భారత్ బంద్‌లో పాల్గొన్న దళితులు (ఫైల్ ఫొటో)
హిందువులందరినీ రాజకీయంగా, సాంస్కృతికంగా ఏకం చేయడం బీజేపీ ప్రధానోద్దేశం. కానీ అది ఆచరణ సాధ్యమేనా? అందుకు అడ్డుపడుతున్న అంశాలేమిటి? బీజేపీకి సహజ మిత్రులైన ఆధిపత్య కులాలే ఇందుకు ప్రధాన అడ్డంకి. దళితులకు రిజర్వేషన్‌ల సదుపాయం కల్పించడం ఆ వర్గాల రక్షణకు చట్టం ఉండటం ఆధిపత్య కులాలకు సమ్మతం కాదు.
దళితులతో సాన్నిహిత్యం పెంచుకోవాలని తన పార్టీ ఎంపీలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్నారు. అంబేడ్కర్ జయంతి రోజైన ఈ నెల 14 సమయానికి దళితులు అధికంగా ఉండే గ్రామాల్లో ప్రతి ఎంపీ రెండు రాత్రుళ్లు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అంబేడ్కర్‌ను గౌరవించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నది బీజేపీయేననే విషయం పార్టీ ఎంపీలందరూ వారికి చెప్పాలని కూడా మోదీ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులు వీధుల్లోకి రావడాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ విధమైన సూచన చేస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు. హిందుత్వ గత మూడేళ్లుగా వ్యాప్తి చెందుతున్న తీరు పర్యవ సానంగానే తమ రక్షణకు ఉద్దేశించిన ప్రత్యేక చట్టాన్ని సుప్రీంకోర్టు నీరుగార్చిందని దళితులు విశ్వసిస్తున్నారు.
పార్టీ హృదయంలో వారి ప్రయోజనాలపట్ల ప్రత్యేక శ్రద్ధ ఉన్నదని ప్రతీకాత్మకంగా తేటతెల్లం చేయడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుం దన్నది మోదీ ఆలోచన. ఇది సరిపోతుందా? సమస్యల పరిష్కర్తలుగా, శ్రేయోభి లాషులుగా భావించుకుంటున్న బీజేపీ దృక్కోణం నుంచే దీన్ని పరిశీలిద్దాం. హిందువులందరినీ రాజకీయంగా, సాంస్కృతికంగా ఏకం చేయడం బీజేపీ ప్రధా నోద్దేశం. ఇది ఆ పార్టీ సిద్ధాంతం. దీన్ని అది సంపూర్ణంగా విశ్వసిస్తోంది. మరి దీన్నెలా ముందుకు తీసుకుపోవాలి? హిందువుల ‘సంఖ్య’ ఎంతన్నది స్పష్టంగా చెప్పడం అంత సులభం కాదు. ఎందుకంటే, సిక్కులు, జైనులు(బహుశా ఇప్పుడు లింగాయత్‌లు కూడా) తమను తాము హిందువులుగా భావించుకోరు. అయినా వారందరినీ హిందువులనుకుందాం. అలా అనుకుంటే దేశంలో 85 శాతం జనా భాను అది ఏకం చేయాల్సి ఉంటుంది.
పదిహేను శాతంగా ఉన్నవారికి వ్యతిరేకంగా 85 శాతంమందిని ఏకం చేయ డం చాలా సులభం. ఉపఖండంలో సాధారణంగా జరుగుతున్నది అదే. దక్షిణా సియా దేశాల్లోని మైనారిటీలందరూ ఐక్యతతో వ్యవహరించే 85 శాతంమంది చేతుల్లో వేధింపులకు గురవుతున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ లేదా శ్రీలంక దేశాల్లో మైనారిటీలకు చట్టసభల్లో, ప్రభుత్వాల్లో, సాయుధ దళాల్లో, ఆఖరికి ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం చాలా తక్కువుంటుంది. అందరూ వారిని శత్రువులుగా పరిగణిస్తారు గనుక ఇళ్లు దొరకడం కూడా కష్టమే. ఇక అంతర్గతంగా ఎన్నో అంతరాలుండే 85 శాతం మందిని ఏకం చేయడంలోని సమస్యలేమిటో చూద్దాం. దళిత ఉద్యమం దీన్నే ముందుంచింది. భాష, ఆహారం, సంగీతంలాంటి కనీస అంశాల్లో కూడా ఏకత సాధించడం అంత సులభమేమీ కాదన్నది వాస్తవం. మనం లతా మంగేష్కర్‌ను సులభంగా ఈ దేశానికి ప్రతీకగా చూడగలం తప్ప ఎమ్మెస్ సుబ్బలక్ష్మిని కాదు. బాలీవుడ్, క్రికెట్ ఈశాన్య భారతీయులకు అంత ఆసక్తికరమైనవి కాదు. జాతీయ వాదం మనల్ని ఏకం చేస్తుంది.
