
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025), దానికి ముందు స్వదేశంలో జరిగే ముక్కోణపు సిరీస్ కోసం 15 మంది సభ్యుల పాకిస్తాన్ (Pakistan) జట్టును ఇవాళ (జనవరి 31) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మొహమ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan) వ్యవహరించనుండగా.. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) సల్మాన్ అలీ అఘా ఉండనున్నాడు.
గతేడాది చివర్లో సౌతాఫ్రికాతో ఆడిన పాక్ జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. గాయపడిన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ సైమ్ అయూబ్ ఈ జట్టుకు ఎంపిక కాలేదు. ఫామ్‌లో లేని అబ్దుల్లా షఫీక్, మెహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, సుఫియాన్ ముఖీమ్‌లపై పాక్ సెలెక్టర్లు వేటు వేశారు.
పైన పేర్కొన్న నలుగురి స్థానాల్లో ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్, ఖుష్దిల్ షా, సౌద్ షకీల్ జట్టులోకి వచ్చారు. ఈ జట్టులో 2017 టైటిల్ (ఛాంపియన్స్ ట్రోఫీ) విన్నింగ్ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు (బాబర్ ఆజం, ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్) చోటు దక్కించుకున్నారు. పాక్ జట్టు పేస్ విభాగాన్ని షాహీన్ అఫ్రిది ముందుండి నడిపించనున్నాడు. ఈ జట్టు పేస్ దళంలో మొహమ్మద్ హస్నైన్, నసీం షా, హరీస్ రౌఫ్ ఉన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో కలిసి ముక్కోణపు సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 8న ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 14న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ సిరీస్‌లో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన తొలి రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి.
ముక్కోణపు సిరీస్ షెడ్యూల్
ఫిబ్రవరి 8- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (లాహోర్)
ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లాహోర్)
ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (కరాచీ)
ఫిబ్రవరి 14- ఫైనల్ (కరాచీ)
ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ పాక్, దుబాయ్ వేదికలుగా జరుగనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. పాక్.. ఫిబ్రవరి 19న జరిగే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 20న భారత్.. బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది.
ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరిసారిగా 2017లో జరిగింది. నాటి ఎడిషన్‌లో పాక్ విజేతగా నిలిచింది. త్వరలో ప్రారంభమయ్యే ఎడిషన్‌లో పాక్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.
ముక్కోణపు సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్తాన్ జట్టు:
మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది.
Comments
Please login to add a commentAdd a comment