
‘వినూత్న ఆలోచనలు’ అంటే ఇలాంటివేనా?
అవలోకనం
భారతీయ పౌరులు మరింత మెరుగైన సేవలు అందుకుని, దేశం పురోగతి సాధించడానికి తోడ్పడుతూ.. కొత్తపుంతలు తొక్కించే వినూత్నమైన ఆలోచనలపై కృషి చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన అత్యున్నతాధికారులను ఆదేశించారు. దీనిపై వారు కొన్ని వారాలపాటు నిశితంగా ఆలోచించి ఒక నివేదికను ప్రధానికి సమర్పించాల్సి ఉంది.
వినూత్న ఆలోచనలు అంటే పూర్తిగా తాజా ఆలోచనలు అని అర్థమైనట్లయితే అధికారులకు అవి రావడం కష్టమేనని నా అభిప్రాయం. మనకు తెలిసి ఆధునిక ప్రజాస్వామ్యం వయస్సు 250 ఏళ్లు. (దాని కీలక భావనలు క్రీస్తుకు ముందు 5వ శతాబ్ది నాటి ఏథెన్సుకు సంబంధించినవి). ఆధునిక పౌర ప్రభుత్వం వయస్సు 500 ఏళ్లు ఉండవచ్చు. అంటే పూర్తిగా వినూత్న విషయం ఆవిష్కృతమయ్యేందుకు ఇంకా వేచి ఉండాల్సిరావటం అసంభావ్యం కావచ్చు.
కానీ, సృజనాత్మక ఆలోచనలకు నేటికీ అవకాశం ఉందనటం వాస్తవమే. అలాంటి ఒక ఆలోచనను ప్రధాని గతంలోనే గుజరాత్‌లో ప్రవేశపెట్టారు. గ్రామీణ గృహాలకు, గ్రామీణ పంటపొలాలకు విద్యుత్ సరఫరాను ఆయన పూర్తిగా విభ జించివేశారు. దీంతో ఇళ్లకు నిరంతరాయ విద్యుత్ లభిస్తుంటుంది, వ్యవసాయ మోటార్లు రోజులో కొన్ని గంటలపాటు విద్యుత్తును పొందుతుంటాయి. విద్యుత్ తీగల నష్టాలు (అంటే చౌర్యం అని అర్థం), విద్యుత్తు ఎల్లప్పుడూ తక్కువగానే వస్తున్నందున చార్జీలు ఎందుకు చెల్లించాలంటూ వినియోగదారులు తిరస్కరిం చడం వంటి ప్రత్యేక సమస్యలు తలెత్తే ప్రపంచంలో ఈ సాధారణ ఆవిష్కరణ కూడా చాలా పెద్ద వ్యత్యాసం కలిగివుంటుంది. వినూత్న ఆలోచనలపై ప్రధాని ఆదేశాల గురించి టీఎన్ నీనన్.. బిజినెస్ స్టాండర్డ్‌లో రాస్తూ, అధికారులు తాజా ఆలోచనలతో ముందుకు రావడం అంత సులభం కాదని చెప్పారు.
‘బ్యూరోక్రాట్లు నియమ నిబంధనలను తు.చ. తప్పకుండా అనుసరించడం లోనే శిక్షణ పొంది ఉంటారు తప్ప వీరు సమస్యల పరిష్కారకర్తలు కారు. అందుకే నూతన ఆలోచనలు సాధారణంగా రాజకీయనేతలు, టెక్నోక్రాట్లు, పౌర సమాజ కార్యకర్తలనుంచే వస్తుంటాయి’ అని నీనన్ రాశారు. సబ్సిడీ బియ్యం పథకం, మధ్యాహ్న భోజన పథకం, సమాచార హక్కు వంటివి వెలుపలినుంచి వచ్చిన ఆలోచనలుగా తను పేర్కొన్నారు. అందుకే పెద్ద విషయాలన్నీ శాసన రూపంలోనే అమల్లోకి వచ్చాయని నా అభిప్రాయం. ఏకీకృత పన్ను వ్యవస్థ లేదా మరింత సమర్థవంతమైన భూసేకరణ చట్టం అనేవి భారత ఆర్థిక పనితీరును నాటకీయం గానే మెరుగుపరుస్తాయని ఎవరైనా వాదించవచ్చు కానీ దీన్ని నేను అంగీకరించ లేను.
