
చేయూత కోసం ‘చేయి’ ఆరాటం
అవలోకనం
ఎన్నికల ప్రయోజనాల కోసమే స్వార్థ చింతనతో ఒక కులాన్ని ఆకర్షించడం ఏ రాజకీయ పార్టీకయినా అనుకున్నంత సులభమేమీ కాదు. అలా ఆకర్షించాలంటే వాళ్లకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఏమివ్వగలదు? బ్రాహ్మణ అభ్యర్థులకు ఆ పార్టీ టికెట్లయితే కేటాయించగలదు. తరువాత ఏమిటి? కాంగ్రెస్ రాజకీయాలు బ్రాహ్మణులను తన వైపు తిప్పుకుంటాయా?
రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోబోతున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అనుసరించవలసిన వ్యూహం ఎలా ఉండాలి? ఉత్తరప్రదేశ్ అంటే దేశంలోనే పెద్ద రాష్ట్రం (21 కోట్ల జనాభా ఉన్న ఆ రాష్ర్టం దానికదే ప్రపంచంలో ఐదో పెద్ద దేశం). ఈ సమస్యను పరిష్కరించి ఒక మంచి ఎన్నికల పథకాన్ని రూపొందించి పెట్టడానికి భారతదేశంలోనే అతి సునిశిత రాజకీయ మేధావులలో ఒకరిగా పేర్గాంచిన ప్రశాంత్ కిశోర్‌ను నియమించుకున్నారు రాహుల్ గాంధీ. ఇంతకీ ఈ కిశోర్ ఎవరంటే 2014 ఎన్నికలలో నరేంద్ర మోదీకీ (చాయ్ పే చర్చ ఆలోచన ఈయనదేనన్నది సుస్పష్టం), తరువాత 2015లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమ యంలో నితీశ్ కుమార్‌కీ ఎన్నికల వ్యూహాలను రచించి పెట్టిన వ్యక్తే. ఆయనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావడానికి సంబంధించిన వ్యూహం ఆలోచించిపెట్టే పనిలో ఉన్నారు.
ఇప్పటిదాకా అందిన వార్తల ప్రకారం రెండు వ్యూహాలను కిశోర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచారు. అందులో మొదటిది- బ్రాహ్మణుల ఓట్ల కోసం వల వేయడం. రెండోది-ముఖ్యమంత్రి అభ్యర్థిగా గాంధీలలో ఒకరిని, అంటే రాహుల్ లేదా ప్రియాంక గాంధీల పేరును ప్రతిపాదించడం.
రెండో వ్యూహం ఎంతమాత్రం ఆమోదించడానికి వీలుకానిది. ఒక ప్రాంతీయ నాయకుడి స్థాయికి దిగడానికీ, అలాంటి పదవి చేపట్టడానికీ గాంధీలకి అహం అడ్డువస్తుంది. నిజానికి గడచిన లోక్‌సభ ఎన్నికల సమయంలో అసలు నరేంద్ర మోదీతో రాహుల్‌ను పోల్చడానికే కాంగ్రెస్ వర్గాలు ససేమిరా అన్నాయి. ప్రాంతీయ నాయకుడైన మోదీ ఎక్కడ? జాతీయ నాయకుడైన రాహుల్ ఎక్కడ? అని ఆ పార్టీ చెమ్చాలు అహంకరించాయి. దీనికి మోదీ ఎంతో తెలివిగా ఇచ్చిన సమాధానం- నిజమే, రాహుల్ జాతీయ నాయకుడేమిటి; ఇటలీ సంబంధాలను బట్టి ఆయన అంతర్జాతీయ నాయకుడు కూడా, అని.
కిశోర్ ప్రతిపాదించిన మొదటి వ్యూహమే చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ వెనుక యాదవులు ఉన్నట్టు, మాయావతి వెంట దళితులు నడుస్తున్నట్టు, అగ్రకులాలు బీజేపీకి మద్దతు పలుకుతున్నట్టు కాంగ్రెస్‌ను అంటిపెట్టుకున్న కులమంటూ ఏదైనా ఒకటి ఉందని చెప్పలేం. ఒక కులాన్ని మీ పార్టీ వైపు ఆకర్షించడం చాలా అవసరం. ఎందుకంటే విజయ సాధనలో అదే తొలి సోపానం కాబట్టి. ఇక, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటూ మీరు కల్పించిన భరోసాను విశ్వసిస్తే ముస్లింలు వంటి ఇతర వర్గాలు మీ రాజకీయ శిబిరంలోకి వస్తారు.
ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణుల ఓట్లను (జనాభాలో వీరు దాదాపు పది శాతం ఉంటారు) సాధించడం కాంగ్రెస్‌కు సులభమేనన్నది కిశోర్ వినిపిస్తున్న తర్కం. ఎందుకంటే, గతంలో బ్రాహ్మణులు ఆ పార్టీ వెనుకే ఉన్నారు. ఆ మాటయితే నిజమే. గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎన్డీ తివారీ, కమలాపతి త్రిపాఠీ, గోవింద్‌వల్లభ్ పంత్, శ్రీపతి మిశ్రా వంటి వారు బ్రాహ్మణులే. అయితే ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో విజయం సాధించిన ఘటన మూడు దశాబ్దాల క్రితం మాత్రమే జరిగింది. నేనయితే ఆ రోజులను గుర్తుకు తెచ్చుకోగలను కానీ, చాలామందికి ఆ అవకాశం లేదు.
భారత జనాభాలో 65 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్ల లోపు వయసు వాళ్లే. నా అంచనా ప్రకారం ఇప్పుడు ఉన్నవారిలో 1985 నాటి ఎన్నికలలో ఓటు వేసిన వారు ఐదు శాతం కంటే తక్కువే ఉంటారు. అంటే గాంధీలకి ఓటు వేసిన జ్ఞాపకం ఉన్నవారు చాలా పరిమితం. సమస్య అంతా ఇదే. దీనికి మించినదీ, రెండోదీ ఇంకో సమస్య ఉంది. ఎన్నికల ప్రయోజనాల కోసమే స్వార్థ చింతనతో ఒక కులాన్ని ఆకర్షించడం ఏ రాజకీయ పార్టీకయినా అనుకున్నంత సులభ
మేమీ కాదు. అలా ఆకర్షించాలంటే వాళ్లకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఏమివ్వగలదు? బ్రాహ్మణ అభ్యర్థులకు ఆ పార్టీ టికెట్లయితే కేటాయించ గలదు. తరువాత ఏమిటి? కాంగ్రెస్ రాజకీయాలు బ్రాహ్మణులను తన వైపు తిప్పుకుంటాయా? నేనయితే సాధ్యం కాదనే చెబుతాను. విధానపరమైన పరిభాషలో చెప్పాలంటే, మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల మీద దృష్టి పెట్టింది. అంటే కింది కులాల సంక్షేమం మీద దృష్టి పెట్టింది. ఇదే జాతీయ ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత వంటి వాటి ద్వారా రూపుకట్టింది. ఇలాంటి సంక్షేమ పథకాలు మధ్య తరగతి వర్గపు ఓటర్లను ఆకర్షించవు. అలాంటిది బ్రాహ్మణులను ఆకర్షిస్తుందంటే అసలు నమ్మకం కుదరదు.
నిజానికి గడచిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి పడిన ఓట్లలో బ్రాహ్మణుల ఓట్ల శాతం బాగా తగ్గిందంటూ వచ్చిన అధ్యయనాల పునాదిగా వచ్చిందే కిశోర్ వినిపిస్తున్న ఆ తర్కం. 2002 ఎన్నికలలో 50 శాతం, 2007లో 44శాతం, 2012లో 38 శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. అయినా బ్రాహ్మణులు బీజేపీకి ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఎందుకంటే హిందుత్వ సామాజికంగా సంప్రదాయవాదంతో ఉంటుంది. అలాగే బీజేపీ చెప్పే మత సంబంధ విషయాలు - ఆలయాల నిర్మాణం, గోవధ నిషేధం వంటివి వారిని ఆకర్షిస్తాయి. బీజేపీ, ఆరెస్సెస్ రిజర్వేషన్ పట్ల తరచుగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటుంది. అలాగే ఇటీవల కాలంలో దళిత విద్యార్థుల పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తోంది. చాలా మంది బ్రాహ్మణులు బీజేపీకి సానుకూలంగా ఉండటానికి ఇది కూడా కారణమే. వీటిలో ఏవీ కూడా కాంగ్రెస్ చేయగలిగే స్థితిలో లేదు.
ఉత్తరప్రదేశ్‌లో మిగిలిన బ్రాహ్మణుల ఓట్లు ములాయం సింగ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీల మధ్య 20 శాతం వంతున చీలిపోయాయి. ఈ చీలిక ఇలాగే కొనసాగవచ్చు. ఎందుకంటే మిగిలిన కులాల మాదిరిగానే బ్రాహ్మణులు కూడా ఓట్ల విషయంలో ఒకే తాటి మీద లేరు. అందులో చాలామంది శక్తిమంతమైన పార్టీల వైపు మొగ్గుతారు. ఎందుకంటే విజేతల వైపు ఉండాలని వారూ కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మొదట ఎలాంటి ఓటర్లను ఆకర్షించగలదో తన విధానాల వేదిక ద్వారా చూసుకోవాలి. అక్కడే దృష్టి పెట్టాలి. కిశోర్ సలహా మేరకు చేయలేకపోతే, కొత్త ఓటర్లను వెతుక్కోవాలి. తరువాత ఆ ఓటర్లకు అనుగుణంగా ఒక విధానం ఏర్పరుచుకోవాలి.
కాంగ్రెస్ పేరు దారుణంగా దెబ్బతింది. అలాగే అవినీతికీ, అసమర్థతకీ, కుటుంబ పాలనకీ అది విలాసమైంది. ఇప్పుడు గాంధీలు చాలా విభిన్నమైన స్థితిలో ఉన్నారు. ఎమర్జెన్సీ తరువాత ప్రతిపక్షంలోనే ఉన్నప్పటికీ, నాటి కంటే విభిన్నమైన స్థితిలో ఇప్పుడు ఉన్నారు. ఇవాళ ఆ పార్టీ అంతిమ క్షణాలు లెక్కించుకునే స్థితికి చేరుకుంది. ఓటర్లు ఎవరూ, ఏ కులమూ, ఏ వర్గమూ కాంగ్రెస్ అంటే ఆసక్తి చూపడం లేదు. బ్రాహ్మణులను ఆకర్షించాలన్న ఈ వ్యూహం విజయవంతం కావడానికి కూడా అవకాశాలే లేవు.
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
aakar.patel@icloud.com