సెంచరీకి చేరువలో కాంగ్రెస్‌ వారసత్వ పరంపర! | Congress family in indian politics is close to Century | Sakshi
Sakshi News home page

సెంచరీకి చేరువలో కాంగ్రెస్‌ వారసత్వ పరంపర!

Published Sun, Dec 17 2017 1:31 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress family in indian politics is close to Century - Sakshi

అవలోకనం
వాస్తవానికి వంశపారంపర్యత అవసరం లేని పార్టీగా రూపుదిద్దుకోవడానికి, ఆ పార్టీ సీనియర్లలో ఎవరో ఒకరు సారథ్యం స్వీకరించడానికి కాంగ్రెస్‌కు అంతకన్నా మంచి అవకాశం దొరకదు. కానీ బాబ్రీ మసీదు వివాదం... దానితోపాటు సమాజంలోకి, రాజకీయాల్లోకి వచ్చి చేరిన హింస కాంగ్రెస్‌లో అభద్రతాభావాన్ని ఏర్పరచి, దాన్ని నెహ్రూ–గాంధీ కుటుంబం చెంతకు చేర్చాయి. పార్టీ నాయకత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నప్పుడు అప్పటికి అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరిని ఆమె సులభంగా పక్కకు నెట్టగలిగారు.

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ శనివారం బాధ్యతలు స్వీకరిం చారు. ఈ పీఠం ఎక్కిన కుటుంబసభ్యుల్లో ఆయన ఆరో వ్యక్తి. మొదట మోతీలాల్‌ నెహ్రూ, ఆ తర్వాత ఆయన కుమారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ కాంగ్రెస్‌ అధ్యక్షు లుగా పనిచేస్తే అనంతరం వరుసగా ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియా గాంధీ ఆ పదవిని చేపట్టారు. 1919లో తొలిసారి మోతీలాల్‌ నెహ్రూ ఆ బాధ్యతలు స్వీకరించారు. కనుక ఆ కుటుంబం కనుసన్నల్లో కాంగ్రెస్‌ పనిచేయడం ప్రారం భించి 2019నాటికి శతాబ్దం అవుతుంది. వీరంతా ఒకరి తర్వాత ఒకరు అవిచ్ఛి న్నంగా పార్టీని ఏలినవారు కాదు. మధ్యలో నలుగురైదుగురు వేరే నాయకులు ఆ పదవిలో ఉన్నారు. కానీ మోతీలాల్‌ తర్వాత ఆయన కుమారుడు అధ్యక్షుడైనప్పుడే దేశంలో కుటుంబ రాజకీయ వారసత్వం అనే భావన మొగ్గ తొడిగింది. నెహ్రూకు ముందు పార్టీ అధ్యక్ష పదవిలో ఎవరైనా ఒక్క ఏడాదే ఉండేవారు. ఆయన ప్రధాని అయ్యాక ఇది మారింది.

ఇందిరాగాంధీ ప్రాధాన్యత బాగా పెరగడం మొదలయ్యాకే ఒక వ్యక్తి దాదాపు శాశ్వతంగా పార్టీ అధ్యక్ష స్థానంలో ఉండటం అనే సంప్రదాయం అంకురించింది. చెప్పాలంటే పార్టీ చరిత్రలో సోనియాగాంధీ పదవీకాల అవధే దీర్ఘమైనది. ఆమె 20 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఈ రెండు దశాబ్దాలనూ పార్టీ రూపాంతరం చెందిన కాలంగా దేశ ప్రజలు గుర్తుంచుకుంటారు. కాంగ్రెస్‌ సుదీర్ఘకాలం హిందూ పార్టీ గానే మనుగడ సాగించిందని చెబితే యువ పాఠకులు బహుశా ఆశ్చర్యపోతారు. ఆ పార్టీ నాయకత్వ స్థానాల్లో పనిచేసిన చాలామంది కరుడుగట్టిన ఛాందసవా దులే. అలాంటివారంతా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. బెనారస్‌ హిందూ విశ్వ విద్యాలయం సంస్థాపకుడు పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ కాంగ్రెస్‌వాదే. కాంగ్రెస్‌ హయాం మొదలైతే మైనారిటీలకు న్యాయం లభించదని మహమ్మదాలీ జిన్నా నేతృత్వంలోని ముస్లింలీగ్‌ భావించడం, అది చివరకు దేశ విభజనకు దారి తీయడం చరిత్ర. పార్టీని ఆ ముద్ర నుంచి బయటపడేసి, అది హిందూ వ్యతిరేకి అన్న అభిప్రాయం అందరిలో ఏర్పడటానికి సోనియాగాంధీ కారణమని అనుకుం టారుగానీ అది నిజం కాదు. ఆమె పదవీకాలంలో దేశంలో ఆసక్తికరమైన పరిణా మాలు సంభవించాయి. రాజీవ్‌ హత్యానంతరం సోనియా ఛత్ర ఛాయలో పనిచే యక తప్పని పార్టీ అధ్యక్షుడిగా పీవీ నరసింహారావు చివరకు ఎవరికీ అంతుబట్టని వ్యక్తిగా, మేధావిగా మిగిలిపోయారు. ఇప్పటితో పోలిస్తే ఆరోజుల్లో సోనియా ప్రైవేటు వ్యక్తి. చాలా అరుదుగా మాత్రమే కనబడేవారు, మాట్లాడేవారు. అందు వల్లే ఆమె ప్రతి కదలికనూ ఆ రోజుల్లో పత్రికలు విశ్లేషించేవి. అందువల్లే తప్పో ఒప్పో... తనకంటూ ఎలాంటి పదవి లేకుండానే ఆమె అధికార కేంద్రంగా మారా రన్న అభిప్రాయం జనంలో ఏర్పడింది.

