
అమెరికా ఔన్నత్యాన్ని చాటుతున్న అసమ్మతి
అవలోకనం
గత పాలకుల చారిత్రక తప్పులకు సంబంధించిన జ్ఞాపకాల ప్రభావం వల్లే కావచ్చు... తమ ప్రభుత్వాలు ఏమంత పరిపూర్ణమైనవి కావన్న ఎరుకతోటే, వ్యక్తుల హక్కులను ఉల్లంఘించి నప్పుడు అన్ని సందర్భాల్లో సవాలు చేయాలన్న చైతన్యం అమెరికాలో కలుగుతోంది. ఇదే అమెరికాను ఉన్నతంగా నిలుపుతోంది. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మార్చుతానని ప్రకటించిన ట్రంప్.. బహుశా అమెరికా గొప్పతనం మూలాలను నిజంగానే అర్థం చేసుకోలేదనిపిస్తుంది.
ఏడు దేశాల నుంచి అమెరికాకు ప్రయాణికుల రాకను నిషేధిస్తూ తమ దేశాధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన అసాధారణ ఆదేశంతో చాలా మంది అమెరికన్ల హృదయాలు గాయపడ్డాయి. అమెరికాకు ముస్లింల రాకను అడ్డుకోవడం ద్వారా ఉగ్రవాదాన్ని అంతమొందిస్తానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించగానే ట్రంప్ ఏడు ముస్లిందేశాలపై ఈ నిషే ధాన్ని విధించారు. వీటిలో ఇరాన్, ఇరాక్ కూడా ఉన్నాయి. అమెరికాలో లక్షలాది మంది ఇరాన్ ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇక ఇరాక్ విషయానికి వస్తే తమ సొంత దేశస్థులపైనే జరుగుతున్న యుద్ధంలో చాలామంది ఇరాకీ ప్రజలు అమె రికా పక్షం వహించారు. ఈ జాబితాలో సిరియా కూడా ఉంది. ఇక్కడ జరుగుతున్న హింసాత్మక ఘర్షణల ప్రభావంతో లక్షలాదిమంది దేశం విడిచి పారిపోతున్నారు. ప్రారంభంలో ఈ ఏడు దేశాలకు చెందిన పౌరులనే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిం చింది కానీ, అమెరికాలో శాశ్వత నివాస హక్కులున్న వారిని (గ్రీన్ కార్డు ఉన్న వారు) కూడా నిషేధ జాబితాలో చేర్చేశారు.
పైగా అమెరికాకు పర్యాటకం, వాణిజ్య వీసాలతో వచ్చిన పై ఏడు దేశాల ముస్లిం పౌరులకు కూడా నిషేధాన్ని వర్తింపజేయడంతో అమెరికా విమానాశ్ర యాల్లో కల్లోలం మొదలైంది. అయితే ట్రంప్ వాణిజ్య ప్రయోజనాలు కలిగివున్న సౌదీ అరేబియా వంటి దేశాలకు ఈ నిషేధం వర్తించకపోవడం విశేషం. అయితే నిషేధం విషయంలో కపటత్వం, ఒక పద్ధతీ, పాడూ లేకపోవడానికి మించి, పౌర స్వేచ్ఛ, మానవ హక్కులను ఉల్లంఘించారన్న ఆగ్రహంతోటే చాలామంది అమె రికన్లు నిషేధంపై ఆగ్రహించారు. అమెరికా అంటే స్వేచ్ఛా సమానత్వాలకు పట్టం కట్టే దేశం అనే భావనను అమెరికన్లు ప్రగాఢంగా నిలుపుకుని ఉన్నారు.
ఇలాంటి వారు నిషేధానికి వ్యతిరేకంగా పనిచేయాలని భావించారు. పైగా అమరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏసీఎల్‌యు) మద్దతుతో వీరు పోరుకు దిగారు కూడా. పైగా ఇది అమెరికాలోని ప్రతి ఒక్కరి హక్కులను కాపాడేందుకు అంకితమైన లాభాపేక్ష లేని, పక్షపాతం ఎరుగని న్యాయ, సలహా సంస్థ అని తన్ను తాను అభివర్ణించుకుంది. ట్రంప్ ఆదేశానికి వ్యతిరేకంగా తానెందుకు చర్యలు చేపడుతున్నదీ వివరిస్తూ ఎసిఎల్‌యు తన వెబ్‌సైట్‌లో సింపుల్‌గా ఇలా సమర్థిం చుకుంది. ‘అతడు వివక్ష ప్రదర్శించాడు. మేం దావా వేశాం.‘
ట్రంప్ నిషేధాజ్ఞపై అమెరికా న్యాయమూర్తి ఒకరు స్టే విధించారు. దీనికి తోడుగా చాలామంది న్యాయస్థానాల్లో దాఖలు చేసిన లావాదేవీల ఫలితంగా ట్రంప్ తన నిషేధాజ్ఞను అమలు చేయడం కష్టమవుతుంది. ప్రతిపక్షం దూకుడు కారణంగా ఇప్పటికే గ్రీన్ కార్డుదారులపై విధించిన నిషేధాన్ని వెనక్కు తీసు కున్నారు కూడా. ట్రంప్ నిషేధాజ్ఞకు వ్యతిరేకంగా దావా వేసిన కొద్ది రోజుల్లోనే అమెరికా పౌరహక్కుల సంస్థ రూ.150 కోట్లకు పైగా నిధులు వసూలు చేసింది. దీంట్లో చాలాభాగం చిన్న చిన్న విరాళాల నుంచే వచ్చింది. తన సభ్యుల నెలవారీ విరాళాల నుంచి అది చాలా వరకు నిధులను సమీకరిస్తోంది.
