ఆదివాసుల హక్కులేవి?
ముంపు గ్రామాలలో ఆదివాసుల తరలింపు విషయంలో గ్రామ సభలను సంప్రదించాలని చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ఈ హక్కులను షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించే పెసా చట్టం కూడా సంప్రదింపు హక్కులను కల్పిస్తున్నది.
ఏ పెద్ద ఆనకట్ట నిర్మాణాని కైనా గ్రామాలకు గ్రామాలు, అడవులు, పంట పొలాలు మునగక తప్పదు. తరలిపోవలసిన గ్రామస్తులకు నష్టాన్ని పూడ్చేంత పరిహారం ఇవ్వా ల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. ఎంత పరిహారం ఇవ్వాలనే విషయం నష్టం ఎంత అనే లెక్కపైన ఆధారపడి ఉంటుంది.
పోలవరం ప్రాజెక్టు కింద వందలాది గ్రామాలు, లక్షలాది మంది ఆదివాసులకు అడవులే ఆధారం. వారి బతుకు అడవిలో దొరికే ఫలాలు, ఆకులు, కొమ్మలే. పోలవరం కోసం మూలాలు వదిలి పోవలసిన ఆది వాసుల నష్టాన్ని ఎవరు ఏ విధంగా లెక్కిస్తారు? అడవి పైన వారికి లభించే హక్కుల విలువే వారికి ఇవ్వవలసిన పరిహారం.
1927లో ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన అటవీ రక్షణ చట్టం అడవుల సంపదను తరలించుకుపోవడానికే అని స్వాతంత్య్ర సమరోద్యమ కాలంలో విమర్శలు వచ్చా యి. ఒక ప్రాంతాన్ని అడవిగా ప్రకటించే అధికారం ప్రభుత్వానిదైతే ఆ అడవుల్లో ఉన్న ఆదివాసుల హక్కు లను నిర్ణయించే అధికారం ఒక అటవీశాఖాధికారికి ఈ చట్టం దఖలు పరిచింది. ఆ అమాయకులకు ఇతనే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా. ఒక్క ప్రకటనతో ఆదివా సుల హక్కులన్నీ ఉంచడమో, ఊడబీకడమో చేసే అధి కారం ఇచ్చిందీ చట్టం. ఇది భారతీయులు స్వతం త్రంగా తమ కోసం చేసుకున్న చట్టం కాదు.
మన స్వతంత్ర పాలకులు మన ఆదివాసుల కోసం చేసిన తొలి చట్టం షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్ర దాయ అటవీ నివాసుల అటవీ హక్కుల చట్టం 2006. చారిత్రికంగా ఆదివాసుల పట్ల వరసగా ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను సరిదిద్దే నియమాలు ఈ చట్టం లో ఉన్నాయి. గిరిజనుల హక్కులను నిర్ణయించడంలో గ్రామసభలు భాగస్వాములవుతాయి. డిసెంబర్ 13, 2005 నాటికి అటవీ భూములను సాగుచేస్తున్నా, లేదా అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్త్తున్నా వారికి ఆ విధంగానే జీవనం కొనసాగించే హక్కును ఈ చట్టం ద్వారా ప్రకటిస్తారు. తెండు పట్టాలు, ఔషధ మొక్కల పెంపకం, వాటిని సేకరించే హక్కు, పశువు లను మేపుకునే హక్కు, చెరువులను వాడుకునే హక్కు వస్తాయి. సాగు హక్కులనీ, వినియోగ హక్కులనీ రెం డు రకాల హక్కులను గుర్తించడం వల్ల, ఆదివాసుల మీద ఆక్రమణదారులని కేసులు పెట్టి వేధించడానికి వీలుండదు.
ఈ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు సాగాయి. దరఖాస్తులు స్వీకరించిన తరవాత రెండు దశలలో వాటిని వడబోసి గ్రామ పంచాయతీలో పెద్దలు కాకుం డా మొత్తం గ్రామసభ సమావేశాలలో తీర్మానాల ద్వారా హక్కులను ప్రకటిస్తారు. వీటిని తాలూకా జిల్లా స్థాయి అధికారులతో కూడిన కమిటీ నిజానిజాలను పరిశీలించి హక్కులను ధృవీకరిస్తుంది. ఈ విధంగా హక్కులను నిర్ధారించకుండా అటవీ ప్రాంత ఆదివాసు లను ప్రాజెక్టుల కోసం తరలించడానికి వీల్లేదని ఈ చట్టం చాలా స్పష్టంగా నిర్దేశించింది.