వాస్తవానికి వంశపారంపర్యత అవసరం లేని పార్టీగా రూపుదిద్దుకోవడానికి, ఆ పార్టీ సీనియర్లలో ఎవరో ఒకరు సారథ్యం స్వీకరించడానికి కాంగ్రెస్‌కు అంత కన్నా మంచి అవకాశం దొరకదు. కానీ బాబ్రీ మసీదు వివాదం... దానితోపాటు సమాజం లోకి, రాజకీయాల్లోకి వచ్చి చేరిన హింస కాంగ్రెస్‌లో అభద్రతాభావాన్ని ఏర్పరచి, దాన్ని నెహ్రూ–గాంధీ కుటుంబం చెంతకు చేర్చాయి. పార్టీ నాయకత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నప్పుడు అప్పటికి అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరిని ఆమె సులభంగా పక్కకు నెట్టగలిగారు. సోనియా వస్త్రధారణ ఎప్పుడూ చీరెలే. కానీ ఆమె ఇప్పుడు దాన్నొక యూనిఫాంగా మార్చేసుకున్నారు. ఆమె కట్టూ బొట్టూలో ఉండే ప్రత్యేకతను తెలివైన జనం సులభంగానే గుర్తుపడతారు. మన రాజకీయాల్లో అలాంటి ప్రత్యేకత అరుదు. ఆమె హిందీలో మాత్రమే మాట్లాడటం మొదలు పెట్టారు. ఇంగ్లిష్‌ అక్షరాల్లో రాసుకున్న హిందీ ప్రసంగపాఠాలను ఆమె చదువుతుం డగా తీసిన ఫొటోలు పత్రికల్లో వచ్చినప్పుడు చాలామంది గేలిచేశారు. అనంతర కాలంలో దేవనాగర లిపిలో రాసుకున్న ప్రసంగాన్ని చదివే ఫొటోలు వచ్చాయి.

ఆ తర్వాత ఆమెకు రాసుకోవాల్సిన అవసరమే లేకపోయింది. ఏ విషయంపైన అయినా సమర్థవంతంగా, ఆకర్షణీయంగా ఆమె మాట్లాడగలుగుతున్నారు. ప్రజా జీవనరంగంలో ఆమెకంటూ రెండు విశిష్టమైన సందర్భాలున్నాయి. అందులో మొదటిది–రాజ్యాంగం ప్రకారం ఆమెకు అర్హత ఉన్నా 2004లో ప్రధాని పదవి స్వీకరించడానికి విముఖత చూపడం. సోనియా విదేశీ వనిత గనుక ఆ పదవికి ఆమె అనర్హురాలని, ఆమె ప్రధాని అయితే శిరోముండనం చేయించుకుంటానని సుష్మా స్వరాజ్‌ హెచ్చరించారు. తన యూరోపియన్‌ పౌరసత్వాన్ని రద్దు చేసుకోవ డానికి సోనియా కొంత వ్యవధి తీసుకున్నారన్నది అలాంటివారి ఆరోపణ. ఇది నాకు వింతగా అనిపిస్తుంది. గ్రీన్‌ కార్డు కోసం వెంపర్లాడే ఈ దేశంలో దేశభక్తితో కాగి పోయి మనలో ఎందరు అమెరికా, యూరోపియన్‌ పౌరసత్వాలను వదులుకుంటున్నారు? నాకైతే అలాంటివారెవరూ తారసపడలేదు. కానీ ఆమె మాత్రం అందుకు భిన్నంగా ఉండి కూడా ఆ మాటలు పడాల్సివచ్చింది. కెనడా పౌరసత్వం కోసం ఈ దేశ పౌరసత్వాన్ని వదులుకున్నా అక్షయ్‌కుమార్‌ దేశభక్తిని ప్రేరేపిస్తూ చానెళ్లలో కనబడుతుంటారు. ఇక రెండో సందర్భం–పీవీ హయాంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసి ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టిన మన్మోహన్‌ను ప్రధానిగా తీసుకురావడం. ఆయన రెండు దఫాల ప్రభుత్వాలూ ప్రజల దృష్టిలో అవినీతి చిహ్నాలుగా మిగిలి పోయాయిగానీ ఆ కాలం పరివర్తనా దశ అని గుర్తుంచుకోవాలి. సమాచార హక్కు చట్టం, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి కల్పన పథకం, ఇతర మానవీయ చట్టాలు ప్రభుత్వానికి ‘వామపక్ష’ లేదా ‘సామ్యవాద’ ముద్రను ఏర్పరచాయి. కానీ మన్మోహన్‌ చెప్పినట్టు ఆయన పదేళ్ల పదవీకాలమూ కూటమిలోనే గడిచిపోవడం వల్ల పరిమిత స్థాయిలోనే ఆయన వ్యవహరించాల్సివచ్చింది. ఫలితంగా సగటు వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. ప్రస్తుత ఎన్‌డీఏ సర్కారు ఎంతగా ఆర్భాటం చేస్తున్నా దానితో సమం కాలేకపోతోంది. ఆమె హయాంలో జరిగిన చివరి సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్‌కు ఘోరమైన ఫలితాలు తెచ్చిపెట్టి ఉండొచ్చు. కానీ చరిత్ర మాత్రం సోనియాను ఉన్నత వ్యక్తిత్వం కలిగిన, విజయాలు సాధించిన నేతగా సానుకూలంగానే పరిగణిస్తుంది.

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com
ఆకార్‌ పటేల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement