‘జాతీయవాద’ చట్రంలో చిక్కిన క్రికెట్
భారత ఉపఖండానికి చెందిన జట్లు ఆడే క్రికెట్ క్రీడను జాతీయవాద దృక్పథంతో చూడటమే సమస్య. ప్రత్యర్థి జట్లు బౌండరీలు కొట్టినా లేదా వికెట్లు తీసుకున్నా స్టేడియంలు నిశ్శబ్దంగా మారుతాయి. అన్ని జట్ల విషయంలోనూ ఇది జరిగేదే. కాకపోతే భారత్–పాకిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ల విషయంలో ‘శత్రు’ జట్టుపై ప్రేక్షకుల కోపం మరింత ఎక్కువ. చెప్పుకోదగిన ప్రయోజనమేదీ పెద్దగా లేకపోయినా ఎదురెదురుగా నిలిచి అపకుండా కాల్పులు సాగిస్తుండే సేనల స్థానంలో గొంతులు చించుకుని దూషించే పౌరులు నిలుస్తారు.
భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు పరస్పరం తలపడుతుంటే చూసి ఇరు దేశాల ప్రజలు ఆనందిస్తారా? మనం ఇక ఎంత మాత్రమూ ఆ అనుభూతిని ఇష్టపడటం లేదనే నమ్మకానికి వచ్చేశాను. అలా ఆనందించడం ఒకప్పటి సంగతి కావచ్చు గానీ, ఇంచుమించు గత 25 ఏళ్లుగా పరిస్థితి అలా లేదు. ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర విద్వేషం, అయిష్టం క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సందర్భాల్లో అధికంగా ఉంటాయి. మీడియా కారణంగా అవి కట్టలు తెంచుకునే స్థాయిలో నిలుస్తాయి.
ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు భిన్నంగా క్రికెట్ ఆట రోజంతా లేదా ఐదు రోజుల పాటూ సాగుతుంది, బాధ లేదా విజయోత్సాహం భావన దీర్ఘంగా విస్తరిస్తాయి. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లు ఆడటం ఒకప్పుడైతే కోరుకోదగిన మంచి విషయమే. కానీ, ఇప్పుడు రెండు జట్లూ ఒకదానితో మరొకటి తలపడటం ఇంచుమించుగా మానేశాయి. కాబట్టి ఈ చేదు అనుభవం టీ20లకు, వన్డే ఇంటర్నేషనల్స్‌కు మాత్రమే, అది కూడా తటస్థ మైదానాలలో జరిగే వాటికే పరిమితమైంది.
భారత ఉపఖండంలోని జట్లు ఆడే క్రికెట్ క్రీడను జాతీయవాద దృక్పథంతో చూడటం, మెచ్చుకోవడం అనేదే దీనికి సంబంధించిన మొదటి సమస్య. ప్రత్యర్థి జట్లు బౌండరీలు కొట్టినప్పుడు లేదా వికెట్లు తీసుకున్నప్పుడు స్టేడియంలు నిశ్శ బ్దంగా మారుతాయి. అన్ని జట్ల విషయంలోనూ ఇది జరిగేదే. కాకపోతే భారత్– పాకిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ల విషయంలో ‘శత్రు’ జట్టుపై ప్రేక్షకుల కోపం మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రత్యర్థి జట్ల మధ్య ఉండే స్నేహపూర్వక వాతా వరణం, సరదాగా ఆటపట్టించడం వంటి ఇతర అంశాలు స్టేడియంలో క్రీడలను చూడటాన్ని ఆనందదాయకంగా చేస్తాయి. ఉపఖండంలో జరిగే పోటీల్లో అది పూర్తిగా కొరవడుతుంది. క్షేత్రస్థాయిలో చెప్పుకోదగిన ప్రయోజనమేదీ పెద్దగా లేక పోయినా ఎదురెదురుగా నిలిచి ఆగకుండా కాల్పులు సాగిస్తుండే సేనల స్థానంలో గొంతులు చించుకుని దూషించే పౌరులు ఉంటారు (వారు కూడా తమ తమ జట్ల రంగుల యూనిఫారాల్లో ఉంటారు).
గుజరాతీలు క్రీడలకు సంబంధించి అదనంగా మరో అంశాన్ని చేర్పు చేశారు. జాతీయత ఆవహించి ఉన్న సందర్భంలోనూ అది పని చేస్తుంటుంది. ఒకప్పుడు నేను మహా జోరుగా పందేలు (బెట్టింగ్‌లు) కాసేవాడ్ని (ఇప్పుడిక ఎంత మాత్రం చేయడం లేదు). ఒక సాయంత్రం మా బావమరిది సందీప్ ఘోష్ మా ఇంటికి వస్తున్నారు, అప్పుడు భారత్, శ్రీలంకతో ఆడుతోంది. ఆయన లంకపై పందెం కాయాలనుకున్నారు. ఆ పందెం కాయమని చెప్పడానికి నేను బుకీకి ఫోన్ చేశాను. ఆ పని ముగించాక, భారత్‌కు వ్యతిరేకంగా ఎందరు పందేలు కాసి ఉంటారా? అని మాకు ఆశ్చర్యం కలిగింది. గుజరాతీలు తమ ఉద్వేగాలను వ్యాపారానికి దూరంగా ఉంచుతారు. కాబట్టి చాలా మందే కట్టి ఉంటారని అనుకున్నాం.
నేను మళ్లీ బుకీకి ఫోన్ చేసి అడిగితే దాదాపు ఓ యాభై మంది ఉంటారని, ఘోషే మొదటివాడని చెప్పాడు. బాగా పందేలు కాసే గుజరాతీలు సైతం జాతీ యవాదం వెంటపడి పోయి, తమ డబ్బుతో కూడా భారత్‌కు మద్దతు తెలుపు తున్నారని దీని అర్థం. ఆ మ్యాచ్‌లో లంక గెలిచింది. ఇకపోతే, పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ల విషయంలో అ పందేలు కట్టే అంశం కూడా దాదాపుగా అంతరించి, పరిస్థితి ఇంచుమించు యుద్ధంలా మారింది.
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం భారత్–పాక్ మ్యాచ్‌లను చూడటం ఆనందదాయకంగా ఉండగా జరిగిన ఒక మ్యాచ్ గుర్తుకు వస్తోంది. అప్పుడు మియాందాద్, ఇమ్రాన్‌ఖాన్‌ల క్రీడా నైపుణ్యం తారస్థాయిలో ఉండేది, కపిల్‌దేవ్ అప్పుడే గవాస్కర్ నేతృత్వంలోని భారత జట్టులో చేరాడు. క్రికెట్ క్రీడ ఇబ్బం దికరంగా మారడం మొదలైన తొలి మ్యాచ్‌లలో ఒకటి భారత్–వెస్టిండీస్‌ల మధ్య 1983 అక్టోబర్లో శ్రీనగర్‌లో జరిగింది. ప్రేక్షకులు భారత్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు, ప్రేక్షకుల నుంచి తమకు లభించిన మద్దతుకు వెస్టిండీస్ జట్టు నిర్ఘాంత పోయింది. గవాస్కర్ తన ‘‘రన్స్ ఎన్ రన్స్’’లో ఆ ఆనుభవాన్ని వర్ణించారు.
ప్రేక్ష కులు ఇమ్రాన్‌ఖాన్ పోస్టర్లను పట్టుకుని ఉండటం గురించి రాశారు. నాతో సహా చాలా మంది భారతీయులకు కశ్మీర్‌లో పరిస్థితి సాధారణంగా లేదనే విషయం తెలిసింది అప్పుడే. గవాస్కర్ అనుభవానికి కారణం మరి దేనికన్నా ఎక్కువగా భారత వ్యతిరేకతేనని నా భావన. అది అవహేళనే. అయితే ఆయన దాన్ని సరైన రీతిలో స్వీకరించారు. గవాస్కర్ ప్రేక్షకులకు ముందు తనను, తర్వాత మైదానాన్ని చూపి, అటుపిమ్మట ఇమ్రాన్ పోస్టర్‌ను, ఆకాశాన్ని చూపినట్టు ఆయన రాశారు. తన సైగలకు ప్రేక్షకులు పెద్దగా హర్షధ్వానాలు చేశారని పేర్కొన్నారు.
మార్చి 2004లో ముల్తాన్‌లో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ అక్తర్, మోహ్మద్ సమీల బౌలింగ్‌ను ఎదుర్కొని వీరేంద్ర సెహ్వాగ్ త్రిశతకం చేశాడు. ఆ సమ యంలో నేను, ఒక పాకిస్తానీ స్నేహితునితో కలసి స్టేడియంలోనే ఉన్నాను. ఆ మ్యాచ్ జరుగుతుండగా మమ్మల్ని భారతీయులుగా గుర్తించిన ప్రేక్షకులు ఆటోగ్రా ఫ్‌లను కోరుతూ మా వద్దకు వచ్చారు. అటల్ బిహారీ వాజపేయి, పర్వేజ్ ముష ర్రఫ్‌ల చొరవతో జరిగిన ప్రెండ్‌షిప్ సిరీస్ సందర్భంగా అది జరిగింది. కార్గిల్‌లో, ఒక్కో పక్షాన దాదాపు 500 మంది మరణించిన పెద్ద యుద్ధాన్ని సాగించిన నేతలు వారు. వాజపేయి ప్రధాని, ముషర్రఫ్ ఆర్మీ చీఫ్. ఇరువురూ తమ ఆయుధాలను, అణు కార్యక్రమాలను ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన వారే.
అంతేకాదు, అది కశ్మీర్‌లో అత్యధికంగా హింస చెలరేగిన కాలం కూడానని గుర్తుంచుకోవాలి. జమ్మూకశ్మీర్‌లో 2016లో సంభవించిన మరణాలతో (267) పోలిస్తే, 2001లో అంతకు 20 రెట్లు (4,507) మరణించారు. కశ్మీర్‌లో పరిస్థితులు మరింతగా విషమించాయని మనం విశ్వసించేట్టయితే అందుకు కారణాలు క్షేత్రస్థాయిలోని వాస్తవాలు మాత్రం కాదు. రాజకీయాలు, మీడియా అందుకు కారణం. జమ్మూకశ్మీర్‌లో నాటితో పోలిస్తే హింస తక్కువగా ఉన్న ఈ రోజుల్లో అలాంటి సిరీస్ జరగడమనే ఆలోచనే అద్భుతంగా ఉంటుంది. కానీ నేడు ఇరు దేశాల జనాభాల మనసుల్లో నెలకొని ఉన్న హింస, ఆనాడు నిజంగా చెలరేగిన హింస కంటే ఎక్కువగా ఉంది.
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
‘ aakar.patel@icloud.com