న్యాయ సలహా
పెళ్లయినప్పటినుంచి భర్త వేధింపులు తప్పడం లేదు. పిల్లలు పుట్టి వాళ్లు కాస్త పెద్దవాళ్లయినా మారలేదు సరి కదా, ఇంకా ఎక్కువైంది. ఇంక భరించలేక విడిపోతున్నాను. నాకు, నా పిల్లలకు ఆస్తిలో వాటా వస్తుందా? – పి. అనిత, నెల్లూరు
సాధారణంగా స్థిరాస్తులు ఎవరి పేరుతో అయితే ఉంటాయో వారికి మాత్రమే చెందుతాయి వారి స్వార్జితం కిందనే పరిగణించ బడతాయి. కానీ అన్నివేళలా అదే నియమం వర్తించదు. భార్యకు భర్త ఆస్తిలో హక్కు ఉందా లేదా అనే అంశం భర్త మతాచారంపై ఆధారపడి ఉంటుంది. హిందువులకు వర్తించే చట్టాల ప్రకారం మీ భర్త పేరిట ఉన్న ఆస్తి వారసత్వం ద్వారా సంక్రమించింది అయితే గనక అందులో మీ పిల్లలకు పూర్తి హక్కు ఉంటుంది. మీ పిల్లలు మైనర్లు అయితే వారి తరఫున మీరు సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. మీ పిల్లలకి వారి వాటా వారికి దక్కుతుంది. అదే మీ భర్త స్వార్జితం అయితే మాత్రం తన తదనంతరం వీలునామా ప్రకారం, వీలునామా లేని పక్షంలో హిందూ వారసత్వ చట్టం ప్రకారం లేదా భర్త జీవితకాలంలో స్వయంగా ఇవ్వాలి అని తలిస్తే మాత్రమే భార్యకి హక్కులు ఉంటాయి.
మరో విషయం... భార్యకు తన జీవితకాలం మొత్తం భర్త ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ లేదా విడాకులు తీసుకునే సమయంలో భర్త ఆస్తిలో భార్యకు వాటా వచ్చే అవకాశం ఉంది. ఎంత శాతం వాటా ఇవ్వాలి అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. హిందూ లా, ముస్లిం లా, క్రిష్టియన్ లా, ఇలా వేర్వేరు మతస్తులకు వేరే విధమైన హక్కులు ఉంటాయి.
మీరు భర్త వేధింపులు తట్టుకోలేక విడి΄ోతున్నాను అని చె΄్పారు కాబట్టి, డీ.వీ.సీ. చట్టం (గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం, 2005) కింద కేసు వేసినట్లయితే, అందులో అనేక రకాల హక్కులను, ఉపశమనాలను పొందవచ్చు. కేసు తేలేంతవరకు మీ భర్త ఆస్తులను అమ్మకుండా కోర్టు వారు స్టే విధించే అవకాశం కూడా ఉంది. డీ.వీ.సీ. చట్టం సెక్షన్ 22 ప్రకారం అదనపు దరఖాస్తు చేసుకుంటే, మీరు కోరిన ఉపశమనాలతో పాటు మానసిక హింస, మానసిక క్షోభతో సహా మీకు కలిగిన గాయాలకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించవచ్చు. డీ.వీ.సీ. చట్టం ప్రకారం భర్త ఆస్తి పై కేసు వేసే వీలుందా లేదా అన్నది ప్రతి కేసులోనూ విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న లాయర్‌ని సంప్రదిస్తే మంచిది.
– శ్రీకాంత్ చింతల , హైకోర్టు న్యాయవాది
Comments
Please login to add a commentAdd a comment