బెంగళూరు: ప్రముఖ పాత్రికేయుడు, చరిత్రకారుడు, ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా మాజీ అధ్యక్షుడు ఆకార్ పటేల్‌కు బుధవారం బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికా పయనమైన ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.
విదేశాలకు వెళుతున్న తనను అడ్డుకోవడంపై ట్విటర్‌లో ఆకార్ పటేల్ స్పందించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై మోదీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు కారణంగా తాను లుక్ అవుట్ సర్క్యులర్‌లో ఉన్నట్టు సీబీఐ అధికారి ఫోన్ చేసి చెప్పారని వెల్లడించారు. అమెరికా పర్యటన కోసం గుజరాత్ కోర్టు నుంచి అనుమతి పొందానని, కోర్టు ఆర్డర్‌తో తన పాస్‌పోర్ట్‌ను కూడా తిరిగి తీసుకున్నానని తెలిపారు.
అయితే ఆకార్ పటేల్‌పై లుక్‌అవుట్ నోటీసు ఉందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. రూ. 36 కోట్ల విదేశీ నిధులకు సంబంధించి.. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలు ఉల్లంఘించారన్న నేపథ్యంలో ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా, ఇతరులపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే లుక్‌అవుట్ నోటీసు జారీ అయింది. అయితే గతేడాది గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆకార్ పటేల్.. అమెరికా వెళ్లేందుకు సూరత్ కోర్టు అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని సీబీఐ కోర్టును ఆకార్ పటేల్ ఆశ్రయించారు. దీనిపై స్పందన తెలియజేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఆకార్ పటేల్ పిటిషన్‌పై గురువారం ఉదయం విచారణ జరిగే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment