సీతంపేట: పీసా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ ఆదేశించారు. సీతంపేటలో షెడ్యూల్డ్ ఏరియా పంచాయతీలకు రెండు రోజుల పాటు జరగనున్న పీసాచట్టం అవగాహన సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులపై గ్రామసభల్లో తీర్మాన చేయాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్‌షాపులు ఏర్పాటు చేయాలన్నా, ప్రభుత్వం నుంచి పథకాలు రావాల్సి ఉన్నా పీసా అనుమతి తప్పని సరిగా తీసుకుంటేనే దానికి చట్టబద్ధత ఉంటుందన్నారు. మైనింగ్, గనుల తవ్వకాలు చేపట్టాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలని చెప్పారు. సదస్సులో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో ఉరిటి రాధాకృష్ణన్, రిసోర్స్ పర్సన్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.