itda project
-
ఐటీడీఏ మాజీ పీవో సూర్యనారాయణ అరెస్టు
ఏలూరు టౌన్: ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి యువతులను శారీరకంగా వాడుకున్నాడంటూ ఐటీడీఏ ప్రాజెక్టు మాజీ అధికారి ఆర్వీ సూర్యనారాయణపై వచ్చిన ఆరోపణలపై పోలవరం డీఎస్పీ లతాకుమారి విచారణ చేపట్టారు. మూడు రోజుల క్రితం ఈ కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో ప్రాజెక్టు అధికారి రాసలీలలు, అవినీతి బండారం బట్టబయలు కావడంతో శుక్రవారం సూర్యనారాయణను అరెస్టు చేసి జంగారెడ్డిగూడెం ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్డులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. -
పకడ్బందీగా పీసా చట్టం అమలు
సీతంపేట: పీసా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ ఆదేశించారు. సీతంపేటలో షెడ్యూల్డ్ ఏరియా పంచాయతీలకు రెండు రోజుల పాటు జరగనున్న పీసాచట్టం అవగాహన సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులపై గ్రామసభల్లో తీర్మాన చేయాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్‌షాపులు ఏర్పాటు చేయాలన్నా, ప్రభుత్వం నుంచి పథకాలు రావాల్సి ఉన్నా పీసా అనుమతి తప్పని సరిగా తీసుకుంటేనే దానికి చట్టబద్ధత ఉంటుందన్నారు. మైనింగ్, గనుల తవ్వకాలు చేపట్టాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలని చెప్పారు. సదస్సులో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో ఉరిటి రాధాకృష్ణన్, రిసోర్స్ పర్సన్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
'పని చేయలేకపోతే వెళ్లిపోండి'
ఎస్ఎంఐ పనులపై పీవో అసంతృప్తి ప్రొగ్రస్ లేకుంటే చర్యలు తప్పవంటూ హెచ్చరిక సీతంపేట : ఉద్యోగులు తమ విధులు సక్రమంగా చేయకపోతే సెలవుపై వెళ్లిపోవాలని ఎస్ఎంఐ అధికారులపై విజయనగరం జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి జల్లేపల్లి వెంకటరావు మండిపడ్డారు. సీతంపేటలోని ఐటీడీఏలో చిన్నతరహా నీటి వనరుల విభాగం పనులపై ఆయన శుక్రవారం సమీక్షించారు. నాలుగు నెలల క్రితం రివ్యూ చేశానని అప్పటికీ, ఇప్పటికీ అసలు ప్రొగ్రస్ ఏమి మార్పులేదని తెలిపారు. మీ అందరి జీతాలు నెలకు రూ.10 లక్షలు డ్రా చేస్తున్నారని, ఈ నాలుగు నెలల్లో రూ.40 లక్షలు జీతాలు తీసుకున్నారని రూ.40 లక్షల విలువ చేసే పనులు కూడా పూర్తి చేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగైతే మీరు అక్కర్లేదని మీ శాఖ పనులన్నీ ట్రైబుల్‌వెల్ఫేర్ ఇంజినీరింగ్ శాఖకు బదలాయించేస్తానని హెచ్చరించారు. మిమ్మల్ని సరండర్ చేస్తానని తెలిపారు. ఎన్ని సార్లు సమావేశాలు పెట్టినా మార్పు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. వేసవిలోనే పనులు చేయాలని, మరో 20 రోజుల్లో వర్షాకాలం వస్తుందని అప్పుడు వర్షాలు పడుతున్నాయని మరేపని చేయరని తెలిపారు. 2014-15 పనులు ఇంకా నాలుగు పెండింగ్ ఉన్నాయన్నారు. 2015-16కు సంబంధించి 40 పనులకు 28 మాత్రమే పూర్తి చేశారని తెలిపారు. ఎక్కడైనా ఎవరైనా పనులకు సంబంధించి అడ్డంకులు పెడితే తాను స్వయంగా మాట్లాడతానని చెప్పారు. అనంతరం ఒక్కో జేఈ ప్రోగ్రెస్‌ను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఈఈ రమణ, డీఈ పైల ఉషారాణి, జేఈలు పాల్గొన్నారు. -
ఐటీడీఏ పీవో బదిలీ