ముస్లిం దేశాలపై నిషేధంతో అమెరికన్లలో కలిగిన తీవ్ర ఆగ్రహం కారణం గానే, ఇతర వ్యక్తులు ఏసిఎల్‌యుకి ఇచ్చే విరాళాలకు సరిసమానమైన విరాళాలను అమెరికన్ సెలబ్రిటీలు ఇస్తామని ప్రతిపాదించారు. అంటే 200 మంది అమెరికన్ ప్రజలు రూ.10 లక్షల విరాళాన్ని ఇచ్చినట్లయితే సెలబ్రిటీ దానికి మరొక రూ. పది లక్షలను తన వంతుగా విరాళం ఇస్తాడు. అంటే ఏసీఎల్‌యుకి రూ.20 లక్షల విరాళం వస్తుందన్నమాట. ఏసీఎల్‌యుని ట్విట్టర్‌లో ఫాలో చేసే ప్రజల సంఖ్యను పెంచడంలో సాయపడాలని మరికొందరు నిర్ణయించుకున్నారు. ఒక వారంలో రెండు లక్షల మంది ఫాలోయర్లు అలా అదనంగా చేరారు. ఈ వ్యాసం మీరు చదు వబోయే సమయానికి వీరి సంఖ్య పది లక్షలను దాటుతుంది.
ట్రంప్ నిషేధాజ్ఞ 1940లలో జరిగిన ఒక ఘటనను పోలి ఉందని పలువురు అమెరికన్లు భావిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో హవాయిలోని అమె రికన్ సైనిక స్థావరంపై జపాన్ సైన్యం దాడి చేసింది. దీంతో అమెరికాలోని జపాన్ సంతతి అమెరికన్లలో చాలామందిని ద్రోహులుగా భావించి నిర్బంధ శిబిరాలలో బంధించారు. ఇది తర్వాత జాతీయ అవమానంగా పరిణమించింది.
అలాంటి చారిత్రక తప్పులకు సంబంధించిన జ్ఞాపకాల ప్రభావం వల్లే కావచ్చు.. తమ ప్రభుత్వాలు ఏమంత పరిపూర్ణమైనవి కావన్న ఎరుకతోటే వ్యక్తుల హక్కులను ఉల్లంఘించినప్పుడు అన్ని సందర్భాల్లో సవాలు చేయాలన్న చైతన్యం అమెరికాలో కలుగుతోంది. ఇదే అమెరికాను ఉన్నతంగా నిలుపుతోంది. అమెరి కాను మళ్లీ గొప్ప దేశంగా మార్చుతానని ప్రకటించిన ట్రంప్.. బహుశా అమెరికా గొప్పతనం మూలాలను నిజంగానే అర్థం చేసుకోలేదనిపిస్తుంది.
అమెరికాలోని ప్రతి ఒక్కరి హక్కులను కాపాడతామని చెప్పే ఏసీఎల్‌యూ తదితర పౌరహక్కుల బృందాలు ఉన్నటువంటి గొప్ప భాగ్యవంతమైన దేశం అమెరికా. భారత్‌కి కూడా ఇలాంటి పౌర బృందాలు ఎంతో అవసరం. రాజకీయ, న్యాయ రంగాలతో సహా అన్ని సెక్షన్ల నుంచి ఇలాంటి బృందాలకు మద్దతు నివ్వా ల్సిన అవసరం కూడా ఉంది. 1962 నాటి చైనా యుద్ధ సమయంలో నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చైనీయ మూలాలున్న వేలాది భారత పౌరులను జైలుపాలు చేశారు. ఆ యుద్ధం కొన్ని వారాల్లోనే ముగిసింది కానీ కలకత్తాలోని తమ స్వగృహాల నుంచి వీరిని నిర్బంధపూరితంగా తీసుకెళ్లి రాజస్తాన్‌లో రెండేళ్ల పాటు ఖైదులో పెట్టారు. దీని గురించి మనలో చాలామందికి తెలీకపోవడం సిగ్గుచేటు.
పైగా మనం భారత్‌లోని అత్యంత బలహీన వర్గాలైన దళితులు, ముస్లింలు, ఆదివాసీల పట్ల నేటికీ అనాగరిక వైఖరిని కొనసాగిస్తూనే ఉన్నాం. మనం కూడా అమెరికన్ విలువల కోసం లక్షలాది అమెరికా పౌరులు మద్దతు తెలుపుతున్న ఏసీఎల్‌యూ వంటి జనాకర్షకమైన, ప్రభావశీలమైన పౌర సంస్థలను ఏదో ఒక రోజు మనం కూడా పొందవచ్చు. మనం ఇతరులకు వ్యక్తిగతంగా అన్యాయం చేసి నప్పుడు భారత్ లోని ఇతరులు అలాంటి చర్యలపట్ల ఆగ్రహం ప్రదర్శించే స్థితి వచ్చినప్పుడు భారత్‌ను ఒక గొప్ప దేశంగా ప్రపంచం ముందు నిలువవచ్చు.
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
ఆకార్ పటేల్
aakar.patel@icloud.com