ఇవి నాటకీయ మార్పు కంటే, సమర్థతను ముందుపీటికి తీసుకువచ్చే చిన్న అంశాలు మాత్రమే. భారత్‌లో పనిచేయకుండా ఉన్న ప్రధానమైన విషయం ఒక్కటి మాత్రమే. అది సుపరిపాలన అంటూ మోదీ చెబుతున్నటువంటి, అమ లుకు సంబంధించిన పరిమితమైన విషయం కాదు. నేను ఇంతకు ముందు రాసిన దాన్నే మళ్లీ చెప్పాల్సి ఉంటుంది. వ్యక్తిగత ప్రవర్తన, నైతిక వర్తనలో మార్పు తీసు కురావడం అనేది ప్రభుత్వ వ్యవహార పరిధికి సంబంధించినది కాదు. ఉదా హరణకు స్వచ్ఛ భారత్ అభియాన్‌నే తీసుకుందాం. మోదీ స్వయంగా వీధుల్లో చీపురు పట్టుకుని చెత్త ఊడుస్తూ ప్రమోట్ చేసిన పథకం ఇది. భారతీయులు మరింత పరిశుభ్రంగడా ఉండాలనడం గొప్ప విషయమే కానీ, అది ప్రభుత్వం చేయవలసిన పనా? నేనయితే అలా భావించడం లేదు.
ఇది సామాజిక సంస్కరణ. దీన్ని ప్రభుత్వ అధికారులు, మంత్రులు కాకుండా సమాజం లోపలే, మత విభాగాలు వంటి సంస్థలు చేయవలసి ఉంది. అందుకే మోదీ వాస్తవంగా ఆశిస్తున్న ప్రధాన మార్పు దాన్ని అమలుపర్చగలిగేట టువంటి ఆయన అధికారం వల్ల రాదు. భారత్‌పై అధ్యయనం చేసి ఇద్దరు ఎంఐటీ ప్రొఫెసర్లు రాసిన ‘పూర్ ఎకనమిక్స్’ (పేదరిక అర్థశాస్త్రం) అనే పుస్తకం మోదీ చదువవలసిన కొన్ని పుస్తకాలలో ఒకటి అని నీనన్ రాశారు.
పోతే, ఇద్దరు విద్యావేత్తలు (ఈషర్ డుఫ్లో, అభిజిత్ బెనర్జీ) తమ పరీక్షల్లో భాగంగా, అయిదు ప్రధాన వ్యాధులకు సంబంధించిన ప్రామాణిక రోగ లక్షణాలు న్నట్లు చెప్పుకునే కొందరు నటులను ప్రభుత్వ వైద్యుల వద్దకు పంపించారు. దిగ్భ్రాంతి కలిగించే విషయమేమిటంటే ఈ రోగుల వ్యాధిని నూటికి 97 శాతం వరకు వైద్యులు సరిగా నిర్ధారించలేకపోయారు. ఎందుకంటే రోగుల పట్ల వీరికేమాత్రం పట్టింపు లేదు. సగటున ఒక్కో రోగిని 60 సెకనుల కంటే ఎక్కువగా వీరు పరీక్షించలేదు. కేవలం మూడు శాతం సందర్భాల్లో మాత్రమే వైద్యులు తమ రోగుల వ్యాధిని సరిగ్గా నిర్ధారించే పరిస్థితుల్లో, మీరు చికిత్స చేయించుకోవడానికి బదులు ఇంటిపట్టునే ఉండటం ఉత్తమం.