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు, ప్రాం తాల అడవులలో ఉండేవారి సాగు హక్కులు వాడకం హక్కులు నిర్ధారణ జరగకుండా వారిని తరలించడానికి చట్టం అంగీకరించదు. ఎందుకంటే వారికి ఏ హక్కులు న్నాయో తెలిస్తేనే వాటిని కోల్పోయినందుకు పరిహారం చెల్లించడానికి వీలవుతుంది కనుక. ఆ విధంగా తమ హక్కులు నిర్ధారించలేదని అనేక గ్రామాల నుంచి కేంద్రానికి మహజర్లు పంపుకున్నారు. ఈ అంశాలను తెలుసుకోవడానికి కేంద్రం ఒక ఉన్నతాధికారిని పంపు తానని లేఖ రాసింది. ఆ అధికారి నివేదిక, దానిపై తీసు కున్న చర్యల వివరాలు కావాలని డి.సురేశ్ కుమార్ ఆర్టీఐ కింద అడిగారు.
ముంపు గ్రామాలలో ఆదివాసుల తరలింపు విష యంలో గ్రామ సభలను సంప్రదించాలని చట్టాలు నిర్దే శిస్తున్నాయి. ఈ హక్కులను షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించే పెసా చట్టం కూడా సంప్రదింపు హక్కులను కల్పిస్తున్నది. అంతా తెలుసుకున్న తరువాత ఆదివా సులు స్వచ్ఛందంగా ఇష్టపూర్తిగా ఇచ్చే అంగీకారం ద్వారానే వారికి పరిహార పునరావాస ప్యాకేజీలు ఇవ్వ వలసి ఉంటుందని అటవీ హక్కుల చట్టం సెక్షన్ 4(2) వివరిస్తున్నది.
పోలవరం నిర్వాసితులకు అడవులపై హక్కులను నిర్ధారించారా? గ్రామసభలు పూర్తి అవగాహనతో కూడిన అంగీకారాన్ని రాతపూర్వకంగా తెలిపాయా? అని సమగ్ర సమాచారం ఇవ్వాల్సిందేనని సమాచార కమిషన్ నిర్ణయించింది. డి.సురేశ్ కుమార్ దాఖలు చేసిన సమాచార అభ్యర్థనకు పర్యావరణ అటవీ శాఖ జవాబు ఇవ్వలేదు. మొదటి అప్పీలు తరవాత కూడా సమాచారం లేదు. రెండో అప్పీలు కేంద్ర సమాచార కమిషన్ ముందుకు వచ్చింది. పోలవరం ముంపు గ్రామాల నుంచి వచ్చిన వినతి పత్రాలకు కేంద్ర పర్యా వరణ శాఖ ప్రతిస్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2011 ఫిబ్రవరి 2న రాసిన ఒక లేఖలో అటవీ శాఖ డెరై క్టర్ జనరల్ కార్యదర్శి స్థాయి అధికారి త్వరలో రాష్ర్టంలో పర్యటిస్తారని తెలియజేసారు.
ఆ ఉన్నతాధికారి వచ్చి పరిశీలించి ఇచ్చిన నివేదిక ఏమిటి? ఆ నివేదికపై తీసుకున్న చర్యలేమిటి? ఆదివా సుల హక్కులను నిర్ధారించారా లేదా? ఈ అంశాలపైన కేంద్ర రాష్ట్రాలకు మధ్య ఆ విషయమై జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల ప్రతులు తదితర వివరాలు ఇవ్వాలనే సురేశ్ కుమార్ అభ్యర్థన సమంజసమే. ఆర్టీఐ కింద మాత్రమే కాకుండా ఈ సమాచార హక్కు గిరిజనులకు అనేక ఇతర చట్టాల కింద కూడా ఉంది. కనుక అడిగిన మేరకు సమాచారం ఇచ్చి తీరాల్సిందే. (డి.సురేశ్ కుమార్ వర్సెస్ పర్యావరణ మంత్రిత్వ శాఖ 2015/ 00297 కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా)
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com