శ్రీశైలంప్రాజెక్టు: ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి నక్కల ప్రభాకరరెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. రాజధాని నిర్మాణంలో భాగంగా మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు ఇతన్ని బదిలీ చేశారు. ఐటీడీఏ పీవో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించానని చెప్పారు. బ్రిటీష్ కాలం నాటి జీవోలను వెలికి తీసి తండాల అభివృద్ధికి కృషి చేశానన్నారు. చెంచు విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాల, కళాశాలలో ప్రవేశాన్ని కల్పించానన్నారు. ప్రత్యేక అనుమతితో 30 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించి విద్యా శాతాన్ని పెంచినట్లు చెప్పారు. ఆరోగ్యదీపిక కార్యక్రమంతో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేశానన్నారు. ప్రతీ గూడెంలో ఆర్థికాభివృద్ధి సాధించడం కోసం రూ. 10లక్షలతో వడ్డీలేని రుణాలను మంజూరు చేశామని, 1386 మంది యువతకు ఈజీఎంఎం ద్వారా శిక్షణ ఇచ్చి నియామకాలు జరిపించామన్నారు. అటవీశాఖలో 37 మందికి టైగర్ ట్రాకర్లుగా, శ్రీశైలదేవస్థానంలో 16 మందికి సెక్యూరిటీగార్డులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి కింద నామమాత్రపు అద్దెతో 16 మందికి చెంచు బజార్ షాపులను కేటాయించానని వివరించారు. ట్రైకార్ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం, ప్రతిగూడెంలో విద్యుత్ సౌకర్యం అందించడం కోసం సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడం వంటి పనులు చేశానన్నారు. సర్పంచ్‌లుగా 20 మందిని, వార్డుమెంబర్లుగా 73 మందిని ఎన్నికయ్యేటట్లు చేసి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఐటీడీఏలో దళారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించానన్నారు. ఇదేమార్పును రానున్న అధికారులు తీసుకు రావాలన్నారు. తాను బదిలీపై 27వ తేదీన రిలీవ్ కానున్నట్లు చెప్పారు. అనంతరం చరిత్రలో ఒకరోజు ఒక చెంచుగూడెం పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
గిరిజనాభ్యున్నతే ఐటీడీఏ లక్ష్యం
రూ.3280.83 కోట్లతో ప్రణాళికలు స్వాతంత్య్ర దినోత్సవంలో పీవో వినయ్‌చంద్ పాడేరు: విశాఖ ఏజెన్సీలోని అన్ని వర్గాల గిరిజనుల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా ఐటీడీఏ పని చేస్తుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ అన్నారు. తలారిసింగ్ క్రీడామైదానంలో స్వాతంత్య్ర దినోత్సవా న్ని శుక్రవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పీవో జాతీయ జెండాను ఎగు ర వేసి విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014-15 సంవత్సరంలో రూ.3280.83 కోట్లతో గిరిజన సంక్షేమానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రభు త్వ ఆమోదం రాగానే తాగునీరు, విద్య, ఇంజినీరింగ్, వ్యవసాయం, ఉద్యాన వనం, పట్టుపరిశ్రమ, విద్యుత్ తదితర రంగాల్లో కార్యక్రమాలు విస్తృతమౌతాయన్నారు. ఏజెన్సీలోని అన్ని మండలాల్లో బ్యాంకు సేవలను విస్తృతం చేసి గిరిజన రైతులకు బ్యాంకు ఖాతాల ద్వారా ప్రభుత్వ రాయితీలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ, పచ్చతోరణం పథకాల కిం ద ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో పండ్ల జాతుల మొక్కలను పెంచుతున్నామన్నారు. గతేడాది 9,371 మంది విద్యార్థులకు రూ.10.47 కోట్ల ఉపకార వేతనాలు మంజూరు చేశామన్నారు. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.104.59 కోట్ల అం చనా వ్యయంతో పాఠశాల భవనాలు, డీఆర్ డిపోలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఉపాధి పథకం ద్వారా రూ.29.67 కోట్లతో సీసీ రోడ్లు, డ్రయినేజీలు నిర్మించామన్నారు. ఏజెన్సీలోని కాఫీ ప్రాజెక్టు ద్వారా గిరిజన రైతులకు తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజనులకు కూలి పనులు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, డీఎఫ్ఓ శాంతారాం, ఏఎస్పీ ఎ.బాబూజీ, ఐటీడీఏ ఏపీవో పి.వి.ఎస్.