
రాహుల్‌కి పట్టంగట్టి పార్టీని పాడె ఎక్కిస్తారా?
అవలోకనం
రాహుల్‌కు పగ్గాలు అప్పగించడమంటే కాంగ్రెస్‌ను దహించేస్తున్న అగ్నికీలల్లో పెట్రోలు పోయడమే అవుతుంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ తన 67 ఏళ్ల కొడుకు, రాకుమారుడు చార్లెస్ కోసం సింహాసనాన్ని వదులుకోవడానికి సిద్ధపడటం లేదు. ఆయన మంచి రాజు కాలేడని ఆమె భావించడమే అందుకు కారణం కావచ్చు. ఆమెలాగే సోనియా కూడా కాంగ్రెస్ అధినేతగా కొనసాగాలి. అది ఆమె కుమారునికి రుచించకపోవచ్చు, కానీ ఆమె మొదట ఆలోచించాల్సింది పార్టీ గురించి.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకత్వాన్ని చేపట్టడం గురించిన వార్తా కథనాలు ఈ వారం మళ్లీ దర్శనమిచ్చాయి. దశాబ్ద కాలంగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న ఆయనకు ఇప్పుడు 45 ఏళ్లు. కాబట్టి పార్టీలోని ఆయన మద్దతుదార్లు అధికారికంగా ఆయన ఇక పగ్గాలు చేపట్టాలని కోరుకోవడం సహజమే. కాకపోతే ఆయన తల్లి సోనియా గాంధీ ఎందుకు తప్పుకోవాలనే విషయమే అస్పష్టంగా ఉంది. ఈ మార్పును కోరుకోవడానికి రెండు కారణాలున్నాయని తోస్తోంది. ఒకటి, ఎప్పుడో ఒకప్పుడు పాత తరం తప్పుకుని యువతకు చోటివ్వక తప్పదు. ఇప్పుడో అప్పుడో సోనియా కాంగ్రెస్ నాయకత్వాన్ని వదులుకోక తప్పదు. కాబట్టి తన వారసుడ్ని పట్టాభిషిక్తుణ్ణి చేయాలనుకోవడం సమంజసమేనని ఆమెకు కూడా అనిపిస్తుంది. పైగా ఇప్పటికే ఆయనకు పట్టాభిషేకం జరిగింది, కాకపోతే అధికారం చేపట్టడమే మిగిలింది.
ఇక రెండవది, తక్కువ పారదర్శకమైన కారణం. అది సోనియా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుందనేది. విదేశాలలో ఆమెకు చికిత్స జరగాల్సిన అవసరమున్నదని కొంత కాలం క్రితం వార్తలొచ్చాయి. వివరాలను వెల్లడి చేయలేదు గానీ అప్పట్లో ఆమె పరిస్థితి అత్యధునాతన వైద్య సహాయాన్ని కోరాల్సినంతటి తీవ్రమైనదిగా ఉన్నదనేది స్పష్టమే. ఆమె కుమారునికి అత్యున్నత పదవిని కట్టబెట్టడం కోసం తాజాగా జరుగుతున్న ప్రయత్నాలకు అది తగిన కారణమేనా? బహుశా కాదు. చివరిసారిగా ఆమె విదేశాల్లో వైద్య చికిత్స చేయిం చుకున్నది ఇటీవల కాదు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం చక్కగా ఉన్నట్టు ఫొటోలు చెబుతున్నాయి.
అలాంటప్పుడు రాహుల్‌ను అత్యున్నత స్థానానికి పంపాలనే ఈ ఆరాటం ఎందుకు? పార్టీలోని అంతర్గత ఒత్తిడి అందుకు ఒక కారణం కావచ్చు. పార్టీ స్థితి వేగంగా దిగజారిపోతుండటాన్ని చూస్తున్న కాంగ్రెస్‌వాదులు మార్గ నిర్దేశనంలో కొంత మార్పును కోరుకుంటూ ఉండవచ్చు. ఏదైనా నాటకీయమైన తీవ్ర చర్యను చేపట్టకపోతే పార్టీ కొద్ది కాలంలోనే మరణిస్తుంది. లోక్‌సభలో దాదాపు 200 స్థానాలను కలిగిన స్థితి నుంచి అది 45 స్థానాలకు దిగజారింది. లోక్‌సభలో ప్రవే శించలేకపోయిన 150 మంది కాంగ్రెస్ నేతలు ఓడిన ఆ ఎన్నికల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. వారిలో చాలామంది కొన్ని దశాబ్దాల జీవిత కాలాన్ని పార్టీ కోసం పణంగా పెట్టారు. పార్టీ భవితలో వారి వ్యక్తిగత ప్రయోజనాలు సైతం ఉన్నాయి. పార్టీ కుప్పకూలిపోవడమంటే వారు తాము పెట్టిన మదుపును, భవిష్యత్తును కోల్పోవడమే. వారిలో కొందరు లేదా చాలా మంది పార్టీ నాయకత్వం గురించి స్పష్టతను కోరుతుండవచ్చు, ఆందోళన చెందు తుండవచ్చు. కేంద్రంలోనూ, దాదాపు అన్ని ప్రధాన రాష్ట్రాలలోనూ అధికారాన్ని కోల్పోవడమంటే పార్టీ నిధుల సమీకరణ కోసం తంటాలు పడాల్సి వస్తోందని అర్థం. తక్షణమే నాయకత్వ మార్పును కోరడానికి అది మరో కారణం.