భారత్‌లో పనిచేసిన హార్వర్డ్ విద్యావేత్త లాంట్ ప్రిచెట్ కూడా భారత ప్రభుత్వంతో ముడిపడిన సమస్యలకు సంబంధించి మరొక రెండు ఉదాహర ణలను చూపారు. మొదటి ఉదాహరణ: ఢిల్లీలోని రోడ్డు రవాణా ఆఫీసులో (ఆర్టీవో) డ్రైవింగ్ లెసైన్సు కోసం వచ్చిన ఒక బ్యాచ్ అభ్యర్థులను ఈయన పరిశీలించి కనుగొన్న విషయం ఏమిటంటే, లంచం ఇవ్వకపోతే డ్రైవింగ్ పరీక్షలో మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారనే. మీరు లంచం ఇస్తే, డ్రైవింగ్ పరీక్షకు హాజరుకాకున్నప్పటికీ మీకు తప్పకుండా లెసైన్స్ వస్తుంది. దీని అర్థం ఏమిటి? మీరు చట్టప్రకారం నడచుకుంటే మీరు శిక్షకు పాత్రులవుతారు. అదే మీరు లంచం ఇస్తే, వాహనాన్ని డ్రైవ్ చేయవలసిన అవసరం కూడా ఉండదు.
ఈ తరహా లంచగొండితనం ఎంత వ్యవస్థీకృతంగా తయారయిందంటే, ఆర్టీవో సిబ్బందికి నేరుగా ముడుపులు ముట్టవు. ఇది ఎంత సమర్థంగా అమలవుతుందంటే, ప్రతిభావంతులైన డ్రైవర్లను మినహాయిస్తే, రోడ్డు రవాణా కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ లెసైన్స్ కోసం ముడుపులు చెల్లించుకోవలసిందే.
ప్రిచెట్ పేర్కొన్న మరొక ఉదాహరణ ప్రకారం, రాజస్థాన్‌లో నర్సులు పని చేయరని పరిశోధనలో తేలింది. వీరిలో సగంమంది ఇంటి వద్ద ఉంటూనే లేదా మరొక పని చేసుకుంటున్నప్పటికీ తమ వేతనాలను మాత్రం క్రమం తప్పకుండా అందుకుంటున్నారని కనుగొన్నారు. నర్సుల హాజరును పర్యవేక్షించే వ్యవస్థను అమలు చేయడం ద్వారా దీంట్లో మార్పు తీసుకురావాలని ఒక ఎన్జీఓ సదుద్దేశంతో ప్రయత్నించింది కాని విఫలమైంది. అప్పుడు కూడా నర్సులు తమ పనికి దూరంగా ఉండటాన్ని కొనసాగించారు. కానీ వారి గైర్హాజరీని తనిఖీ చేసిన ప్రతి సారీ తాము రాకపోవడానికి అధికారికంగానే వారు సంజాయిషీ చెప్పుకున్నారు.
భారత్‌లోని వ్యవహారాలతో పరిచయం ఉన్న వారికి ఇవేవీ దిగ్భ్రాంతి కలిగిం చవు. ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థ కుప్పగూలిపోయింది లేదా తన క్రియాత్మక తను కోల్పోయింది. మీరు పోలీసు స్టేషన్‌ను లేదా ఫుట్‌పాత్ అంచును పరిశీలించినా ఇది నిజమేనని తేలుతుంది. అయితే ఒకవైపు న్యూఢిల్లీ నిజమైన పరిష్కారాలను ప్రతిపాదించనున్నప్పుడు మనం దీన్ని ప్రభుత్వ సమస్యగా చూడవచ్చా? లేదా సమాజ సమస్యగా చూడవచ్చా? నేనయితే రెండో దానికే మద్దతిస్తాను. అందుకే ప్రభుత్వం, బ్యూరోక్రాట్లు సదుద్దేశంతో దీన్ని మార్చాలనుకున్నా సాధ్యంకాదు.
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com