నాయుడు, గిరిజన సంక్షేమ ఈఈ ఎం.ఆర్జీ నాయుడు, పాడేరు ఎంపీపీ వర్తన ముత్యాలమ్మ, ఉపాధ్యక్షురాలు ఎం.బొజ్జమ్మ, పాడేరు సర్పంచ్ కిల్లు వెంకటరత్నం, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం పలు డ్వాక్రా సంఘాలకు కొత్త రుణాలు, పలు ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, సాంస్కృతిక ప్రదర్శనలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను ఐటీడీఏ పీవో, డీఎఫ్ఓ, ఏఎస్పీలు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన సీఏహెచ్ పాఠశాల హెచ్ఎం జి.వి.ప్రసాద్, వార్డెన్ మల్లికార్జునరావు, పీడీ సింహాచలం, ఇతర ఉపాధ్యాయులందర్ని ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ ప్రత్యేకంగా అభినందించి మెమెంటోలను అందజేశారు. -
అందరికీ బ్యాంక్ ఖాతా ఉండాలి
తోణాం (సాలూరు రూరల్):ప్రతి ఒక్కరికీ తప్పని సరిగా బ్యాంక్ ఖాతా ఉండాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రజిత్‌కుమార్ సైనీ అన్నారు. సాలూరు మండలంలో మంగళవారం నిర్వహించిన బ్యాంక్ వ్యక్తిగత ఖాతాల కేంద్రాలను అయన పరిశీలించారు. ముందుగా మండలంలోని బాగువలస,మామిడిపల్లి,గంగన్నదొరవలస,తోణాం,కురుకూట్టి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్బంగా ఐకేపీ ఏరియా కో-ఆర్డినేటర్ చిరంజీవి మాట్లాడుతూ బాగువలసలో 850 కుటుంబాలు,సాలూరులో 595,మామిడిపల్లిలో 645,గంగన్నదొరవలసలో 369,కురుకూట్టిలో 265,తోణాంలో 330 కుటుంబాలు ఉన్నాయని వాటికి సంబంధించి బ్యాంక్ వ్యక్తిగత ఖాతాలకోసం ప్రారంభ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. హాస్టల్ ఏర్పాటు చేయాలి బాగువలస గ్రామంలో విద్యార్థుల కోసం హాస్టల్ సౌకర్యం ఏర్పాటు చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై.పి.సన్యాసిరావు పీఓను కోరారు. గ్రామ పరిధిలో నక్కడవలస,నార్లవలస,పెదపదం,గాదిబిల్లివలస,తాడిలోవ,మిర్తివలసతో పాటు సుమారు 30 గిరిజన గ్రామాలున్నాయని, విద్యార్థులకు భోజన వసతి సౌకర్యం లేకపోవడంతో వారంతా చదువుకు దూరంగా ఉంటున్నారన్నారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తపై విచారణకు అదేశాలు తమ గ్రామానికి నిత్యం ఉపాధ్యాయుడు రావడం లేదని, తాగునీటి కోసం తీవ్ర అవస్ధలు పడుతున్నామని నారింజపాడు గ్రామ గిరిజనులు కురుకూట్టి వచ్చిన పీఓ ఎదుట మొరపెట్టుకున్నారు. దీంతో స్పందించిన పీఓ వెంటనే ఉపాధ్యాయుడిపై విచారణ చేయాలని సంబంధిత అధికారులకు అదేశాలు జారీ చేశారు. అనంతరం పెదబరిగాం గ్రామాన్ని సందర్శించగా ఆ గ్రామానికి చెందిన చుక్కయ్య అనే ఉపాధ్యాయుడు నిత్యం పాఠశాలకు రావడం లేదని అంగన్వాడీ టీచర్ సాయమ్మ తమకు ఫీడింగ్ ఇవ్వడం లేదని గిరిజనులు మొరపెట్టుకున్నారు. ఆ ఇద్దరిపై కూడా విచారణ చేయాలని సంబంధిత అధికారులకు పీఓ అదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో అయన వెంట ఉపాధి ఏపీవో కృష్ణారావుతో పాటు పలువురు అధికారులు ఉన్నారు. -
విద్యార్థుల ఆరోగ్యానికి వందరోజుల ప్రణాళిక
ఏజెన్సీ ఆశ్రమాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్ పాడేరు: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్ట ల్ విద్యార్థుల ఆరోగ్యానికి వంద రోజుల ప్రణాళిక అమలుకు సిద్ధం కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికా రి వి.వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. బు ధవారం తన క్యాంపు కార్యాలయంలో గిరిజన వి ద్యాలయాల్లో చేపట్టనున్న పలు కార్యక్రమాలపై స మీక్షించారు. పీఓ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై సంక్షేమ అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలన్నారు. ఆశ్రమాల్లో తాగునీటి క్లోరినేషన్, దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. బాలికల ఆశ్రమాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఏటీడబ్ల్యూఓలు రో జూ హాస్టళ్లను తనిఖీ చేసి నివేదికను సాయంత్రానికే అందజేయాలన్నారు. ప్రతి ఆశ్రమానికి రూ.10 లక్ష లు చొప్పున నిధులు అందుబాటులో ఉన్నాయని, ఇంజినీర్లతో చర్చించి మరుగుదొడ్లు, స్నానపుగదు లు, విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. విస్తారంగా మొక్కలు నాటాలన్నారు. ఆగస్టు10 నాటికి ఆశ్రమాలను తనిఖీ చేస్తానని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ డీడీ మల్లికార్జునరెడ్డి, ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు, ఉపాధి పథకం ఏపీడీలు ప్రసాద్, లచ్చన్న, నాగేశ్వరరావు, ఏటీడబ్ల్యూఓలు శాంతకుమారి, శ్రీనివాసరావు, శ్రీదేవి, సూర్యనారాయణ, కూడ వెంకటరమణ పాల్గొన్నారు. కీటకజనిత వ్యాధులపై అప్రమత్తం ఏజెన్సీలోని కీటక జనిత వ్యాధుల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, వాతావరణ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వినయ్చం ద్ మండల ప్రత్యేకాధికారులు, వైద్యాధికారులను ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. రెండో విడత వైద్యపరీక్షలు ఈ నెల 20 నుంచి ఏజెన్సీలో రెండో విడత స్కూల్ హెల్త్ కార్యక్రమాన్ని నిర్వహించాలని పీఓ ఆదేశించారు. ఆశ్రమాల్లో ప్రత్యేక వైద్యసేవలకు సంబంధించి వైద్యశాఖ అధికారులతో సమీక్షించారు. వైద్యులు, సిబ్బంది విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు. స్కూల్ హెల్త్ కార్యక్రమాన్ని ప్రణాళికాయుతంగా అమలు చేయాలన్నారు. దోమల మందు పిచికారీ పనులు కూడా చేపట్టాలన్నారు. టి.బి రోగుల వైద్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఏంహెచ్ఓ శ్యామల, ఏడీఎంహెచ్ఓ డాక్టర్ లీలాప్రసాద్, అన్నిమండలాల ప్రత్యేకాధికారులు, ఎస్పీహెచ్ఓలు పాల్గొన్నారు. -
ఆదివాసీ గ్రామాల్లో శాశ్వత పథకాలు
=తాగు నీటి సమస్య నివారణకు చర్యలు =మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరాలి =ఐటీడీఏ పీవో వినయ్ చంద్ పెదబయలు/పాడేరు రూరల్, న్యూస్‌లైన్: పెదబయలు మండలం మారుమూల పెదకోడాపల్లి, కిముడుపల్లి పంచాయతీల పరిధిలోని అండ్రవర, పులిగొంది ఆదివాసీ గ్రామాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.విన య్ చంద్ సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. ఐటీడీఏ ఉన్నతాధికారి తొలిసారి రావడంతో ఆ గ్రామాల గిరిజనులు ఉబ్బితబ్బిబయ్యా రు. ఇంత కాలం తమ గ్రామానికి ఉన్నతాధికారులు రాక సమస్యలు పరిష్కారం కాక నానా అవస్థలు పడుతున్నామని, ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కలిగిందని ఆనందించారు. ఈ సందర్భంగా పీవో ఆయా గ్రామాల్లో గిరిజనులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీ గ్రామాల్లో శాశ్వత అభివృద్ధి పథకాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పెదకోడాపల్లి నుంచి అండ్రవర, పులిగొంది గ్రామాలకు రోడ్డు, సామాజిక భవనాలు నిర్మించాలని గ్రామస్తులు కోరడంతో వాటి నిర్మాణాలకు రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని పీవో చెప్పా రు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యాధులకు దూరంగా ఉండాలని, మహిళలంతా స్వయం సహాయక సంఘాల్లో చేరి పొదుపు పాటించాలని సూచించారు. మరుగుదొడ్లు నిర్మించుకుంటే నిధులు మంజూరు చేస్తామన్నా రు. గ్రామంలో ఉన్న బాల బడిని తనిఖీ చేశారు. చిన్నారులకు సకాలంలో పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. పులిగొంది గ్రామంలోని చెక్‌డ్యామ్ మరమ్మతులకు పీవో హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఈఈ ఎం.ఆర్.జి.నాయు డు, డీఈ డి.వి.ఆర్.ఎం.రాజు, ఐకేపీ ఏపీ డీ రత్నాకర్, ఏసీ భాస్కర్ పాల్గొన్నారు. -