కానీ బయటివారికి వ్యతిరేకంగా మాత్రమే అది ఏకం చేయగలదు. మరి మనమధ్య సమస్యలున్న ప్పుడు ఏం జరుగుతుంది? హిందుత్వ హిందువులందరినీ తన షరతుల ప్రాతి పదికన మాత్రమే ఏకం చేయాలనుకుంటున్నది. ఉదాహరణకు దాని దృష్టిలో ‘హిందు’ అంటే గొడ్డు మాంసం తిననివారు... ఇంకా చెప్పాలంటే శాకాహారులు. మాంసాన్ని భుజించే గుజరాతీ కులం నుంచి నరేంద్ర మోదీ వచ్చారు. ఆయన ఆ సంస్కృతిని విడనాడి ఆరెస్సెస్ ఛత్రఛాయలోకి రావడం వల్ల మోదీకి ఆమోదనీ యత లభించింది. ఆయన గొడ్డు మాంసం తినే ఆదివాసీ అయివుంటే మోదీని గుజరాత్ సీఎంగా చేయడం ఆరెస్సెస్‌కు సులభం కాదు. కెబి హెడ్గేవార్, లక్ష్మణ్ పరంజపే, గురూజీ గోల్వాల్కర్, బాలాసాహెబ్ దేవరస్, రాజేంద్ర సింగ్, కెఎస్ సుదర్శన్ ఆరెస్సెస్ చీఫ్‌లుగా పనిచేశారు. ఆ సంస్థకు ప్రస్తుత చీఫ్ మోహన్ భాగ వత్. వీరిలో ఠాకూర్ అయిన రాజేంద్రసింగ్ మినహా మిగిలినవారంతా బ్రాహ్మ ణులు. ఒక దళితుణ్ణో, ఒక ఆదివాసీ మహిళనో సర్‌సంఘ్‌చాలక్‌గా నియమించ మని బీజేపీ ఆరెస్సెస్‌కు సూచించగలిగితే మంచిది.
హిందువులను ఏకం చేయడంలో బీజేపీ ఎదుర్కొనే మరో సమస్య దానికి సహజమిత్రులైన ఆధిపత్య కులాలే. ఇవి మౌలికంగా దళితుల హక్కులకు వ్యతి రేకం. ఈ కులాలు దళితుల, ఆదివాసీల రిజర్వేషన్లకు మద్దతిస్తాయా? ‘కాదు’ అన్నదే జవాబు. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు వీరి ప్రయోజనాలను దెబ్బతీస్తు న్నాయి. ఈ ప్రాథమిక అంతరాన్ని హిందూ ఐక్యత మాటున దాచి ఉంచడం సాధ్యం కాదు. రిజర్వేషన్లను తీసేస్తామంటే బీజేపీలోని దళిత లేక ఆదివాసీ ఎంపీల్లో ఒక్కరు కూడా మద్దతు ఇవ్వరు. షెడ్యూల్ కులాల, తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం మూలాల్లోనూ ఇదే సమస్య ఉంది. సుప్రీంకోర్టు ధైర్యంగా ఈ అంశంలోకెళ్లి తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా దళితులు, ఆదివాసీలు తిరగ బడ్డారు. ఆధిపత్య హిందూ కులాల వేధింపుల నుంచి ఈ చట్టం తమకు రక్షణగా నిలుస్తుందని వారు భావిస్తున్నారు. ఈ చట్టం సరిగా అమలు కావడం లేదన్నది, పోలీసులతో కేసు నమోదు చేయించడం కూడా ఓ పట్టాన సాధ్యం కావడం లేద న్నది వాస్తవం.
అయినా కూడా ఇది కాగితంపై ఉండటం అవసరం. కానీ న్యాయ స్ధానమిచ్చిన తీర్పు దాన్ని బలహీనపరిచింది. ఈ విషయంలో కూడా పైనుంచి కిందివరకూ చీలిక ఉంది. ఆధిపత్య కులాల్లో ఎంతమంది ఈ తీర్పును వ్యతిరేకి స్తారు? చట్టం అమలు వల్ల బాధిత వర్గాలు ఆధిపత్య కులాలే గనుక చాలా తక్కు వమంది మాత్రమే వ్యతిరేకిస్తారు. ఈ చట్టం దళితులకు, ఆదివాసీలకు బలాన్ని చ్చింది. మనలో చాలామందికి అది అభ్యంతరకరం. ఇలాంటి పరిస్థితుల్లో ‘సబ్ కా వికాస్’ (అందరి వికాసం) సాధ్యం కాదు. బలమైనవారు రాయితీలకు అంగీకరి స్తేనే బలహీనులు ప్రగతి సాధించగలుగుతారు. కానీ ఇలా జరగటం లేదు. ఆరె స్సెస్ చీఫ్ లేదా మరొకరు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యానాలు ఎన్ని సార్లు బీజేపీని ఇరకాటంలో పడేశాయో చూడండి. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తానని కేంద్రం చెప్పింది. కానీ ఇందులో దృఢ సంకల్పం లేదు. పరిస్థి తుల్ని చూసి కలవరపడుతున్నది గనుక ఇలా చేసిందన్నది సుస్పష్టం.
సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఈ వారం వివిధ సంస్థలు నిర్వహించిన సదస్సులో నేను పాల్గొన్నాను. ప్రసంగించినవారిలో ఒకరైన సీపీఐ ఎంపీ డి. రాజా... అంబేడ్కర్‌ను గౌరవించిన పార్టీ బీజేపీయేనని మోదీ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించారు. ‘అంబేడ్కర్‌కు కొత్తగా మీరెలాంటి గౌరవమూ ఇవ్వనవసరం లేదు. దళితులకు చేస్తున్నదేమిటో చెప్పాల’ని నిలదీశారు. ఇది నేరుగా తాకే ప్రశ్న. ప్రభుత్వం నిజంగా దళితుల పక్షాన ఉండదల్చుకుంటే చేయాల్సిందేమిటో దానికి తెలుసు. ఎంపీలు రెండు రాత్రుళ్లు ఒక పల్లెలో గడపవలసిన అవసరం లేదు.
ఆకార్ పటేల్, వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com
Comments
Please login to add a commentAdd a comment