్స్ పర్సన్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసుల హక్కులేవి?
ముంపు గ్రామాలలో ఆదివాసుల తరలింపు విషయంలో గ్రామ సభలను సంప్రదించాలని చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ఈ హక్కులను షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించే పెసా చట్టం కూడా సంప్రదింపు హక్కులను కల్పిస్తున్నది. ఏ పెద్ద ఆనకట్ట నిర్మాణాని కైనా గ్రామాలకు గ్రామాలు, అడవులు, పంట పొలాలు మునగక తప్పదు. తరలిపోవలసిన గ్రామస్తులకు నష్టాన్ని పూడ్చేంత పరిహారం ఇవ్వా ల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. ఎంత పరిహారం ఇవ్వాలనే విషయం నష్టం ఎంత అనే లెక్కపైన ఆధారపడి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కింద వందలాది గ్రామాలు, లక్షలాది మంది ఆదివాసులకు అడవులే ఆధారం. వారి బతుకు అడవిలో దొరికే ఫలాలు, ఆకులు, కొమ్మలే. పోలవరం కోసం మూలాలు వదిలి పోవలసిన ఆది వాసుల నష్టాన్ని ఎవరు ఏ విధంగా లెక్కిస్తారు? అడవి పైన వారికి లభించే హక్కుల విలువే వారికి ఇవ్వవలసిన పరిహారం. 1927లో ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన అటవీ రక్షణ చట్టం అడవుల సంపదను తరలించుకుపోవడానికే అని స్వాతంత్య్ర సమరోద్యమ కాలంలో విమర్శలు వచ్చా యి. ఒక ప్రాంతాన్ని అడవిగా ప్రకటించే అధికారం ప్రభుత్వానిదైతే ఆ అడవుల్లో ఉన్న ఆదివాసుల హక్కు లను నిర్ణయించే అధికారం ఒక అటవీశాఖాధికారికి ఈ చట్టం దఖలు పరిచింది. ఆ అమాయకులకు ఇతనే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా. ఒక్క ప్రకటనతో ఆదివా సుల హక్కులన్నీ ఉంచడమో, ఊడబీకడమో చేసే అధి కారం ఇచ్చిందీ చట్టం. ఇది భారతీయులు స్వతం త్రంగా తమ కోసం చేసుకున్న చట్టం కాదు. మన స్వతంత్ర పాలకులు మన ఆదివాసుల కోసం చేసిన తొలి చట్టం షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్ర దాయ అటవీ నివాసుల అటవీ హక్కుల చట్టం 2006. చారిత్రికంగా ఆదివాసుల పట్ల వరసగా ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను సరిదిద్దే నియమాలు ఈ చట్టం లో ఉన్నాయి. గిరిజనుల హక్కులను నిర్ణయించడంలో గ్రామసభలు భాగస్వాములవుతాయి. డిసెంబర్ 13, 2005 నాటికి అటవీ భూములను సాగుచేస్తున్నా, లేదా అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్త్తున్నా వారికి ఆ విధంగానే జీవనం కొనసాగించే హక్కును ఈ చట్టం ద్వారా ప్రకటిస్తారు. తెండు పట్టాలు, ఔషధ మొక్కల పెంపకం, వాటిని సేకరించే హక్కు, పశువు లను మేపుకునే హక్కు, చెరువులను వాడుకునే హక్కు వస్తాయి. సాగు హక్కులనీ, వినియోగ హక్కులనీ రెం డు రకాల హక్కులను గుర్తించడం వల్ల, ఆదివాసుల మీద ఆక్రమణదారులని కేసులు పెట్టి వేధించడానికి వీలుండదు. ఈ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు సాగాయి. దరఖాస్తులు స్వీకరించిన తరవాత రెండు దశలలో వాటిని వడబోసి గ్రామ పంచాయతీలో పెద్దలు కాకుం డా మొత్తం గ్రామసభ సమావేశాలలో తీర్మానాల ద్వారా హక్కులను ప్రకటిస్తారు. వీటిని తాలూకా జిల్లా స్థాయి అధికారులతో కూడిన కమిటీ నిజానిజాలను పరిశీలించి హక్కులను ధృవీకరిస్తుంది. ఈ విధంగా హక్కులను నిర్ధారించకుండా అటవీ ప్రాంత ఆదివాసు లను ప్రాజెక్టుల కోసం తరలించడానికి వీల్లేదని ఈ చట్టం చాలా స్పష్టంగా నిర్దేశించింది. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు, ప్రాం తాల అడవులలో ఉండేవారి సాగు హక్కులు వాడకం హక్కులు నిర్ధారణ జరగకుండా వారిని తరలించడానికి చట్టం అంగీకరించదు. ఎందుకంటే వారికి ఏ హక్కులు న్నాయో తెలిస్తేనే వాటిని కోల్పోయినందుకు పరిహారం చెల్లించడానికి వీలవుతుంది కనుక. ఆ విధంగా తమ హక్కులు నిర్ధారించలేదని అనేక గ్రామాల నుంచి కేంద్రానికి మహజర్లు పంపుకున్నారు. ఈ అంశాలను తెలుసుకోవడానికి కేంద్రం ఒక ఉన్నతాధికారిని పంపు తానని లేఖ రాసింది. ఆ అధికారి నివేదిక, దానిపై తీసు కున్న చర్యల వివరాలు కావాలని డి.సురేశ్ కుమార్ ఆర్టీఐ కింద అడిగారు. ముంపు గ్రామాలలో ఆదివాసుల తరలింపు విష యంలో గ్రామ సభలను సంప్రదించాలని చట్టాలు నిర్దే శిస్తున్నాయి. ఈ హక్కులను షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించే పెసా చట్టం కూడా సంప్రదింపు హక్కులను కల్పిస్తున్నది. అంతా తెలుసుకున్న తరువాత ఆదివా సులు స్వచ్ఛందంగా ఇష్టపూర్తిగా ఇచ్చే అంగీకారం ద్వారానే వారికి పరిహార పునరావాస ప్యాకేజీలు ఇవ్వ వలసి ఉంటుందని అటవీ హక్కుల చట్టం సెక్షన్ 4(2) వివరిస్తున్నది. పోలవరం నిర్వాసితులకు అడవులపై హక్కులను నిర్ధారించారా? గ్రామసభలు పూర్తి అవగాహనతో కూడిన అంగీకారాన్ని రాతపూర్వకంగా తెలిపాయా? అని సమగ్ర సమాచారం ఇవ్వాల్సిందేనని సమాచార కమిషన్ నిర్ణయించింది. డి.సురేశ్ కుమార్ దాఖలు చేసిన సమాచార అభ్యర్థనకు పర్యావరణ అటవీ శాఖ జవాబు ఇవ్వలేదు. మొదటి అప్పీలు తరవాత కూడా సమాచారం లేదు. రెండో అప్పీలు కేంద్ర సమాచార కమిషన్ ముందుకు వచ్చింది. పోలవరం ముంపు గ్రామాల నుంచి వచ్చిన వినతి పత్రాలకు కేంద్ర పర్యా వరణ శాఖ ప్రతిస్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2011 ఫిబ్రవరి 2న రాసిన ఒక లేఖలో అటవీ శాఖ డెరై క్టర్ జనరల్ కార్యదర్శి స్థాయి అధికారి త్వరలో రాష్ర్టంలో పర్యటిస్తారని తెలియజేసారు. ఆ ఉన్నతాధికారి వచ్చి పరిశీలించి ఇచ్చిన నివేదిక ఏమిటి? ఆ నివేదికపై తీసుకున్న చర్యలేమిటి? ఆదివా సుల హక్కులను నిర్ధారించారా లేదా? ఈ అంశాలపైన కేంద్ర రాష్ట్రాలకు మధ్య ఆ విషయమై జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల ప్రతులు తదితర వివరాలు ఇవ్వాలనే సురేశ్ కుమార్ అభ్యర్థన సమంజసమే. ఆర్టీఐ కింద మాత్రమే కాకుండా ఈ సమాచార హక్కు గిరిజనులకు అనేక ఇతర చట్టాల కింద కూడా ఉంది. కనుక అడిగిన మేరకు సమాచారం ఇచ్చి తీరాల్సిందే. (డి.సురేశ్ కుమార్ వర్సెస్ పర్యావరణ మంత్రిత్వ శాఖ 2015/ 00297 కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com