అయితే అలాంటి మార్పు వల్ల కాంగ్రెస్‌కు మేలు జరుగుతుందా? అనేదే ప్రశ్న. పార్టీకి నాయకత్వం వహించడంలో సోనియాకు చాలా మంచి రికార్డే ఉంది. ఆమె పార్టీ పగ్గాలు స్వీకరించే నాటికి పార్టీ ఇలాంటి స్థితిలోనే ఉంది. కాంగ్రెసేతర ప్రధాని నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ పలు కుంభకోణాల్లో ఇరుక్కుపోయి లేదా ఆరోపణలకు గురై ఉంది. ఆ పార్టీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వయంగా ఒక కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ, కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కూడా అదేసమయంలో జరిగింది. ఆ పార్టీకి చెందిన అత్యంత జనాకర్షక నేత అటల్ బిహారీ వాజపేయి ప్రధాని అయ్యారు. మూడు ఎన్నికల విజయాలను (మెజా రిటీని సాధించలేకపోయినా) సాధించారు.
బీజేపీ ప్రబల శక్తిగా ఉండి, కాంగ్రెస్ పట్టును కోల్పోతూ ఉన్న కాలంలో సోనియా నాయకత్వాన్ని చేపట్టారు. ఆమె తన పార్టీని పునరుజ్జీవింపజేసి, బీజేపీ ప్రభావం మసిబారడంతోనే, 2004లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసు కొచ్చారు. అధిక వృద్ధి, సమాచార హక్కు వంటి అద్భుతమైన చట్టాలతో కాంగ్రెస్ రెండో దఫా ఎన్నికల విజయంతో తిరిగి అధికారంలోకి వచ్చింది. అందువలన సోనియాకు ఫలితాలను సాధించడంలో, సమర్థతలో మంచి చరిత్ర ఉన్నది. గత ఎన్నికల్లో ఆమె చాలా ఘోరంగా ఓడిపోయారు. కానీ గాయపడ్డ కాంగ్రెస్ పార్టీని సంర క్షించి, తిరిగి ఆరోగ్యవంతంగా ఎలా చెయ్యాలో ఆమెకు తెలుసు, ఆ అనుభవం ఆమెకు ఉంది. రాహుల్‌కు అవి ఉన్నాయా? లేవు.
మన్మోహన్‌సింగ్ రెండోదఫా పదవీకాలంలో రాహుల్‌కు అనుకూల స్వరాలు వినిపించాయి. ఆయనను పార్టీ ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టడం భవితను స్పష్టం చేసింది. కారణాలు ఏైవె నా గానీ ఆయన ఫలితాలను సాధించలేకపోయారు. ఈ కాలంలో కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయనను తమ నేతగా చూపింది, ఘోర పరాజయం పాలైంది. ఆయనలో దృష్టి కేంద్రీకరణ, శక్తి, ఉత్సాహం కొరవ డ్డాయని చాలామందే గమనించారు. నరేంద్ర మోదీ కంటే రాహుల్ రెండు దశాబ్దాలు చిన్నవారు. అయినా ప్రధానితో పోలిస్తే దాదాపుగా కాలం చెల్లిపోయిన వ్యక్తిలా కనిపిస్తారు. కాగా సోనియా చక్కగా పొందికగా, దృఢంగా ఉంటారు. ఆమెకు ఏ తీవ్ర అనారోగ్య సమస్యలు లేన ట్టయితే ఇంకా కొన్నేళ్లపాటు క్రియాశీలంగా, చురుగ్గా ఉండే అవకాశం ఉంది. కుమారునికి లేని విశ్వసనీయత ఆమెకుంది. విదేశీ ఉచ్ఛారణతోనే అయినా ఆమె ఏదైనా ఒక ముఖ్య అశంపై ఒక ప్రకటనను చేస్తుంటే, రాహుల్ చేసే ప్రకటన కంటే ఎక్కువ శ్రద్ధగా వినే అవకాశాలు ఎక్కువ.
ఆయన తండ్రి రాజీవ్ గాంధీ 1980ల చివర్లో ఇబ్బందులతో సతమత మౌతుండగా బరోడాలోని మా కళాశాలకు అరుణ్ శౌరి వచ్చారు. బీజేపీ, వీపీ సింగ్‌ల కూటమి అధికారాన్ని చేపట్టాలనే వాదనకు మద్దతుగా మాట్లాడుతూ ఆయన... ఇల్లు కాలిపోతుండగా మంటలు ఆర్పడానికి గంగాజలమే కావాలని ఎదురు చూడకూడదు అన్నారు. శ్రోతలలోని ఒక విద్యార్థి లేచి... అలా అని మంటల్లో పెట్రోలు చల్లకూడదని శౌరితో అన్నారు.
ఇప్పుడు రాహుల్‌కు పగ్గాలు అప్పగించడం కూడా కాంగ్రెస్‌ను దహించేస్తున్న అగ్నికీలల్లో పెట్రోలు పోయడమే అవుతుందని అనిపిస్తుంది. బ్రిటన్‌లోని ఎలిజ బెత్ మహారాణి తన 67 ఏళ్ల కొడుకు, రాకుమారుడు చార్లెస్ కోసం సింహాసనాన్ని వదులుకోవడానికి సిద్ధపడటం లేదు. ఆయన మంచి రాజు కాలేడని ఆమె భావిం చడమే అందుకు కారణం కావచ్చు. ఆమెలాగే సోనియా కూడా కాంగ్రెస్ అధి నేతగా కొనసాగాలి. అది ఆమె కుమారునికి రుచించకపోవచ్చు, కానీ ఆమె మొదట ఆలోచించాల్సింది పార్టీ గురించి.
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత: ఆకార్ పటేల్
aakar.patel@icloud.com