28 నుంచి అరకు ఉత్సవ్
=గిరిజన సంస్కృతి ప్రతిబింబించాలి =సందర్శకులకు సకల సౌకర్యాలు =ఐటీడీఏ పీవో వినయ్ చంద్ ఆదేశం అరకులోయ, న్యూస్‌లైన్: ఈ నెల 28, 29, 30 తేదీల్లో అరకు ఉత్సవ్ నిర్వహించనున్నట్టు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ తెలిపారు. ఈ నెల 15 నుంచి ఉత్సవ్ నిర్వహించేందుకు నిర్ణయించినప్పటికీ రచ్చబండ కార్యక్రమం వల్ల వాయిదా వేశారని చెప్పారు. ఉత్సవ్ నిర్వహణ ఏర్పాట్లపై పద్మాపురం ఉద్యానవనంలో పర్యాటక శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. ఉత్సవ్ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించాలని ఆదేశించారు. ఉత్సవ్ నిర్వహణకు అవసరమైన కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్సవ్‌కు వచ్చే సందర్శకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పర్యాటక సమాచార అధికారి ఎస్.డి.అనిత మాట్లాడుతూ ఉత్సవ్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన సంప్రదాయ నృత్యాలు థింసా, కొమ్ము, కోయ, లంబాడా, సవర, గరగ, తప్పెటగుళ్లు, మయూర, ఒరియా భాగవతం, కోలాటం వంటి సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఏపీవో పి.వి.ఎస్.నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మల్లికార్జున రెడ్డి, ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ భీమశంకరరావు, ఐటీడీఏ పీహెచ్‌వో కె.చిట్టిబాబు, టూరిజం సమాచార శాఖ సహాయ అధికారి రాజు, కో-ఆర్డినేటర్ మురళి, పద్మాపురం గార్డెన్ మేనేజర్ ఎల్.బొంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన సరకులు సరఫరా చేయాలి
పాడేరు, న్యూస్‌లైన్: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు నాణ్యమైన నిత్యావసర సరకులు సరఫరా చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ జీసీసీ అధికారులు, వ్యాపారులను ఆదేశించారు. హాస్టళ్లలో వంట నూనెలు, పప్పులు, కోడి గుడ్లు, కాస్మోటిక్స్, ఇతర నిత్యావసర సరకుల సరఫరాకు సంబంధించి ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం టెండర్ల కార్యక్రమం నిర్వహించారు. బకాయిలు పేరుకుపోవడంతో కొంతమంది వ్యాపారులు టెండర్లకు దూరంగా ఉన్నప్పటికీ తుని, అనకాపల్లి, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన కొత్త వ్యాపారులు ఈ టెండర్లో పాల్గొన్నారు. 439 క్వింటాళ్ల కందిపప్పు, 306 క్వింటాళ్ల శనగపప్పు, 185 క్వింటాళ్ల పెసరపప్పు, 534 క్వింటాళ్ల బఠాణి, 188 క్వింటాళ్ల పంచదార, 59,480 లీటర్ల వంటనూనె తదితర నిత్యావసర సరకుల సరఫరాకు టెండర్లు నిర్వహించారు. మొత్తం 29 రకాల నిత్యావసర సరకులకు సంబంధించి వ్యాపారులు కోడ్ చేసిన ధరల వివరాలను, సరుకుల శాంపిల్స్ నాణ్యతను పరిశీలించారు. కందిపప్పు కిలో రూ.57, మినపపప్పు రూ.54, శనగపప్పు రూ.45, పెసరపప్పు రూ.77, బఠాణి రూ.37, పామాయిల్ రూ.65.50 ధరతో టెండర్లు ఖ రారు చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ టెండర్లో చూపించిన శాంపిల్స్ ప్రకారమే నాణ్యమైన నిత్యావసర సరకులను సకాలంలో సరఫరా చేయాలని ఆదేశించారు. సరుకుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరఫరా చేసిన సరకులకు బిల్లుల చెల్లింపుల విషయంలో ఎలాంటి జాప్యం ఉండదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు బి.మల్లికార్జునరెడ్డి, జీసీసీ డివిజనల్ మేనేజర్ ప్రతాప్‌రెడ్డి, బ్రాంచి మేనేజర్లు పాల్గొన్నారు.